మరణాలు, విధ్వంసాలకు అతడే కారణం
ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ తీవ్ర వ్యాఖ్యలు
టెహ్రాన్: ఇరాన్ సుప్రీంనేత అయతొల్లా అలీ ఖమేనీ శనివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో సంభవించిన ప్రజల మరణాలు, విధ్వంసాలకు ఆయనే కారణమన్నారు. నిరసనలకు ఆజ్యం పోసింది ట్రంపేనంటూ నిందించారు. ఇటీవల తలెత్తిన అశాంతి వెనుక అమెరికా హస్తం ఉందన్నారు.
ఇరాన్‌ను అస్థిరపర్చడం ద్వారా పైచేయి సాధించాలన్నదే ఆ దేశం లక్ష్యమన్నారు. అయితే, తమ దేశాన్ని బలవంతంగా యుద్ధంలోకి నెట్టలేరని కుండబద్దలు కొట్టారు. విధ్వంసానికి కారణమైన దేశీయ, విదేశీ నేరగాళ్లను శిక్షించి తీరుతామని స్పష్టం చేశారు. ఇరాన్ ఎంతో సంయమనం పాటిస్తోందని, అదే సమయంలో హింసకు కారణమైన వారిపై సహనంచూపే ప్రసక్తే లేదన్నారు. ‘దేశంలో జరుగుతున్న ఆందోళనల విషయంలో ట్రంప్ స్వయంగా జోక్యం చేసుకున్నారు.
విధ్వంసాలకు పాల్పడే వారిని ఇరానియన్లుగా పేర్కొన్నారు. నిరసనలపై తప్పుడు కథనాలను వ్యాప్తి చేశారు. సైన్యాన్ని మద్దతుగా పంపుతామంటూ ఉసిగొల్పారు. ప్రజలను రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం ద్వారా అశాంతికి ఆజ్యం పోశారు’అని ఖమేనీ విమర్శించారు. అంతర్గత, బాహ్య శత్రువులపై తీవ్ర స్థాయిలో చర్యలుంటాయని హెచ్చరించారు. అల్లర్లను కఠినంగా అణచివేయడంతోపాటు రెచ్చగొట్టే వారి వెన్ను విరుస్తామన్నారు. అశాంతికి కారణమైన లోపలి, బయటి నేరగాళ్లను వదలబోమని తెలిపారు.
రెండు రోజుల్లోనే 12 వేల మంది
దేశంలో తీవ్ర స్థాయిలో జరుగుతున్న ఆందోళనలను కఠినంగా అణగదొక్కేందుకు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కారప్స్‌లోని కుద్స్ బలగాలు, అనుబంధ సాయుధ గ్రూపులు రంగంలోకి దిగినట్లు చెబుతు న్నారు. ఈ నెల 8, 9వ తేదీ రాత్రుల్లోనే కనీసం 12 వేల మందిని ఇవి పొట్టన బెట్టుకున్నాయని సమాచారం. అధికారిక సమాచారం, ఆస్పత్రుల్లో డేటా ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్లు ఇరాన్ ఇంటర్నేనల్ అనే మీడియా సంస్థ పేర్కొంది. అయితే, నిరసనల్లో ఇప్పటి వరకు 3,090మంది చనిపోయినట్లు అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. మృతుల్లో 2,885మంది నిరసన కారులున్నారంది. ఇలా ఉండగా, శనివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు 8 గంటల సమయంలో జాతిని ఉత్తేజపరిచేలా నినాదాలు చేయాలని ప్రజలకు అమెరికాలో ఉన్న రాజ కుటుంబ వారసుడు రెజా పహ్లావీ పిలుపునిచ్చారు.


