హర్ముజ్‌పై పట్టు కోసం ఇరాన్‌ కొత్త ఎత్తుగడ | Irans New Hormuz Gambit: Tightening Grip on the World’s Oil Lifeline | Sakshi
Sakshi News home page

హర్ముజ్‌పై పట్టు కోసం ఇరాన్‌ కొత్త ఎత్తుగడ

Aug 24 2026 8:43 AM | Updated on Aug 24 2026 8:43 AM

Irans New Hormuz Gambit: Tightening Grip on the World’s Oil Lifeline

హర్ముజ్‌.. ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయలాంటి ఈ కీలక సముద్ర మార్గంపై ఆధిపత్య పోరు మరింత తీవ్రంగా మారుతోంది. జలసంధిపై ఇరాన్‌ ప్రభావం, అమెరికా ఒత్తిడి మధ్య నౌకల రాకపోకలపై ఉత్కంఠ కొనసాగుతోంది. దీనికి తోడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు, తీసుకుంటున్న చర్యలు కూడా ఈ పోరుకు మరింత ఆజ్యం పోశాయి. ఈ నేపథ్యంలో జలసంధిపై తన పట్టు సడలుతోందనే సంకేతాల మధ్య.. ఇరాన్‌ కొత్త వ్యూహాలను అమలు చేయాలని నిర్ణయించింది.

గత కొంతకాలంగా హర్ముజ్‌ జలసంధిలో పరిస్థితులు మారిపోయాయి. ఇరాన్‌ సూచించే మార్గం కంటే.. ఒమన్‌ తీరానికి సమీపంలోని ప్రత్యామ్నాయ మార్గాన్నే అంతర్జాతీయ నౌకలు ఎక్కువగా ఎంచుకుంటున్నాయి. షిప్‌ ట్రాకింగ్‌ సంస్థల సమాచారం ప్రకారం.. ఇటీవల హర్ముజ్‌ దాటిన నౌకల్లో 80 శాతానికి పైగా ఒమన్‌ మార్గంలో ప్రయాణించినట్లు తెలుస్తోంది. అమెరికా నౌకాదళ భద్రతతో ఈ మార్గంలో రాకపోకలు పెరిగినట్లు విశ్లేషణలు చెబుతున్నాయి. దీంతో హర్ముజ్‌పై ఇరాన్‌ నియంత్రణ సడలుతోందనే చర్చ మొదలైంది. సరిగ్గా ఇదే సమయంలో.. నౌకల నుంచి సేవల పేరుతో రుసుములు వసూలు చేసే ప్రతిపాదనకు ఇరాన్‌ పార్లమెంట్‌ కమిషన్‌ ఆమోదం తెలిపింది.

టెహ్రాన్‌ కొత్త ప్లాన్‌
ఇరాన్‌ పార్లమెంట్‌ జాతీయ భద్రత, విదేశాంగ విధాన కమిషన్‌ ‘హర్ముజ్‌ జలసంధి భద్రత, అభివృద్ధి కోసం వ్యూహాత్మక చర్యలు’ ప్రణాళికలోని ఆర్టికల్‌-3కు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం హర్ముజ్‌ గుండా ప్రయాణించే నౌకలకు ఇరాన్‌ అందించే సముద్ర భద్రత, పర్యావరణ సేవలు, ప్రత్యేక పరిస్థితుల్లో ఇంధన సరఫరా, బీమా తదితర సేవలకు రుసుములు వసూలు చేయనుంది. ఈ ఫీజులను హర్ముజ్‌ గుండా ప్రయాణించేందుకు అనుమతి పొందిన దేశాల నౌకల నుంచే వసూలు చేస్తామని ఇరాన్‌ తెలిపింది. చెల్లింపులు ఇరాన్‌ కరెన్సీ రియాల్‌ లేదంటే టెహ్రాన్‌ నిర్ణయించే ఇతర కరెన్సీలో ఉండవచ్చని వెల్లడించింది.

అమెరికా మద్దతుదారులకు ఇరాన్‌ వార్నింగ్‌
అమెరికా ఆంక్షలపై ఇరాన్‌ మరింత ఘాటుగా స్పందిస్తోంది. ఆర్థిక ఒత్తిడి కొనసాగితే హర్ముజ్‌ నుంచే కాదు.. పర్షియన్‌ గల్ఫ్‌ నుంచి కూడా ఒక్క చుక్క చమురు బయటకు వెళ్లదని ఇరాన్‌ సుప్రీం నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ కార్యదర్శి మొహ్సెన్‌ రెజాయ్‌ హెచ్చరించారు. అమెరికా ఆర్థిక చర్యలకు మద్దతిచ్చే దేశాలను కూడా ఇరాన్‌ వ్యతిరేక శక్తులుగా పరిగణిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. చమురు రవాణా విషయంలో ఎలాంటి ఒత్తిడినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని టెహ్రాన్‌ సంకేతాలు ఇస్తోంది.

నౌకలకు ఇరాన్‌ హెచ్చరికలు
హర్ముజ్‌ నిబంధనలు ఉల్లంఘించే నౌకలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇరాన్‌ పర్షియన్‌ గల్ఫ్‌ స్ట్రెయిట్‌ అథారిటీ హెచ్చరించింది. నిబంధనలు అతిక్రమించే నౌకలకు జరిమానాలు, భవిష్యత్‌ ప్రయాణాలపై ఆంక్షలు, అవసరమైతే స్వాధీనం వంటి చర్యలు ఉంటాయని తెలిపింది. ఉల్లంఘన చేసే నౌకలకు సహకరించే షిప్పింగ్‌ సంస్థలు, సరుకు యజమానులను కూడా సమస్యాత్మక జాబితాలో చేర్చుతామని పేర్కొంది.

ఇంకా రూట్‌లోనే..
ఇరాన్‌ బెదిరింపులు పెద్దగా పని చేయడం లేదా? అనే చర్చా నడుస్తోంది. మరోవైపు హర్ముజ్‌లో తన ప్రభావాన్ని పెంచుకునేందుకు అమెరికా కూడా ప్రయత్నిస్తోంది. ఒమన్‌ మార్గంలో ప్రయాణించే నౌకలకు రక్షణ కల్పిస్తున్నామని, ప్రపంచ చమురు సరఫరా నిరాటంకంగా కొనసాగడమే తమ లక్ష్యమని వాషింగ్టన్‌ చెబుతోంది. గల్ఫ్‌ దేశాల నుంచి బయలుదేరే భారీ క్రూడాయిల్‌ ట్యాంకర్లు హర్ముజ్‌పైనే ఎక్కువగా ఆధారపడతాయి. అయితే భద్రతా కారణాలతో కొన్ని నౌకలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం ఇరాన్‌కు సవాల్‌గా మారింది.

ప్రపంచ చమురు మార్కెట్‌పై ప్రభావం?
ప్రపంచ చమురు రవాణాలో హర్ముజ్‌ జలసంధికి అత్యంత కీలక స్థానం ఉంది. ఈ మార్గంలో అంతరాయం ఏర్పడితే చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన సరఫరాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. 80 శాతం నౌకలు ప్రత్యామ్నాయ మార్గం పట్టినా.. హర్ముజ్‌పై పట్టు కోల్పోకుండా ఉండేందుకు ఇరాన్‌ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. రుసుముల ప్రతిపాదన నుంచి కఠిన హెచ్చరికల వరకు.. చమురు మార్గంపై తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు టెహ్రాన్‌ ప్రయత్నిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement