
గాజా: ఇజ్రాయెల్ సైన్యం గాజాలో నిరంతర దాడులు కొనసాగిస్తోంది. అయితే ఈ ప్రాంతంలో ఆకలికేకలు మిన్నంటుతున్న తరుణంలో.. ఇక్కడి మూడు జనావాస ప్రాంతాలలో రోజుకు 10 గంటల పాటు ఘర్షణలకు ఇజ్రాయెల్ సైన్యం పరిమిత విరామం ఇచ్చింది. 21 నెలలుగా కొనసాగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ తీరుపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఇజ్రాయెల్ తన దూకుడుతనాన్ని నెమ్మదింపజేస్తోంది.
గాజా భూభాగంలోకి ప్రవేశించే మానవతా సహాయం స్థాయిని పెంచడానికి ఇక్కడి మూడు ప్రాంతాలలో వ్యూహాత్మక విరామాన్ని ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఆదివారం నుండి తదుపరి నోటీసు వచ్చే వరకు ప్రతి రోజు ఉదయం 10:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు ఈ విరామం ఉంటుందని తెలిపింది. అలాగే బాధితులకు సహాయం అందించేందుకు సురక్షితమైన మార్గాలను ఏర్పాటు చేస్తామని సైన్యం తెలిపింది. గాజాలో సంభవిస్తున్న కరువుపై ఆహార నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. అయితే హమాస్ తన పాలనను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నదని ఆరోపిస్తూ, ఇజ్రాయెల్.. గాజాకు అందే సహాయాన్ని పరిమితం చేసింది.
ఇటీవలి కాలంలో గాజాకు సంబంధించి ఇంటర్నెట్‌లో కనిపిస్తున్న చిత్రాల్లో కృశించిన పిల్లల చిత్రాలు అందరినీ కలచివేశాయి. ఇజ్రాయెల్ తీరుపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. కాగా ఇజ్రాయెల్ సహాయ ఆంక్షలను సడలించడానికి తీసుకున్న చర్యలను ఐక్యరాజ్యసమితి ఆహార సంస్థ స్వాగతించింది. అంతర్జాతీయ ఒత్తిడి అనంతరం ఇజ్రాయెల్ గత మేలో గాజా దిగ్బంధనను కొద్దిగా సడలించింది. నాటి నుంచి ఐక్యరాజ్యసమితి, ఇతర సహాయ బృందాలు దాదాపు 4,500 ట్రక్కుల మానవతా సహాయాన్ని పంపాయి. ప్రపంచ ఆహార కార్యక్రమం ఒక ప్రకటనలో.. గాజా జనాభాలో మూడింట ఒక వంతు మంది రోజుల తరబడి ఆహారం తినడం లేదని పేర్కొంది.