
టెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టార్గెట్‌గా ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడా నివాసం సురక్షితం కాదని.. అధ్యక్షుడు సన్‌బాత్ చేస్తున్న సమయంలో ఒక డ్రోన్ ట్రంప్‌ను ఢీకొట్టవచ్చని హెచ్చరించారు. దీంతో, ఇరాన్ వ్యాఖ్యలపై చర్చ మొదలైంది. మరోవైపు.. ఇరాన్ వ్యాఖ్యలకు ట్రంప్ సెటైరికల్ కౌంటరివ్వడం గమనార్హం.
ఇటీవల ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇదే సమయంలో ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా సైన్యం కూడా పెద్దఎత్తున దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. ఈ నేపథ్యంలో తమపై దాడులకు ట్రంప్, అమెరికా మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ హెచ్చరించారు. ఇక, తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) సలహాదారు జావద్ లారిజాని తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఇకపై ఆయన ఫ్లోరిడా నివాసం కూడా సురక్షితం కాదు. మార్-ఎ-లాగో రిసార్ట్‌లో అధ్యక్షుడు సన్‌బాత్ చేస్తున్న సమయంలో ఒక డ్రోన్ ఆయన్ను ఢీకొట్టవచ్చని హెచ్చరించారు. ఇది చాలా సులభమైన పని అని వ్యాఖ్యానించారు. 2020లో ఇరానియన్ టాప్ జనరల్ ఖాసిం సులేమానీ హత్యలో ట్రంప్ పాత్ర ఉందని ఆరోపిస్తూ ఆయన ఈ హెచ్చరికలు చేశారు. స్థానిక మీడియాలో ఆయన వ్యాఖ్యలు ప్రసారమయ్యాయి. దీంతో, ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
Larijani: "We can target Trump's navel!"
Javad Larijani, in a televised program, said:
"Trump can no longer sunbathe in Mar-a-Lago, because while he's lying down, a tiny drone might target his stomach and hit his navel!" pic.twitter.com/QOJfNlWpNL— Radio Faryad (@radiofaryad) July 8, 2025
ట్రంప్ కౌంటర్..
ఇరాన్ అధికారి లారిజాని వ్యాఖ్యలపై ట్రంప్ స్పందించారు. లారిజాని వ్యాఖ్యలను ముప్పుగా భావిస్తున్నారా అని మీడియా ప్రశ్నించగా.. ట్రంప్ స్పందిస్తూ.. ఆయన వ్యాఖ్యలను ముప్పు అనే అనుకుంటున్నా. వాస్తవానికి అది నిజమో, కాదో తెలియదు అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ట్రంప్.. మీరు చివరిసారిగా ఎప్పుడు సన్‌బాత్‌కు వెళ్లారు అని విలేకరి అడగ్గా.. ట్రంప్ నవ్వుతూ తనకు ఏడేళ్ల వయసులో అని సమాధానం ఇచ్చారు. సన్‌బాత్ తనకు అంతగా ఇష్టం ఉండదని నవ్వుతూ వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

బ్లడ్ పాక్ట్ క్రౌడ్ ఫండింగ్..
ఇదిలా ఉండగా.. అధ్యక్షుడు ట్రంప్ టార్గెట్‌గా చాలా విషయాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇరాన్ నాయకత్వానికి శత్రువులుగా భావిస్తున్న వారిపై, ఖమేనీని టార్గెట్ చేసిన వారిపై బ్లడ్ పాక్ట్ అనే ప్లాట్‌ఫామ్ చర్యలు తీసుకునేందుకు సిద్దమైనట్టు సమాచారం. ట్రంప్‌నకు బౌంటీ ఇవ్వాలని బ్లడ్ పాక్ట్ క్రౌడ్ ఫండింగ్ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఇలాంటి బెదిరింపులు రావడం గమనార్హం. ఇది జులై 8 నాటికి ఇది 27 మిలియన్ డాలర్లను సేకరించినట్టు తెలుస్తోంది.