
వాషింగ్టన్: అమెరికా, భారత్ మధ్య ప్రస్తుత పరిస్థితులపై అమెరికా రిపబ్లికన్ నిక్కీ హేలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విషయం, చమురు కొనుగోళ్లపై లేవనెత్తిన అభ్యంతరాన్ని భారత్ సీరియస్‌గా తీసుకోవాలని సూచనలు చేశారు. ట్రంప్, మోదీ మధ్య ఇలాంటి పోరాటం దురదృష్టకరం అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో చైనాపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్‌కు నిక్కీ హేలీ మంచి మిత్రురాలిగా పేరున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంక్షలు విధించి భారత్‌ను అమెరికా దూరం చేసుకోవడంపై నిక్కీ హేలీ మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నిక్కీ హేలీ తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘దశాబ్దాలుగా రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య ఉన్న స్నేహం, విశ్వాసం ఉంది. రష్యా నుంచి చమురు విషయంలో ట్రంప్ లేవనెత్తిన అభ్యంతరాలను భారత్ సీరియస్‌గా తీసుకోవాలి. దాని పరిష్కారం కోసం వీలైనంత త్వరగా అమెరికాతో కలిసి పనిచేయాలి. వాణిజ్యంలో, రష్యా చమురుపై అభిప్రాయభేదాలు వంటివి పరిష్కరించుకోవడానికి బలమైన చర్చలు, సంప్రదింపులు అవసరం.
India must take Trump's point over Russian oil seriously, and work with the White House to find a solution. The sooner the better.
Decades of friendship and good will between the world's two largest democracies provide a solid basis to move past the current turbulence.…— Nikki Haley (@NikkiHaley) August 23, 2025
ఇక, చైనాను ఎదుర్కోవడానికి అమెరికాకు భారత్ మిత్రులుగా ఉండాలి అన్న అంశం చాలా ముఖ్యమైంది. దానిని ఏమాత్రం విస్మరించడకూడదు. చైనాను ఎదుర్కోవాలన్న వ్యూహాత్మక లక్ష్యాల సాధనకు ట్రంప్ నిర్ణయాలు విపత్కరంగా మారాయి. ప్రపంచంలో ఆరోవంతు జనాభాకు కేంద్రం భారత్. అత్యంత యువ జనాభాతో చైనాను దాటేసింది. చైనా జనాభాలో వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్ ’ అని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా.. అమెరికా, భారత్ మధ్య ఘర్షణల వాతావరణం నేపథ్యంలో మాజీ విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, అమెరికా మధ్య పోరు దురదృష్టకరమని అభివర్ణించారు. భారత్ లాంటి మిత్రదేశాలను ట్రంప్ దూరం చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. నిజమైన దౌత్య ప్రయత్నాలు జరగకుండా, అల్టిమేటంలు జారీ చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. గొప్ప దేశాలు ఎల్లప్పుడూ ప్రజలకు అల్టిమేటంలు ఇవ్వడం ద్వారా గొప్పతనాన్ని ప్రదర్శించవు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పాలనలో చర్చలు పరస్పర సహకారం, గౌరవం ద్వారా జరిగాయి. కానీ ఇప్పుడు కొంచెం ఎక్కువ ఆదేశాలు, ఒత్తిడితో జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.