అమెరికా అధ్యక్షుడు కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌లో నిరసనకారులకు మరణదండన శిక్షలు వాయిదా పడ్డట్లు ప్రకటించారు. అదే సమయంలో.. సైనిక చర్య ఆలోచనను విరమించుకున్నారన్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. మరోవైపు.. ఇరాన్ సైతం ఆందోళనకారులను ఉరి తీసే ఆలోచనను ప్రస్తుతానికైతే పక్కన పెట్టినట్లు ధృవీకరించింది.
‘‘ముఖ్యమైన వర్గాల నుంచి నాకు సమాచారం అందింది. నిరసనకారులపై హింసాత్మక చర్యలు నిలిపిశారని.. అలాగే మరణశిక్షణలను కూడా వాయిదా వేసినట్లు తెలిసింది’’ అని వాషింగ్టన్‌లో మీడియా ప్రతినిధులతో ట్రంప్ అన్నారు. ఈ నేపథ్యంతో సైనిక చర్యపై వెనక్కి తగ్గుతారా? అని రిపోర్టర్లు ప్రశ్నించగా.. అక్కడి ప్రభుత్వం నిరసనకారుల్ని హత్యలు చేస్తోంది. ఇప్పుడు వాటిని ఆపేసింది. ఇలాంటి టైంలో వేచి చూసే ధోరణి అవలంభించాలనుకుంటున్నాం అని అన్నారు. దీంతో.. ఏ క్షణమైనా ఇరాన్‌పై దాడి చేయవచ్చనే సంకేతాన్ని అలాగే ఉంచారు.
ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను కఠినంగా అణచివేస్తున్నది తెలిసిందే. ఇప్పటివరకు 18,000 మందికి పైగా అరెస్టు అయ్యారు. ఘర్షణల్లో మరణాల సంఖ్య 2,600 దాటిందని.. 3,000 మందికి పైగా మరణించారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇది 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్‌లో జరిగిన అత్యంత ఘోర నిరసనలలో ఒకటిగా భావిస్తున్నారు.
అయితే.. అరెస్టైన నిరసనకారుల్ని దేశద్రోహులుగా పరిగణిస్తూ న్యాయవిచారణ జరపకుండానే మరణశిక్ష అమలు చేయాలని ఇరాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వరుసలో ఇర్ఫాన్ సోల్తానీ పేరు ప్రముఖంగా వినిపించింది. న్యాయపరంగా ఎలాంటి సాయం అందకుండా చేసి.. కేవలం 10ని. మాట్లాడుకోవడానికి కుటుంబానికి అనుమతిచ్చి.. సోల్తానీని ఉరి తీసేందుకు బుధవారం ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే చివరి నిమిషంలో ఆ ఉరి వాయిదా పడింది. నార్వేలోని హ్యూమన్ రైట్స్ సంస్థ హెన్గావ్ ప్రకారం.. సోల్తానీకి విధించబోయే శిక్షను వారంపాటు వాయిదా వేసినట్లు సమాచారం. అందుకు గల కారణాలకు మాత్రం స్పష్టత లేకుండా పోయింది. ట్రంప్ వార్నింగ్ ప్రభావంతోనే ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి ఇరాన నిరసనకారులకు మద్దతు ప్రకటిస్తున్నారు. అయితే వాళ్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని.. అవసరమైతే సైనిక చర్యలకు దిగుతామని ఖమేనీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అవసరమైన సాయం పంపిస్తాం అంటూ ఆందోళనలను ప్రొత్సహిస్తున్నారు. అయితే కఠిన మార్గాలు ఆయన ఉద్దేశాలు కావని.. ఏదైనా సామరస్యంగా పరిష్కారం కావాలనే కోరుకుంటున్నారని వైట్‌హౌస్ ప్రతినిధి కరోలైన్ లేవిట్ విరుద్ధమైన ప్రకటన చేయడం గమనార్హం.
ఇదిలా ఉంటే.. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి సైతం ఈ విషయంలో కీలక ప్రకటన చేశారు. నిరసనలతో సంబంధం ఉన్నవాళ్లకు మరణదండనలు అమలు చేయాలనే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. వాళ్లను ఉరి తీసేందుకు ఎలాంటి ప్రణాళికను సిద్ధం చేయలేదు అని ఆయన ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే, ఇరాన్ న్యాయవ్యవస్థ మాత్రం వేగంగా విచారణలు జరిపి శిక్షలు అమలు చేయాలని చూస్తోంది.


