
పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. దాయాది దేశంలోని ఉగ్ర తండాలను నేలమట్టం చేసింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్ర మూకల ఆట కట్టించింది. ఇండియా దెబ్బకు పాకిస్థాన్‌తో పాటు పీఓకేలో 9 ఉగ్రవాద శిబిరాలు నామరూపాల్లేకుండా పోయాయి. 80 మందికి పైగా ముష్కరులు మట్టికరిచారు. ఆపరేషన్ సిందూర్‌ను యావత్ భారత్ ముక్త కంఠంతో ప్రస్తుతిస్తోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు సరైన గుణపాఠం చెప్పారంటూ ఇండియన్ ఆర్మీని కీరిస్తున్నారు.
కేవలం 25 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతంగా ముగించింది ఇండియన్ ఆర్మీ. పాకిస్తాన్‌లోని మురిడ్కేలో ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం జరిపిన దాడిని చూసిన ఒక స్థానికుడు 'ఆపరేషన్ సిందూర్' గురించి రాయిటర్స్ వార్తా సంస్థకు వివరించాడు. తాను నాలుగు డ్రోన్‌లను చూశానని వెల్లడించాడు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పెద్ద పేలుడు శబ్దం వినబడటంతో తాము నిద్ర నుంచి మేలుకున్నామని, అప్పుడే డ్రోన్ దాడులను (Drone Attack) ప్రత్యక్షంగా చూశామని చెప్పాడు.
"రాత్రి 12:45 గంటల ప్రాంతంలో మేము నిద్రపోతుండగా ముందుగా ఒక డ్రోన్ వచ్చింది. ఆ తర్వాత మరో మూడు డ్రోన్లు వచ్చాయి. అవి మసీదులపై దాడి చేశాయి. ప్రతిదీ ధ్వంసమైంది" అని మురిడ్కేకు చెందిన స్థానికుడు ఒకరు రాయిటర్స్‌తో అన్నారు. కాగా, భారత భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఉగ్రవాదులు హతమయ్యారు. పాకిస్తాన్‌లో 4, పీఓకేలో 9 ఉగ్రవాద శిబిరాలను ఇండియన్ ఆర్మీ (Indian Army) ధ్వంసం చేసింది.
తగిన సమాధానం ఇస్తాం: పాక్
ఆపరేషన్ సిందూర్‌ను "నిర్లక్ష్యమైన యుద్ధ చర్య"గా పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అభివర్ణించారు. "తగిన సమాధానం" ఇవ్వడానికి తమ దేశానికి పూర్తి హక్కు ఉందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి), అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ భారీగా కాల్పులు జరిపింది. దీనికి భారత భద్రతా దళాలు దీటుగా జవాబిచ్చాయి. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. కశ్మీర్ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు. సరిహద్దు వెంబడి ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను కోరారు.
చదవండి: ఎవరీ కల్నల్ సోఫియా, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్?