భీకర దాడులతో దద్దరిల్లుతున్న టెహ్రాన్‌.. దట్టంగా కమ్మేసిన పొగ | Israel Fresh Counter To Iran Tehran Latest News | Sakshi
Sakshi News home page

వీడియో: భీకర దాడులతో దద్దరిల్లుతున్న టెహ్రాన్‌.. దట్టంగా కమ్మేసిన పొగ

Jun 23 2025 4:25 PM | Updated on Jun 23 2025 5:26 PM

Israel Fresh Counter To Iran Tehran Latest News

అమెరికా జోక్యంతో.. పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరో మలుపు తిరిగాయి. ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య యుద్ధం 11వ రోజు కొనసాగుతోంది. తాజాగా సోమవారం ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్‌ భారీ దాడులకు తెగబడింది. ఈ దాడుల్లో నష్టం భారీగానే సంభవించినట్లు తెలుస్తోంది. 

అక్కడి మీడియా కథనాల ప్రకారం.. భారీ పేలుళ్లతో శబ్దాలు వినిపించాయి. ఆపై పొగ నగరాన్ని దట్టంగా అలుముకుంది. నష్టం వివరాలు తెలియ రావాల్సి ఉంది. నగరంలోని జన రద్దీ ఉండే ప్రాంతం నుంచే ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే.. టెల్‌ అవీవ్‌ మాత్రం ఇరాన్‌ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు ప్రకటించుకుంది. 

ఇరాన్‌ మీడియా సంస్థలు కూడా అందుకు సంబంధించిన దృశ్యాలు ప్రసారం చేస్తున్నాయి. ఐఆర్‌జీసీ, పోలీస్‌ నిఘా కేంద్రాలు, విద్యా సంస్థలు, విద్యుత్‌ కేంద్రాలపై దాడి జరిగినట్లు ఇరాన్‌ ఇంటర్నేషనల్‌ ఛానెల్‌ కథనాలు ఇస్తోంది. ఇవెన్‌ జైలు పూర్తిగా ధ్వంసమైందని ప్రకటించాయి.

జూన్‌ 13వ తేదీ నుంచి ఇరాన్‌–ఇజ్రాయెల్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో ఇప్పటిదాకా తీవ్ర ప్రాణనష్టం సంభవించింది. తాజా సమాచారం ప్రకారం.. ఇరాన్‌లో 585 మంది మరణించారు. వీళ్లలో 126 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. క్షతగాత్రుల సంఖ్య సుమారు 1326గా ఉంది.

👇
జూన్ 13, 2025
ఇజ్రాయెల్‌ "ఆపరేషన్ రైజింగ్ లయన్" ప్రారంభించింది.

  • ఇరాన్‌లోని 12కు పైగా సైనిక స్థావరాలు, పౌర మౌలిక సదుపాయాలపై బాంబుల దాడులు.
  • మృతుల సంఖ్య 224కి చేరింది, వీరిలో 90 మందికిపైగా పౌరులు.

👇
జూన్ 14, 2025

  • ఇరాన్‌ ప్రతీకార దాడులు ప్రారంభం – "టూ ప్రామిస్ 3" ఆపరేషన్
  • దాదాపు 100 బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్‌పై దాడి.
  • టెల్‌ అవీవ్‌, జెరూసలెం, రమత్‌గాన్ వంటి నగరాల్లో పేలుళ్లు.
  • ఇజ్రాయెల్‌ 70% క్షిపణులను గాల్లోనే కూల్చివేసినట్టు ప్రకటించింది.

👇
జూన్ 15, 2025

  • ఇరాన్‌ 150కు పైగా లక్ష్యాలపై దాడులు చేసినట్టు ప్రకటించింది.
  • ఇజ్రాయెల్‌ వైమానిక స్థావరాలు, కమాండ్ సెంటర్లు లక్ష్యంగా మారాయి.
  • ఇరాన్‌ సైనిక జనరల్స్‌ బ్రిగేడియర్‌ మెహ్రబి, రబ్బాని మరణించారు.


👇
జూన్ 16, 2025

  • ఇజ్రాయెల్‌ టెహ్రాన్‌పై గగనతల దాడులు కొనసాగించిందని నివేదికలు.
  • ఇరాన్‌ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసింది.
  • ప్రపంచ దేశాలు శాంతి చర్చల కోసం పిలుపునిచ్చాయి.


👇
జూన్ 17, 2025

  • ఇజ్రాయెల్‌ దాడుల్లో 585 మంది మృతి, 1326 మంది గాయాలు – మానవ హక్కుల సంఘాల నివేదిక.
  • టెహ్రాన్‌లోని చమురు శుద్ధి కేంద్రాలు, అణు పరిశోధనా కేంద్రాలు ధ్వంసం.

👇
జూన్ 18, 2025

  • ఇరాన్‌ హైపర్‌సోనిక్ క్షిపణితో ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడి చేసినట్టు ప్రకటించింది.
  • టెల్‌ అవీవ్‌, హైఫా ప్రాంతాల్లో పేలుళ్లు.
  • జెరూసలెంలోని అమెరికా ఎంబసీ తాత్కాలికంగా మూసివేత.

👇
జూన్ 19, 2025

  • ఇజ్రాయెల్‌ "ఆపరేషన్ సైలెంట్ స్టార్మ్" ప్రారంభించింది.
  • ఇరాన్‌ కమ్యూనికేషన్ హబ్‌లు, రాడార్ కేంద్రాలపై దాడులు.
  • ఇరాన్‌ సైనికాధికారి బ్రిగేడియర్ హుస్సేన్ అబ్దోల్లాహీ మరణం.

👇
జూన్ 20, 2025

  • ఇరాన్‌ డ్రోన్లతో ఇజ్రాయెల్‌ నౌకాదళ స్థావరాలపై దాడి.
  • ఇజ్రాయెల్‌ ఐరన్ డోమ్ వ్యవస్థ 80% క్షిపణులను అడ్డుకుంది.
  • ఇరాన్‌ 40 మంది సైనికులు మృతి చెందినట్టు ప్రకటించింది.

👇
జూన్ 21–22, 2025

  • పరస్పర క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి.
  • ఇరాన్‌ అణు శాస్త్రవేత్త డాక్టర్ అమీర్ హొసేన్ ఫెక్హీ హత్య.
  • ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు: “ఖమేనీ హతమైతేనే యుద్ధం ముగుస్తుంది” అని ప్రకటన.

అమెరికా, జూన్ 22, 2025 (భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 4:10 గంటలకు) ఇరాన్‌పై భారీ వైమానిక దాడులు ప్రారంభించింది. ఈ దాడులను "ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్" అనే కోడ్ పేరుతో నిర్వహించారు.

📍 దాడి జరిగిన ముఖ్య ప్రాంతాలు:

  1. ఫోర్డో అణు కేంద్రం – పర్వతాల లోతులో ఉన్న ఈ కేంద్రంపై B-2 బాంబర్లతో బంకర్ బస్టర్ బాంబులు ప్రయోగించారు.
  2. నతాంజ్ యురేనియం శుద్ధి కేంద్రం – జలాంతర్గాముల నుంచి ప్రయోగించిన టోమాహాక్ క్షిపణులు ఈ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి.
  3. ఇస్ఫహాన్ అణు పరిశోధనా కేంద్రం – ఇదే విధంగా టోమాహాక్ క్షిపణులతో ధ్వంసం చేశారు.

✈️ దాడి వివరాలు:

  • 7 B-2 స్టెల్త్ బాంబర్లు అమెరికా నుంచి నేరుగా ప్రయాణించి లక్ష్యాలను ఛేదించాయి.
  • 30 టోమాహాక్ క్షిపణులు రెండు జలాంతర్గాముల నుంచి ప్రయోగించబడ్డాయి.
  • మొత్తం 125కి పైగా యుద్ధ విమానాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.

👇
జూన్ 23, 2025

  • టెహ్రాన్‌లో భారీ పేలుళ్లు, ప్రజలు నగరం విడిచి తరలింపు.
  • ఇరాన్‌ సుప్రీం లీడర్ ఖమేనీ: “యుద్ధం మొదలైంది” అంటూ సోషల్ మీడియాలో ప్రకటన.
  • యుద్ధం మరింత తీవ్రతరమవుతుందన్న అంచనాలు.

ఇరాన్‌ తరఫున మరణించిన ఉన్నతాధికారులు:

  • మేజర్ జనరల్ హుస్సేన్ సలామీ – ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) చీఫ్.

  • మేజర్ జనరల్ మొహమ్మద్ బాగెరీ – ఇరాన్‌ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్.

  • అలీ షమఖానీ – మాజీ జాతీయ భద్రతా చీఫ్.

  • జనరల్ ఘోలం అలీ రషీద్ – ఖతమ్ అల్-అన్బియా రాష్ట్ర ప్రధాన కార్యాలయ అధిపతి.

  • వీళ్లతో పాటు ఆరుగురు ప్రముఖ అణు శాస్త్రవేత్తలు కూడా ఈ దాడుల్లో హతమయ్యారు. వీరిలో అబ్దొల్‌హమీద్ మినౌచెహ్ర్, అహ్మద్‌రెజా జోల్ఫాఘరీ, అమీర్‌హొస్సేన్ ఫెక్హీ తదితరులు ఉన్నారు. ఈ స్థాయి నాయకుల మరణం ఇరాన్‌కు వ్యూహపరంగా పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. 

ఇక.. ఇజ్రాయెల్‌ వైపు ప్రాణనష్టం వివరాలు స్పష్టంగా తెలియరావడం లేదు. కానీ ఇరాన్‌ క్షిపణి దాడుల వల్ల రాజధాని టెల్‌ అవీవ్‌  సహా చాలా ప్రాంతాల్లోప్రాణ నష్టం సంభవించి ఉంటుందనేది ఒక అంచనా. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement