
మాస్కో: రష్యాలోని అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్లలో ఒకటైన కస్క్ అణు విద్యుత్కేంద్రంపై శనివారం రాత్రి డ్రోన్ దాడి జరిగింది. ఇది ఉక్రెయిన్ పనేనని రష్యా ఆరోపించింది. దేశవ్యాప్తంగా పలు ఇంధన, విద్యుత్కేంద్రాలే లక్ష్యంగా శుక్రవారం రాత్రి దాడులకు దిగిందని మండిపడింది. ‘‘కస్క్ అణు కేంద్రంపై దాడిలో ఒక ట్రాన్స్‌ఫార్మర్ దెబ్బతింది. మంటలను వెంటనే ఆర్పేశాం.
ఒక రియాక్టర్‌లో ఉత్పత్తిని తగ్గించాల్సి వచ్చింది. అయితే అణు ధారి్మకత ముప్పేమీ లేదు’’ అని పేర్కొంది. ‘‘ఉస్త్–లుగాలోని ఇంధన ఎగుమతుల టెర్మినల్‌పై దాడితో మంటలు చెలరేగాయి. అక్కడ 10 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చేశాం. దేశవ్యాప్తంగా 95 డ్రోన్లు, మిసైళ్లను ధ్వంసం చేశాం. రష్యా ప్రయోగించిన 48 డ్రోన్లను అడ్డుకున్నాం. డొనెట్‌స్‌్కలో రెండు గ్రామాలను స్వా«దీనం చేసుకున్నాం. పశ్చిమ ఉక్రెయిన్‌లో భీకర పోరు కొనసాగుతోంది’’ అని పేర్కొంది.
ఓడిపోబోం: జెలెన్‌స్కీ
‘‘ఉక్రెయిన్ బాధిత దేశం కాదు, పోరాటయోద్ధ. రష్యాతో పోరులో ఇంకా గెలవకున్నా, ఓడిపోయే ప్రసక్తి మాత్రం లేదు’’ అని అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. రాజధాని కీవ్‌లో ఆదివారం స్వాతంత్య్ర దినోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఉక్రెయిన్ స్వాతంత్య్ర పరిరక్షణకు రాజీలేని పోరు కొనసాగిస్తామన్నారు. కెనడా ప్రధాని కార్నీ ఆదివారం కీవ్‌లో జెలెన్‌స్కీతో మంతనాలు జరిపారు.
త్వరలో భారత్‌కు జెలెన్‌స్కీ!
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ త్వరలో భారత్‌లో పర్యటించే అవకాశాలున్నాయి. శనివారం ఆయనతో ఫోన్ సంభాషణ సందర్భంగా ప్రధాని మోదీ ఈ మేరకు ఆహ్వానించారు. పర్యటన తేదీ త్వరలోనే ఖరారయ్యే అవకాశముందని ఉక్రెయిన్ పేర్కొంది. ద్వైపాక్షిక సంబంధాల్లో ఈ పర్యటన కీలక మైలురాయిగా మారనుందని అభిప్రాయపడింది.