ప్రతీకాత్మక చిత్రం
కరాచీలో ఉద్యోగాల పేరుతో మోసం
60 మంది యువతుల ఫోన్లు కొట్టేసిన కేటుగాళ్లు
కరాచీ: పాకిస్తాన్‌లో ఉద్యోగాల పేరుతో కొందరు దుండగులు కొత్త తరహా మోసానికి పాల్పడ్డారు. ఉద్యోగ మేళా పేరుతో 60 మంది యువతులను నమ్మించి వారి విలువైన ఫోన్లను తీసుకుని పరారయ్యారు. పాక్‌లోని కరాచీ నగరంలో ఈ ఘటన సెప్టెంబర్ చివర్లో జరిగింది. ఈ దురాగతానికి పాల్పడ్డ ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నారు. అతని సహచరులు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మంగళవారం విషయం వెలుగులోకి వచ్చింది.
ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న 60 మంది యువతులను సోషల్ మీడియా ద్వారా సంప్రదించారు. బహ్రియాలో జరిగే ఈవెంట్‌లో స్టాల్స్ నిర్వహించే ఉద్యోగాలు కల్పిస్తామని, రోజుకు 2,000 పాకిస్తానీ రూపాయల వేతనం, ఇతర ప్రయోజనాలు కల్పిస్తామని ఆశ చూపారు. దీనికి సంబంధించిన ఉద్యోగమేళా కరాచీ శివార్లలోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో జరుగుతుందని నమ్మించారు. దీంతో యువతులంతా సెప్టెంబర్ 30న కరాచీ శివార్లలోని ఒక ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. బహ్రియాకు కాకుండా ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లడం చూసి యువతులు ప్రశ్నించగా, మహిళా కోఆర్డినేటర్‌ను కలవడానికి, భోజనం చేయడానికి ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్తున్నామని, ఆ తర్వాత బహ్రియాకు వెళ్లి స్టాల్స్ ఏర్పాటు చేస్తామని నచ్చజెప్పారు.
ఫామ్‌హౌస్ దగ్గర ఆ 60 మంది యువతుల మొబైల్ ఫోన్లను ప్రధాన నిందితుడు తీసుకున్నాడు. కంపెనీ పాలసీ ప్రకారం పని పూర్తయ్యాక వాటిని తిరిగి ఇస్తామని చెప్పాడు. కొద్దిసేపటి తరువాత.. మొబైల్స్ ఉన్న బ్యాగుతో మోసగాళ్లు మోటార్‌సైకిల్‌పై పారిపోయారు. దీంతో యువతులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు అక్కడ ఉన్న మహిళా కోఆర్డినేటర్‌ను, మరో ఇద్దరు అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: డూమ్స్ డే.. నవంబర్ 13న ఏం జరగబోతోంది?


