
వాషింగ్టన్: పహల్గాం ఉగ్రదాడి ఘటనపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో దాడి ఘటనకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది. పహల్గాం దాడికి బాధ్యత వహించిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (TRF)ను ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తూ అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు. అలాగే, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ‘లష్కరే తయిబా’ ముసుగు సంస్థ అని వెల్లడించారు. భారత్‌లో ముంబై దాడుల తర్వాత.. ఇదే పెద్ద దాడి అని రూబియో అధికారికంగా ప్రకటించారు.
అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అమెరికా జాతీయ భద్రతా ప్రయోజనాలను కాపాడటం, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, పహల్గాం దాడికి న్యాయం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందు కోసం అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారు. ఇదే మా పరిపాలన నిబద్ధతను చెబుతోంది. పహల్గాం దాడి వెనుక ‘ది రెసిస్టెంట్ ఫ్రంట్’ ఉంది. దీన్ని విదేశీ ఉగ్రవాద సంస్థ (FTO)గా, ప్రత్యేకంగా నియమితమైన గ్లోబల్ టెర్రరిస్ట్ (SDGT) ఆర్గనైజేషన్‌గా అమెరికా గుర్తిస్తోంది. ఇది పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ‘లష్కరే తయిబా’ ముసుగు సంస్థ. 2008 ముంబయి ఉగ్రదాడి తర్వాత భారత్‌లో చోటుచేసుకున్న దాడుల్లో పహల్గాం ఘటనే అతి పెద్దది. భారత భద్రత దళాలపై గతంలో జరిగిన పలు దాడులకు టీఆర్‌ఎఫ్ బాధ్యత వహించిందని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్రవాద దాడి విషయమై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ షాంఘై పర్యటన తర్వాత ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా జైశంకర్.. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని చూశాం. జమ్ము కశ్మీర్ పర్యాటకం, ఆర్థిక వ్యవస్థను అణగదొక్కడానికి, మతపరమైన విభజనను నాటడానికి ఉద్దేశపూర్వకంగా ఈ దాడి చేశారు. ఇది ఖండించదగిన అంశం. ఉగ్రవాద నిర్మూలనకు రాజీలేని వైఖరి అత్యవసరం అని పేర్కొన్నారు.

ఇక, పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. హిందువులను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి నిర్వహించారు. దీంతో ప్రపంచమంతా ఈదాడిని ఖండించింది. అనంతరం భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాక్‌పై దాడులు చేపట్టి ఉగ్రమూకల క్యాంపులను ధ్వంసం చేసింది. దీంతో, పాకిస్తాన్కు భారీ నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది.