పశ్చిమాసియాను యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా తమపై ఏదైనా చర్యకు ఉపక్రమిస్తే.. ఉన్నఫళంగా స్పందించేందుకు ఇరాన్ సన్నద్ధమైంది. ఈ క్రమంలో ఇరాన్ సైన్యం ఇజ్రాయెల్‌ను కూడా టార్గెట్‌గా చేసుకుంది. ఈ మేరకు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ఓ ప్రకటనను విడుదల చేసినట్లు అరబిక్ మీడియా వెల్లడించింది.
ప్రధానంగా ఐఆర్‌జీసీ తన వద్ద ఉన్న అత్యంత శక్తిమంతమైన హైపర్ సోనిక్ క్షిపణులను ఇజ్రాయెల్‌పై ప్రయోగించేందుకు సిద్ధం చేసినట్లు, ఇరాన్ ఇంటెలిజెన్స్ వర్గాలను అరబిక్ మీడియా ఉటంకించింది. ప్రధానంగా ఇజ్రాయెల్‌కు చెందిన ఎనిమిది వైమానిక, సైనిక స్థావరాలే లక్ష్యంగా హైపర్ సోనిక్ క్షిపణులను సిద్ధం చేసినట్లు చెబుతోంది. తన శక్తిమంతమైన ‘ఫతాహ్’ క్షిపణిని సైతం ఇజ్రాయెల్‌తో పాటు.. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై గురిపెట్టినట్లు పేర్కొంటోంది.
అమెరికా, లేదా ఇజ్రాయెల్ తమపై దాడి చేస్తే.. వెంటనే తమ ప్రతిస్పందనలో భాగంగా హైపర్ సోనిక్ క్షిపణులను ప్రయోగిస్తామని ఇరాన్ వర్గాలు వెల్లడించాయి. ఫతాహ్ క్షిపణులు హైపర్ సోనిక్ వేగంతో లక్ష్యాలను ఛేదించడమే కాకుండా.. మార్గమధ్యంలో వాటి దిశను మార్చే అవకాశాలుంటాయి. అయితే అటు ఇరాన్ గానీ, ఇటు అమెరికా, ఇజ్రాయెల్ గానీ ఈ విషయాలను ధ్రువీకరించడం లేదు.
ఇదీ చదవండి:
నెతన్యాహూ క్రీట్‌కు పారిపోయాడు..!


