నిరాఘాటంగా 15 గంటలు విలేకరుల సమావేశం | Maldives president Mohamed Muizzu breaks Zelensky record by holding 15-hour press conference | Sakshi
Sakshi News home page

నిరాఘాటంగా 15 గంటలు విలేకరుల సమావేశం

May 5 2025 3:15 AM | Updated on May 5 2025 3:27 AM

Maldives president Mohamed Muizzu breaks Zelensky record by holding 15-hour press conference

ముయిజ్జు ప్రపంచ రికార్డు 

జెలెన్‌స్కీని అధిగమించిన మాల్దీవ్స్‌ అధ్యక్షుడు

మాలే: మాల్దీవ్స్‌ అధ్యక్షుడు మొహమ్మద్‌ ముయిజ్జు (46) సరికొత్త రికార్డు సృష్టించారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 15 గంటలపాటు ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు! ఈ విషయంలో ఇప్పటిదాకా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేరిట ఉన్న రికార్డును తిరగరాశారు. ముయిజ్జు విలేకరుల సమావేశం శనివారం ఉదయం పదింటికి ప్రారంభమైంది. 14 గంటల 54 నిమిషాలపాటు కొనసాగింది. కేవలం ప్రార్థనల కోసం మధ్యలో కాసేపు విరామం ఇచ్చారు. ‘‘దాదాపు 25 మంది విలేకరుల ప్రశ్నలకు ముయిజ్జు విరామం లేకుండా సమాధానాలిచ్చారు.

15 గంటల పాటు మాట్లాడి ప్రపంచ రికార్డు నెలకొల్పారు’’ అని మాల్డీవ్స్‌ ప్రభుత్వం అదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 2019 అక్టోబర్‌లో ఉక్రెయిన్‌ అధినేత జెలెన్‌స్కీ 14 గంటల పాటు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అదొక రికార్డుగా నిలిచిపోయింది. అంతకుముందు రికార్డు బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషేంకో పేరిట ఉండేది. ఆయన ఏడు గంటలపాటు ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ముయిజు్టకు ముందు మాల్దీవ్స్‌ అధ్యక్షుడిగా చేసిన మొహమ్మద్‌ నషీద్‌ కూడా ఒక రికార్డు సృష్టించారు. 2009లో ఆయన ప్రపంచంలోనే తొలిసారి సముద్రం అడుగు భాగాన కేబినెట్‌ సమావేశం నిర్వహించారు! వాతావరణ మార్పులతో సముద్రమట్టం పెరిగిపోతోందని, ఫలితంగా తమ దేశం మునిగిపోయే ప్రమాదముందని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకురావడానికే ఈ సాహసానికి పూనుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement