ట్రంప్ నిర్ణయానికి సవాల్.. మమ్దానీ సంచలన వ్యాఖ్యలు | NYC Mayor Mamdani vows to defy Supreme Court deport migrants | Sakshi
Sakshi News home page

ట్రంప్ నిర్ణయానికి సవాల్.. మమ్దానీ సంచలన వ్యాఖ్యలు

Jun 28 2026 11:22 AM | Updated on Jun 28 2026 11:37 AM

NYC Mayor Mamdani vows to defy Supreme Court deport migrants

న్యూయార్క్: అమెరికాలో వలసదారుల అంశంపై రాజకీయ వివాదం మరోసారి తీవ్రరూపం దాల్చింది. వలసదారుల డిపోర్టేషన్ అంశంపై కేంద్ర, స్థానిక ప్రభుత్వాల మధ్య ఉద్రిక్తత మళ్లీ పెరిగింది. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనుసరిస్తున్న కఠిన వలస విధానానికి సంబంధించి, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్‌ మమ్దానీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తీర్పును అమలు చేయబోమని మమ్దానీ ప్రకటించారు.

వలస విధానాల విషయంలో ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించేలా అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ట్రంప్‌ సర్కార్‌కు అనుకూలంగా తీర్పును వెల్లడించింది. హైతీ, సిరియా దేశాలకు చెందిన లక్షలాది మంది వలసదారులకు ఇప్పటివరకు లభిస్తున్న టెంపరరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ (TPS) రక్షణను రద్దు చేసేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో అమెరికాలో చట్టబద్ధంగా నివసిస్తూ, ఉద్యోగాలు చేస్తున్న లక్షలాది మంది ఒక్కసారిగా డిపోర్టేషన్ ముప్పును ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఈ తీర్పును ట్రంప్ ప్రభుత్వం "చట్టానికి దక్కిన విజయం"గా అభివర్ణిస్తుండగా.. మానవ హక్కుల సంఘాలు మాత్రం "వేలాది మంది ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే నిర్ణయం" అంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ తీర్పు తర్వాత డిపోర్టేషన్ ప్రక్రియను వేగవంతం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఈ పరిణామంపై న్యూయార్క్‌ మేమర్‌ మమ్దానీ తాజాగా స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. న్యూయార్క్ నగరం సాంక్చువరీ సిటీ విధానాన్ని కొనసాగిస్తుందని తెలిపారు. ఫెడరల్ డిపోర్టేషన్ చర్యలకు నగర యంత్రాంగం సహకరించబోదని స్పష్టం చేశారు. హైతీ మరియు సిరియా వలసదారుల రక్షణకు కట్టుబడి ఉన్నామని బాంబు పేల్చారు. అవసరమైతే చట్టపరమైన పోరాటం చేస్తామని పేర్కొన్నారు. దీంతో, ఫెడరల్ ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాల మధ్య విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

సాంక్చువరీ సిటీ విధానం అంటే? 
అమెరికాలో వలసదారులపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో తరచుగా వినిపిస్తున్న పదం “సాంక్చువరీ సిటీ విధానం” (Sanctuary City Policy). ఇది ఫెడరల్ వలస అమలు సంస్థలతో సహకారాన్ని పరిమితం చేసి, వలసదారులకు స్థానిక స్థాయిలో కొంత రక్షణ కల్పించే విధానం. స్థానిక నగర ప్రభుత్వాలు అమలు చేసే విధానం ఇది. ఇందులో భాగంగా స్థానిక పోలీసులు వలస స్థితిని అడగరు. చిన్న కేసుల్లో వలస ఆధారంగా డిటైన్ చేయరు. ఫెడరల్ డిపోర్టేషన్ అభ్యర్థనలకు పూర్తిగా సహకరించరు. అయితే తీవ్రమైన నేరాల కేసుల్లో మాత్రం ఫెడరల్ ఏజెన్సీలకు సమాచారం ఇవ్వవచ్చు.

TPS అంటే ఏంటంటే.. 
1990లో అమెరికా కాంగ్రెస్ తీసుకొచ్చిన చట్టం ప్రకారం.. యుద్ధాలు, అంతర్యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, తీవ్ర రాజకీయ అస్థిరత లేదంటే మానవతా సంక్షోభం ఎదుర్కొంటున్న దేశాల పౌరులకు అమెరికా తాత్కాలిక రక్షణ(Temporary Protected Status.. TPS) కల్పిస్తుంది. ఈ హోదా పొందిన వ్యక్తులను వారి స్వదేశాలకు బలవంతంగా పంపించరు. అమెరికాలో చట్టబద్ధంగా ఉద్యోగాలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇది గ్రీన్‌కార్డు లేదంటే పౌరసత్వానికి మార్గం కాదు. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత ప్రభుత్వం ఈ హోదాను రద్దు చేయవచ్చు. అయితే 2010లో సంభవించిన భారీ భూకంపం తర్వాత హైతీ పౌరులకు టీపీఎస్‌ ఇచ్చారు. 2012లో సిరియా అంతర్యుద్ధం ప్రారంభమైన తర్వాత అక్కడి ప్రజలకు కూడా ఈ రక్షణ కల్పించారు. అనంతరం ఆయా దేశాల్లో పరిస్థితులు పూర్తిగా మెరుగుపడకపోవడంతో వరుస ప్రభుత్వాలు ఈ గడువును పొడిగిస్తూ వచ్చాయి.

ఎంతమందిపై ప్రభావమంటే.. 
ఈ తీర్పు తక్షణ ప్రభావం.. సుమారు 3.5 లక్షల మంది హైతీ పౌరులు, 6,100 మంది సిరియా పౌరులపై పడనుంది. వీరంతా ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ, కుటుంబాలతో కలిసి నివసిస్తున్నారు. అయితే దీని ప్రభావం ఇంతటితో ఆగే అవకాశం లేదు. ప్రస్తుతం 17 దేశాలకు చెందిన సుమారు 13 లక్షల మంది టీపీఎస్‌ కింద అమెరికాలో నివసిస్తున్నారు. ఇప్పుడు వచ్చిన తీర్పు ఆధారంగా.. భవిష్యత్తులో ఇతర దేశాల TPSలను కూడా రద్దు చేసే అవకాశాలు పెరిగాయని వలస నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement