సంబరాల వేళ స్విట్జర్లాండ్‌లో పేలుడు  | Switzerland ski resort town of Crans Montana News Details | Sakshi
Sakshi News home page

సంబరాల వేళ స్విట్జర్లాండ్‌లో పేలుడు 

Jan 1 2026 12:05 PM | Updated on Jan 2 2026 5:42 AM

Switzerland ski resort town of Crans Montana News Details

బార్‌లో భారీ పేలుడుతో 40 మంది సజీవదహనం 

115 మందికి గాయాలు 

మృతుల్లో పలు దేశాల పౌరులు 

మంచుమయ ఆల్ప్స్‌ పర్వతశ్రేణుల్లోని క్రాన్స్‌–మోంటానా సిటీలో విషాదం 

కొనసాగుతున్న సహాయక చర్యలు 

రంగంలోకి 10 హెలికాప్టర్లు, 40 అంబులెన్సులు, 150 మంది అగి్నమాపక సిబ్బంది 

బాణసంచాకు నిప్పంటుకోవడంతో చెలరేగిన మంటలు 

అసలు కారణం ఇంకా తెలీదని ప్రకటించిన ప్రభుత్వం 

ఉగ్రదాడి కోణాన్ని కొట్టిపారేసిన సర్కార్‌

క్రాన్స్‌–మోంటానా(స్విట్జర్లాండ్‌): ఎప్పుడు దట్టంగా కమ్ముకున్న మంచుతో దవళవర్ణంతో ధగధగా మెరిసిపోయే స్విట్జర్లాండ్‌లోని ఆల్ప్స్‌ పర్వతశ్రేణుల్లో ఒక్కసారిగా నిప్పుకణికలు ఎగసిపడ్డాయి. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రఖ్యాత క్రాన్స్‌–మోంటానాలోని ప్రముఖ బార్‌లో జనం వేడుకల్లో మునిగిపోయిన వేళ భారీ పేలుడు రూపంలో మృత్యుదేవత అక్కడివారిని కబళించివేసింది. 

డిసెంబర్‌ 31వ తేదీ అర్ధరాత్రి దాటాక 1.30 గంటలప్పుడు హఠాత్తుగా లీ కాన్‌స్టలేషన్‌ బార్, లాంజ్‌లో చెలరేగిన మంటలకు 40 మంది బలయ్యారు. 115 మంది గాయపడ్డారు. మంటలకు తాళలేక పలువురు పర్యాటకులు బార్‌ అద్దాల కిటికీలు బద్దలుకొట్టి బయటకు దూకారు. కాలిన గాయాలతో పలువురు రక్తమోడుతూ రోడ్డుపై పరుగులు పెట్టారు. ఇదంతా ఒక హారర్‌ మూవీని తలపించిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు ఫ్రెంచ్‌ ‘బీఎఫ్‌ఎం’టీవీకి చెప్పారు. 

తొలుత భారీ శబ్దం వినిపించి తర్వాత బార్‌ నుంచి దట్టమైన పొగలు వెలువడ్డాయని మరో ప్రత్యక్షసాక్షి చెప్పారు. అనూహ్య ఘటనలో క్రాన్స్‌–మోంటానా సిటీ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే 10 హెలికాప్టర్లలో రంగంలోకి దిగి వెంటనే మంటల్ని ఆర్పే పనిలో పడ్డారు. క్షతగాత్రులను సమీప వలేస్‌ ఆస్పత్రిలో చేర్పింంచారు. క్షతగాత్రులతో ఆ ఆస్పత్రి ఐసీయూ యూనిట్‌ పూర్తిగా నిండిపోయింది. తీవ్రగాయాలైన వారిని మిలాన్‌ నగర ఆస్పత్రులకు తరలించారు. బార్‌లో గాయపడిన అతిథులను తరలించేందుకు 40 అంబులెన్సులను రప్పించారు. 

150కిపైగా అగ్నిమాపక సిబ్బంది బార్‌లో మంటల్ని ఆర్పేందుకు శ్రమించారు. కాలిపోయిన మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉంది. ‘‘పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో స్థానికులు, ఇటాలియన్లు సహా పలు దేశాల పౌరులు ఉన్నారు. నూతన ఏడాది వేడుకలు కావడంతో వేర్వేరు దేశాల సందర్శకులు హాజరయ్యారు. మృతుల బంధువుల డీఎన్‌ఏ శాంపిళ్లు తెప్పించి సరిపోల్చి మృతదేహాలను అప్పగించేందుకు కొన్ని వారాల సమయం పడుతుంది’’ అని వలేస్‌ సబ్‌డివిజన్‌ పోలీస్‌ కమాండర్‌ ప్రెడెరిక్‌ గిస్లెర్‌ స్పష్టంచేశారు. ఘటనను ఉగ్రదాడిగా భావించట్లేమని ఈ ప్రాంత అటార్నీ జనరల్‌ బేర్రిస్‌ పిలౌడ్‌ చెప్పారు. 

ఇరుకైన మెట్లే ఇరికించాయా? 
మంటలు అంటుకోవడానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కొత్త ఏడాది మొదలవగా పేల్చిన బాణసంచా నుంచి వెలువడిన నిప్పుకణికల కారణంగా మంటలు అంటుకున్నాయని పలువురు చెప్పారు. ‘‘అతిథుల కోసం నిలువుగా పేర్చిన షాంపేన్‌ బాటిళ్లపై ఉంచిన ఒక బర్త్‌డే కొవ్వొత్తి మంటలు  పై కప్పుకు అంటుకున్నాయి. దాంతో రెప్పపాటులో మంటలు చెక్క సీలింగ్‌ అంతటా చుట్టుముట్టాయి. మొదటి ఫ్లోర్‌ మొత్తం మంటల్లో చిక్కుకుంది. పైన దాదాపు 200 మంది ఉన్నారు. 30 సెకన్ల వ్యవధిలో అంత మంది ఇంత చిన్న ఇరుకు మెట్ల మార్గం గుండా కిందకు దిగిరావడం సాధ్యంకాలేదు.

 మేం అదృష్టంకొద్దీ ఎలాగోలా బయటపడ్డాం. బాధితుల్లో చాలా మంది 16–26 ఏళ్ల వయసు వారే’’ అని బార్‌లో సంబరాల్లో పాల్గొన్న ఫ్రాన్స్‌ జంట ఎమ్మా, అల్బనీలు చెప్పారు. ‘‘వాస్తవిక కారణాలను ఇప్పుడే వెల్లడించలేం. సమగ్ర దర్యాప్తు తర్వాత అగ్ని ప్రమాదానికి కారణాలు వెల్లడిస్తాం’’ అని స్థానిక ప్రభుత్వ సారథి మ్యాథియస్‌ రెనార్డ్‌ చెప్పారు. అధ్యక్షుడిగా బాధ్యతలు మొదలెట్టిన తొలిరోజే భారీ అగ్నిప్రమాదం జరగడంతో స్విట్జర్లాండ్‌ అధ్యక్షుడు గే పార్మెలిన్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

4 దశాబ్దాలుగా ప్రముఖ స్కీ రిసార్ట్‌ బార్‌గా పేరు.. 
క్రాన్స్‌–మోంటానాలోని స్విస్‌ స్కీ రిసార్ట్‌లోని అతిపెద్ద బార్‌గా లీ కాన్‌స్టెలేషన్‌కు పేరుంది. దీనిని గత 40 ఏళ్లుగా నడుపుతున్నారు. ఇది రెండంతస్తుల భవంతి. కింది ఫ్లోర్‌లో అతిపెద్ద బార్‌ ఉంది. అక్కడ జనం మద్యం సేవిస్తూ నృత్యం చేసే ఏర్పాటు ఉంది. పై ఫ్లోర్‌లో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు చూసేందుకు భారీ ఎల్‌ఈడీ టీవీలున్నాయి. ఇందులో ఒకేసారి 300 మంది ఆతిథ్యం స్వీకరించవచ్చు. ఘటన జరిగినప్పుడు బార్‌లో ఎంత మంది ఉన్నారనేది తెలియాల్సి ఉంది.

 

 

Advertisement
 
Advertisement
Advertisement