జపాన్‌లో జననాలు 6.86 లక్షలే | Japan records lowest number of births in more than a century | Sakshi
Sakshi News home page

జపాన్‌లో జననాలు 6.86 లక్షలే

Jun 6 2025 6:12 AM | Updated on Jun 6 2025 6:12 AM

Japan records lowest number of births in more than a century

2024లో రికార్డుస్థాయిలో పడిపోయిన జననాల సంఖ్య 

2023 కంటే 5.7 శాతం తక్కువ నమోదు 

టోక్యో: జపాన్‌లో జనాభా గణనీయంగా తగ్గిపోతోంది. గత ఏడాది జననాల సంఖ్య రికార్డుస్థాయిలో పడిపోయింది. దేశంలో 2024లో కేవలం 6,86,061 మంది శిశువులు జన్మించినట్లు ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. ఒక సంవత్సరంలో ఇంత తక్కువగా జననాలు నమోదు కావడం ఇదే మొదటిసారి. 2023 కంటే ఇది 5.7 శాతం తక్కువ కావడం గమనార్హం. దేశంలో గత 16 ఏళ్లుగా వరుసగా జననాల సంఖ్య పడిపోతోంది. 

ఇక్కడ 1899 నుంచి శిశువుల జననాలను రికార్డు చేయడం మొదలైంది. 7 లక్షల కంటే తక్కువ మంది శిశువులు జన్మించడం 2024లోనే తొలిసారి. దేశంలో 1949లో రికార్డు స్థాయిలో 27 లక్షల మంది జన్మించారు. ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 7 లక్షలకు పడిపోయింది. కొత్త జననాలు పెరగకపోవడం, వృద్ధుల సంఖ్య భారీగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఆర్థిక వ్యవస్థతోపాటు దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని చెబుతున్నారు. జనాభా తగ్గడం అనేది ‘నిశ్శబ్ద అత్యవసర పరిస్థితి’ అని జపాన్‌ ప్రధానమంత్రి షిగేరు ఇషిబా అభివర్ణించారు. జననాల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. నూతన దంపతులకు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. జపాన్‌లో ఒక మహిళ తన జీవితకాలంలో బిడ్డలను కనే సగటు రేటు 2023లో 1.2గా ఉండగా, 2024లో 1.1గా నమోదైంది. జపాన్‌ జనాభా ప్రస్తుతం 12.4 కోట్లు. 2070 నాటికి 8.7 కోట్లకు తగ్గిపోతుందని అంచనా. మొత్తం జనాభాలో 40 శాతం మంది 65 ఏళ్లు దాటినవారే ఉంటారని నిపుణులు చెబుతున్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement