
వాషింగ్టన్: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మరింత భీకరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా కూడా ఇరాన్‌పై విరుచుకుపడేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భద్రతా బృందంతో 80 నిమిషాల పాటు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఇరాన్‌పై దాడుల గురించి చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
ఇక, జీ-7 కూటమి శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు కెనడాకు చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షెడ్యూల్ కంటే ఒకరోజు ముందే హఠాత్తుగా స్వదేశానికి వెళ్లిపోయారు. కెనడాలో జరగాల్సిన కీలక భేటీలను రద్దు చేసుకున్నారు. ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం ఉధృతంగా మారుతుండటంతో తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడానికే ఆయన అమెరికా చేరుకున్నారు. అమెరికా వెళ్లిన అనంతరం, అమెరికా జాతీయ భద్రతా బృందంతో ట్రంప్ సమావేశమయ్యారు. దాదాపు 80 నిమిషాల పాటు యుద్ధ పరిస్థితులపై సమీక్షించారు. చర్చల అనంతరం టెహ్రాన్‌లోని న్యూక్లియర్ కేంద్రాలపై దాడులు చేసేందుకు ఇజ్రాయెల్‌తో కలిసి ముందుకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీనియర్ నిఘా అధికారి ఒకరు తెలిపారు. దీంతో, ఇరాన్‌పై దాడులు మరింత తీవ్రతరం కానున్నాయి.
ఇదిలా ఉండగా.. అంతకుముందే ట్రంప్.. ఇజ్రాయెల్ దాడులు భీకరంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని చెప్పారు. యుద్ధం ఆగాలా? లేక కొనసాగాలా? అనేది ఇరాన్ చేతుల్లోనే ఉందని అమెరికా అధ్యక్షుడు పరోక్షంగా తేల్చిచెప్పారు. ఇంకా ఆలస్యం కాకముందే ఆణు కార్యక్రమానికి తెరదించాలని ఇరాన్‌కు ట్రంప్ హితవు పలికారు. దాడులు ఆగాలంటే అణ్వస్త్రాల ఆలోచన మానుకోవాలని, ఇజ్రాయెల్‌తో ఒప్పందానికి రావాలని సూచించారు. ఒప్పందం విషయంలో ఇప్పటికే 60 రోజుల సమయం లభించినా ఇరాన్ పాలకులు సద్వినియోగం చేసుకోలేదని తప్పుపట్టారు. మరో గత్యంతరం లేక ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్‌పై దాడులకు దిగిందని అభిప్రాయపడ్డారు.
ఇదే సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో మాకు స్పష్టంగా తెలుసు. ఆయన్ను లక్ష్యంగా చేసుకోవడం మాకు చాలా తేలిక. ఆయన సురక్షితంగానే ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన్ను తొలగించే (చంపే) ఉద్దేశం మాకు లేదు. అయితే, పౌరులు లేదా అమెరికా సైనికులపై క్షిపణి దాడులు చేయడాన్ని సహించే ప్రసక్తే లేదు. మా సహనం నశిస్తోంది. ఈ విషయంపై దృష్టి సారించినందుకు ధన్యవాదాలు. సుప్రీం లీడర్ బేషరతుగా లొంగిపోతే మంచిది అని స్పష్టం చేశారు.
ఇరాన్‌కు అణుబాంబు దక్కదు
అణు బాంబు తయారీకి ఇరాన్ అత్యంత సమీపంలోకి వచ్చిందని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయినప్పటికీ ఇరాన్ అణు బాంబును తయారు చేసుకొనే అవకాశం ఎంతమాత్రం లేదని స్పష్టంచేశారు. కెనడా నుంచి స్వదేశానికి వస్తూ ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇరాన్ అణ్వాయుధాలు అభివృద్ధి చేయడం లేదంటూ అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ ఈ ఏడాది మార్చి నెలలో చేసిన ప్రకటనను ట్రంప్ కొట్టిపారేశారు. ఆమె ఏం చెప్పారో తాను పట్టించుకోనన్నారు.