ఇరాన్‌ యుద్ధం.. నెతన్యాహు సంచలన నిర్ణయం | Israel–US strikes on Iran heighten regional war fears | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ యుద్ధం.. నెతన్యాహు సంచలన నిర్ణయం

Jun 10 2026 10:48 AM | Updated on Jun 10 2026 3:56 PM

Israel–US strikes on Iran heighten regional war fears

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ప్రమాదకర దశకు చేరుకుంటున్నాయా?. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు తీసుకున్న సంచలన నిర్ణయం అవుననే అంటోంది. ఇకపై అమెరికా మద్దతు ఇచ్చినా.. ఇవ్వకపోయినా ఇరాన్‌పై దాడులు కొనసాగించాలని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో.. మరికొన్ని గంటల్లో ఇరాన్‌పై దాడి చేయబోతున్నామని అమెరికా ముందుగానే ఇజ్రాయెల్‌కు సమాచారం ఇచ్చినట్లు సమాచారం అందుతోంది.

పశ్చిమాసియా సంక్షోభంపై జరిగిన తాజా కేబినెట్ సమావేశంలో నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేసినట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. "అమెరికా మద్దతు లేకుండానే ఇరాన్‌ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావొచ్చు. ఆయుధాల కొరత, అంతర్జాతీయ ఒత్తిడి, దౌత్యపరమైన ఒంటరితనం వంటి మూల్యాలు చెల్లించాల్సి వచ్చినా.. ఆ పరిస్థితికి సిద్ధంగా ఉండాలి" అని ఆయన కేబినెట్‌ వర్గాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే అలాంటి పరిస్థితి రావడం తనకు ఇష్టం లేదని.. కానీ అవసరమైతే అందుకు వెనుకాడబోమని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. 

ఇదే సమావేశంలో.. అమెరికా-ఇరాన్‌ డీల్‌ ప్రతిపాదనలపై ఇజ్రాయెల్ సైన్యాధ్యక్షుడు ఎయాల్ జమీర్ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం చర్చలో ఉన్న ఏ ఇరాన్ ఒప్పందమైనా.. ఇజ్రాయెల్ భద్రతా ప్రయోజనాలకు అనుకూలంగా కనిపించడం లేదని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

గత కొంతకాలంగా.. పశ్చిమాసియా ఉద్రిక్తతలు మిత్రదేశాలైన అమెరికా-ఇజ్రాయెల్‌ మధ్య విబేధాలకు కారణం అవుతున్నాయి. ఇరాన్‌తో అణు ఒప్పందం నేపథ్యంతో శాంతి చర్చలకు ట్రంప్‌ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇటు ఇరాన్‌, అటు లెబనాన్‌లో యుద్దానికి తాత్కాలిక విరమణ ప్రకటించారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ.. హెజ్బొల్లాను లక్ష్యంగా చేసుకుని లెబనాన్‌(దక్షిణ ప్రాంతాల్లో)పై ఇజ్రాయెల్‌ దాడులు జరుపుతూనే వస్తోంది. ఈ దాడుల్లో అమాయక ప్రజలు చనిపోతున్నారు. ఈ పరిణామాలపై ట్రంప్‌ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. 

లెబనాన్‌పై సైనిక చర్య ఆపకపోతే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నెతన్యాహుని ట్రంప్‌ మందలిస్తున్నారని కొంతకాలంగా కథనాలు వెలువడుతున్నాయి. కానీ, నెతన్యాహు మాత్రం అదేం పట్టించుకోకుండా ‘పరిమిత దాడులకు’ ఆదేశాలిస్తూనే వస్తున్నారు. ఇరాన్‌-అమెరికా మధ్య డీల్‌ కుదిరితే.. తమ సైనిక చర్యల స్వేచ్ఛకు భంగం కలుగుతుందనే యోచనలో ఇజ్రాయెల్‌ ఉంది, అందుకే ఇరాన్‌ ఒప్పందంలో తమకూ ప్రాధాన్యం ఇవ్వాలని నెతన్యాహు ట్రంప్‌ను కోరుతున్నట్లు తెలుస్తోంది.

ఇజ్రాయెల్‌కు సమాచారం ఇచ్చి మరీ దాడులు?
ఇటు హర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా అపాచీ హెలికాప్టర్ కూల్చివేతకు ప్రతిస్పందనగా అమెరికా ఇరాన్‌పై వైమానిక దాడులు నిర్వహించింది. ఇరాన్ దక్షిణ ప్రాంతాల్లోని వైమానిక రక్షణ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా యుద్ధవిమానాలు దాడులు నిర్వహించాయి. జాస్క్‌, బందర్ అబ్బాస్‌, ఖెష్మ్ దీవి ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. 

ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా(ఇరాన్‌ దాడికి ప్రతీకారంగానే!) తమ దాడులు పూర్తయ్యాయని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించుకుంది. ఇరాన్ నుంచి వచ్చే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు తమ బలగాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. 

ఇటు.. అమెరికా దాడులకు ఇరాన్ కూడా ఘాటుగానే స్పందించింది. తమపై జరిగిన ప్రతి దాడికి సమాధానం ఇస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చి హెచ్చిరించిన కాసేపటికే దాడులు జరిగాయి. అమెరికా స్థావరాలు, బహ్రెయిన్‌లో ఉన్న అమెరికా ఐదో నౌకాదళాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్‌ ఎదురుదాడులకు దిగినట్లు వార్తలు వెలువడుతున్నాయి. బహ్రెయిన్ ప్రభుత్వం కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఇటు అమెరికా సైనిక దూకుడు కొనసాగితే మరింత తీవ్రమైన ప్రతీకార చర్యలు తప్పవని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది. అయితే..

మరికొన్ని గంటల్లో ఇరాన్‌పై దాడి చేయబోతున్నామని ఇజ్రాయెల్‌కు అమెరికా ముందుగానే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో తాజా దాడులు ఆ సమాచారం అనుగుణంగానే జరిగాయా? లేదంటే అమెరికా ఇరాన్‌పై మరేదైనా కొత్త దాడులకు వ్యూహ రచన చేస్తోందా? అనే ఉత్కంఠ నెలకొంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement