షాకింగ్‌: షోయబ్‌ అక్తర్‌ సోదరుడి అంత్యక్రియల్లో ఉగ్రనేతలు?! | LeT Presence at Shoaib Akhtar's Brother Funeral Triggers Security Concerns | Sakshi
Sakshi News home page

షాకింగ్‌: షోయబ్‌ అక్తర్‌ సోదరుడి అంత్యక్రియల్లో ఉగ్రనేతలు?!

Jun 27 2026 11:35 AM | Updated on Jun 27 2026 1:11 PM

LeT Presence at Shoaib Akhtar's Brother Funeral Triggers Security Concerns

మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సోదరుడు షాహిద్ అక్తర్ అంత్యక్రియలు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ కార్యక్రమంలో లష్కర్-ఎ-తోయిబా (LeT) కీలక నేతలు, అందునా 2025 పహల్గామ్ దాడి అనుమానిత కీలక సూత్రధారి సైఫుల్లా కసూరి సహా పలువురు హాజరైనట్లు వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.

సైఫుల్లా కసూరి గతంలో భారత్‌పై పలు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. 26/11 తరహా దాడుల గురించి, సముద్ర మార్గ దాడుల గురించి అతను చేసిన వ్యాఖ్యలు భద్రతా వర్గాల్లో ఆందోళన కలిగించాయి. పహల్గామ్ దాడికి ఇతనే సూత్రధారి అయ్యి ఉండొచ్చన్న అనుమానాలు సైతం బలంగా ఉన్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలతో అతని కార్యకలాపాలు మరోసారి చర్చలోకి వచ్చాయి. ఎల్‌ఈటీకి రాజకీయ ముఖచిత్రంగా భావించే పాకిస్తాన్ మార్కాజీ ముస్లిం లీగ్ (PMML) ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు సమాచారం.

జూన్‌ 24న గుండెపోటుతో అక్తర్‌ సోదరుడు మరణించారు. ఆయన కూడా మాజీ క్రికెటరే. గురువారం ఇస్లామాబాద్‌లోని హెచ్‌-8 గ్రేవ్‌యార్డ్‌లో అంత్యక్రియలు జరిగాయి. ఆ సమయంలో ప్రార్థనల సమయంలోనే వాళ్లంతా అక్కడ హల్‌చల్‌ చేశారు. 

అయితే.. క్రికెట్‌లో రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా పేరున్న షోయబ్ అక్తర్.. భారత్‌ను ద్వేషించేలా మాట్లాడరు!. కానీ దాయాదుల పోరు సందర్భాల్లో ఎమోషనల్, ఫైర్‌డ్ కామెంట్స్ చేస్తారు. అదే సమయంలో భారత క్రికెట్ సిస్టమ్‌ను చాలాసార్లు ఓపెన్‌గా ప్రశంసించారు కూడా. అయితే షోయబ్‌ అక్తర్‌కు వాళ్లకు సంబంధాలు ఉన్నాయా? లేదంటే షాహిద్ అక్తర్‌కు వాళ్లు దగ్గరా?.. ఇప్పటివరకు షోయబ్ అక్తర్ నుంచిగానీ.. ఆయన కుటుంబం నుంచి ఎటువంటి అధికారిక స్పందన వెలువడలేదు. 

అలాగే పాకిస్తాన్ ప్రభుత్వం లేదంటే స్థానిక భద్రతా సంస్థల నుంచి కూడా అధికారిక ప్రకటన రాలేదు. కానీ, పాక్‌ జాతీయ అసెంబ్లీ స్పీకర్‌ సర్దార్‌ అయాజ్‌ సాధిక్‌ కూడా అంత్యక్రియలకు హాజరు కావడం గమనార్హం. అయితే సోషల్ మీడియాలో మాత్రం నిషేధిత సంస్థల నేతల వీడియోలు వైరల్ అవుతూ తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. 

సాధారణంగా అత్యంత రహస్యంగా, నీడల్లో కనిపించే ఈ నెట్‌వర్క్ సభ్యులు ఓ పబ్లిక్ ఈవెంట్‌లో ఇలా ప్రత్యక్షమవడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఇదే సమయంలో అంతర్జాతీయ స్థాయిలో నిషేధాలు ఉన్నప్పటికీ ఈ ఉగ్రసంస్థలు పాక్‌లో రాజకీయ ముసుగులో కొనసాగుతున్నాయా? అనే ప్రశ్నలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఈ సంఘటన పాకిస్తాన్‌లో ఉగ్ర నెట్‌వర్క్ ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదన్న విమర్శలకు బలం చేకూరుస్తోంది.

భారత్ గతంలో చేపట్టిన చర్యలు, సరిహద్దు భద్రతా చర్యల నేపథ్యంలో ఈ తాజా పరిణామాలు మరింత సున్నితంగా మారాయి. ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న ప్రాంతీయ భద్రతా సమీకరణాల్లో ఈ ఘటన కొత్త చర్చకు దారి తీసింది. పరిశీలకులు మాత్రం.. నిషేధిత సంస్థలు పూర్తిగా కనుమరుగుకాకుండా “పాలిటికల్ షెల్టర్” లేదా “ఫ్రంట్ ఆర్గనైజేషన్స్” ద్వారా కొనసాగుతున్న అవకాశం ఉందని అంటున్నారు.

LeT నెట్‌వర్క్ నేపథ్యం
లష్కర్-ఎ-తోయిబా అనేది 1990ల చివర్లో ఏర్పడిన ఉగ్ర సంస్థగా గుర్తింపు పొందింది. భారత్‌లో 2008 ముంబై దాడులు సహా పలు భారీ దాడుల్లో ఈ సంస్థ పేరు వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయంగా ఇది నిషేధిత ఉగ్ర సంస్థగా గుర్తించబడింది. సైఫుల్లా కసూరి వంటి నేతలు ఈ సంస్థలో కీలక కమాండ్ స్థాయిలో ఉన్నారని భద్రతా విశ్లేషణలు చెబుతున్నాయి. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement