
ఖైబర్ ప్రావిన్స్‌లో గల్లంతైన వారి కోసం అన్వేషణ
36 గంటల వ్యవధిలో 200 మందికి పైగా మృతి
అత్యధిక నష్టం ఖైబర్ ఫక్తున్వా ప్రావిన్స్‌లోనే
పీవోకేలో గిల్గిట్–బల్టిస్తాన్ హైవే ధ్వంసం
హెలికాప్టర్ కూలి ఐదుగురు మృత్యువాత
పెషావర్/ఇస్లామాబాద్: పాకిస్తాన్‌తోపాటు పీవోకేలో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర ఆస్తి, ప్రాణనష్టం మిగిల్చాయి. గత 36 గంటల వ్యవధిలో 214 మంది చనిపోగా పదుల సంఖ్యలో జనం గల్లంతయ్యారు. ఖైబర్ ఫక్తున్వా ప్రావిన్స్‌లో ఆకస్మిక వర్షాలు, వరదల్లో అత్యధికంగా 198 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. వీరిలో 14 మంది మహిళలు, 12 మంది చినానరులు ఉన్నారన్నారు. పీవోకేలోని గిల్గిట్–బాల్టిస్తాన్, కారకోరమ్ హైవే దెబ్బతిన్నాయన్నారు.
ఖైబర్ ప్రావిన్స్‌లోని బునెర్ జిల్లాలో అత్యధికంగా 92 మంది చనిపోగా మన్òÙరా జిల్లాలో 17 మంది బజౌర్, బటగ్రామ్ జిల్లాల్లో 18 మంది చొప్పున మృత్యువాతపడ్డారని స్థానిక అధికారులు వెల్లడించారు. లోయర్ దిర్ జిల్లాలో ఐదుగురు, స్వాత్‌లో నలుగురు, సంగ్లాలో ఒకరు చనిపోయారు. పలువురు చిన్నారులు సహా మొత్తం 125 మంది చనిపోయినట్లు విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది.
సహాయ, అన్వేషణ కార్యక్రమాలను ముమ్మరం చేసినట్లు వివరించింది. స్వాత్, బజౌర్‌లలో ఆర్మీ సహాయ కార్యకలాపాల్లో పాల్గొంటోంది. ఆకస్మిక వరదల్లో గిల్గిట్–బల్టిస్తాన్‌లోని ఘిజర్ జిల్లాలో 8 మంది చనిపోగా ఇద్దరు గల్లంతయ్యారు. జిల్లాలో పలు నివాసాలు, వాహనాలు, స్కూలు భవనాలు, ఆరోగ్య కేంద్రాలు ధ్వంసమయ్యాయి. కారకోరమ్ హైవే, బల్టిస్తాన్ హైవే పలు చోట్ల దెబ్బతింది.
లింకు రోడ్లు తెగిపోవడంతో నీలమ్ లోయలోని రట్టి గలి సరస్సు వద్ద చిక్కుకుపోయిన 600 మందికి పైగా పర్యాటకులను అక్కడే ఉండాలంటూ అధికారులు సూచనలు చేశారు. కుందల్ షాహి వద్ద వంతెన కొట్టుకుపోయింది. వరద ఉధృతికి ఒక రెస్టారెంట్‌తో పాటు మూడిళ్లు నేలమట్టమయ్యాయి. జీలమ్ నదికి వరద పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు ప్రారంభించారు. పీవోకేలోని ముజఫరాబాద్ జిల్లాలోని సర్లి సచాలో ఇల్లు కూలి కుటుంబంలోని ఆరుగురు సజీవ సమాధి అయ్యారు. సు«ద్‌నోటి, బాగ్ జిల్లాల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
కూలిన హెలికాప్టర్
సహాయక చర్యల్లో పాల్గొన్న హెలికాప్టర్ శుక్రవారం ఖైబర్ ప్రావిన్స్‌లో కూలిందని అధికారులు తెలిపారు. ఘటనలో ఇద్దరు పైలట్లు, ముగ్గురు సహాయక సిబ్బంది సహా ఐదుగురు చనిపోయారని చెప్పారు. వాతావరణం ప్రతికూలంగా మారడమే ఇందుకు కారణమని భావిస్తున్నామన్నారు. పెషావర్ నుంచి టేకాఫ్ తీసుకున్న ఎంఐ–17 హెలికాప్టర్ మహ్మంద్ జిల్లాలోని చంగి బండా వద్ద కూలిందని వివరించారు. ఘటన నేపథ్యంలో మరో హెలికాప్టర్‌ను సహాయక చర్యల కోసం వినియోగిస్తున్నామన్నారు.