క్లస్టర్‌ బాంబుతో ఇజ్రాయెల్‌ గజగజ | Israel Iran Conflict: What Is A Cluster Bomb Which Banned Years Ago | Sakshi
Sakshi News home page

క్లస్టర్‌ బాంబుతో ఇజ్రాయెల్‌ గజగజ

Jun 20 2025 1:09 PM | Updated on Jun 20 2025 1:39 PM

Israel Iran Conflict: What Is A Cluster Bomb Which Banned Years Ago

ఇరాన్‌- ఇజ్రాయెల్‌ (Iran-Israel) పరస్పర దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా రణరంగంగా మారింది. యుద్ధం 8వ రోజుకి చేరగా.. తమ భూభాగంలోకి ఏకంగా క్లస్టర్‌ బాంబులను ఇరాన్‌ ప్రయోగించిందని ఇజ్రాయెల్‌ సంచలన ఆరోపణలు దిగింది. అసలు ఈ క్లస్టర్‌ బాంబు అంటే ఏమిటి? వాటి ప్రమాద తీవ్రత ఎంత?. ఆ బాంబును చూసి ఇజ్రాయెల్‌ ఎందుకు వణికిపోతోంది? వాటిని నిషేధం నిజంగానే అమల్లో ఉందా?.. 

క్లస్టర్ బాంబు అనేది  ఒక క్షిపణిలా కనిపించినా.. అది గాలిలోనే తెరుచుకుని చిన్న చిన్న పేలుళ్లతో కూడిన సబ్‌మ్యూనిషన్లు (submunitions) అనే మినీ బాంబులను నేల మీదకు వదిలిపెడుతుంది. భూమిని తాకిన వెంటనే అవి పేలిపోతాయి. ఇరాన్ ఇజ్రాయెల్‌పై జరిపిన తాజా దాడిలో.. ఒక మిసైల్ సుమారు 7 కిలోమీటర్ల ఎత్తులో పేలి, దాని నుండి సుమారు 20 చిన్న పేలుడు పదార్థాలు (submunitions) సెంట్రల్ ఇజ్రాయెల్‌లో 8 కిలోమీటర్ల పరిధిలో పడ్డాయని సమాచారం. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో ఇలాంటి బాంబులను వాడినట్టు నమోదైన ఇది మొట్టమొదటి కేసు.

మోస్ట్‌ డేంజర్‌
ఇరాన్‌కు చెందిన ఇతర బాలిస్టిక్‌ క్షిపణుల కంటే ఈ క్లస్టర్‌ బాంబు క్షిపణులు భారీ ముప్పును కలిగిస్తాయనేది ఇజ్రాయెల్‌ వాదన. యుద్ధ తీవ్రతను పెంచేందుకు.. భారీ ముప్పును కలిగించేందుకు.. ఇరాన్‌ ఈ ఆయుధాలను ఉపయోగిస్తోందని, తమ పౌరులకు హాని కలిగించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తోంది. 

డ్యామేజ్‌ ఏంటంటే.. 
ఇజ్రాయెల్‌ వార్తా సంస్థ ప్రకారం.. జూన్‌ 19న జరిగింది ఇదే. క్షిపణుల్లో ఒకటి అజోర్‌లోని మధ్య పట్టణంలో ఓ నివాసాన్ని తాకినట్లు తెలుస్తోంది. అయితే, దీని కారణంగా పెద్దగా ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. కాగా.. ఇందులోని కొన్ని బాంబులు పేలకుండా ఉన్నాయని, ఇవి పౌరుల ప్రాణాలకు నష్టం కలిగిస్తాయని అధికారులు తెలిపారు. ఈక్రమంలో తమ ప్రజలను అప్రమత్తం చేసినట్లు వెల్లడించింది. అలాంటివాటిని గుర్తిస్తే పౌరులు వెంటనే అధికారులను అప్రమత్తం చేయాలని ప్రజలను హెచ్చరించింది. 

వివాదాలకు కేరాఫ్‌గా..
క్లస్టర్‌ బాంబులను వివాదాలకు కేంద్ర బిందువుగా చెబుతుంటారు. అందుకు కారణం.. ఇవి కలిగించే నష్టమే. సాధారణ క్షిపణి ఒక్క స్థలంలో పెద్ద పేలుడు కలిగిస్తుంది. కానీ క్లస్టర్ బాంబు చిన్న చిన్న మ్యూనిషన్లను పెద్ద ప్రాంతంలో చల్లుతుంది. ఒక్కో submunition శక్తి తక్కువైనా, దాని విస్తృత పరిధి కారణంగా ఎక్కువమందికి ప్రమాదం కలిగించవచ్చు. మరీ ముఖ్యంగా జనావాసాలపై గనుక పడితే వీటి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. వీటిలో కొన్నివాటిని భూమిని తాకిన వెంటనే పేలకుండా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. ఇవి తరువాత కాలంలో కూడా పౌరులకు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. అందుకే వీటి వినియోగంపై ఆంక్షలున్నాయి. 

2008లో జరిగిన క్లస్టర్ మ్యూనిషన్లపై సమావేశ ఒప్పందం ప్రకారం.. ఈ బాంబులను ఉపయోగించడం, నిల్వ చేయడం, అమ్మకాలు-కొనుగోలు జరపడం పూర్తిగా నిషేధించబడింది. ఈ ఒప్పందంపై 111 దేశాలు, 12 ఇతర ప్రాంతాలు ఈ ఒప్పందాన్ని అంగీకరించాయి. కానీ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, రష్యా, చైనా, భారత్‌ కూడా ఈ ఒప్పందంపై సంతకాలు చేయలేదు. 

2023లో ఉక్రెయిన్‌ సంక్షోభంలో రష్యాకు వ్యతిరేకంగా క్లస్టర్ బాంబులను అందించిందనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే రష్యా కూడా తమపై క్లస్టర్ బాంబులను ప్రయోగించిందని ఉక్రెయిన్‌ సైతం ఆరోపించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement