టెహ్రాన్: ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం కారణంగా ఆందోళన తీవ్ర రూపం దాల్చాయి. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనల్లో ఇప్పటికే దాదాపు 600 మంది మృతి చెందారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్.. సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఖమేనీకి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలకు సంబంధించి మొదటి ఉరిశిక్షను అమలు చేయడానికి ఇరాన్ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో 26 ఏళ్ల ఇర్ఫాన్ సోల్తానీకి త్వరలో మరణశిక్ష అమలు కానుంది. దీంతో, ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాగా,
వివరాల మేరకు.. టెహ్రాన్ శివారులోని కరాజ్ సమీపంలోని ఫర్దిస్‌కు చెందిన సోల్తానీ జనవరి ప్రారంభం నుండి ఇరాన్ అంతటా వ్యాపించిన అయతొల్లా అలీ ఖమేనీకి వ్యతిరేక నిరసనలలో పాల్గొన్నారు. ఈ క్రమంలో జనవరి 8వ తేదీన సోల్తానీ అరెస్టు అయ్యాడు. అయితే, ఇరాన్‌లో నిరసనల నేపథ్యంలో అక్కడి అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిరసనకారులను హెచ్చరించే క్రమంలో సోల్తానీకి మరణ శిక్షను విధించారు. ఒక మానవ హక్కుల సంస్థ, మీడియా నివేదికల ప్రకారం.. సోల్తానీకి విధించిన శిక్ష బుధవారం అమలు కానుంది. కాగా, గతంలో ఇరాన్ అసమ్మతిని అణచివేయడానికి మరణశిక్షను ఒక సాధనంగా ఉపయోగించినప్పటికీ, ఆ మరణ శిక్షలు ఎక్కువగా కాల్చివేతల ద్వారానే అమలు చేయబడ్డాయి. కానీ, ప్రస్తుత నిరసనలలో మాత్రం మొదటిసారిగా సోల్తానీని ఉరితీయనున్నట్టు సమాచారం. నిరసనల కారణంగా ఇరాన్‌లో ఇప్పటి వరకు దాదాపు పదివేల మందిని అరెస్ట్ చేసినట్టు తెలిసింది.
Erfan Soltani is scheduled to be executed by hanging in Iran in 48 hours.
He was arrested in Karaj on January 9 for taking part in the protests. His family was given just 10 minutes to say goodbye. No lawyer. No fair trial. Days later, the Islamic regime sentenced him to death.… pic.twitter.com/jxRwCJznpj— Sarah Raviani (@sarahraviani) January 12, 2026
కుబుంబ సభ్యుల ఆందోళన..
మరోవైపు.. ఇజ్రాయెల్, అమెరికాకు చెందిన వార్తా సంస్థ జెఫీడ్ నివేదించిన ప్రకారం సోల్తానీ కేసు తదుపరి విచారణలను నిరోధించే లక్ష్యంతో వేగంగా మరణ శిక్షను అమలు చేయాలని అక్కడి అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. ఇక, నార్వేలోని కుర్దిష్ పౌర హక్కుల సంస్థ ఈ మరణ శిక్ష అమలుపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా.. సోల్తానీ అరెస్ట్ అయిన నాటి నుంచి అతడిని న్యాయవాది సంప్రదించడం, తన వాదనలను వినిపించే అవకాశం కూడా దక్కలేదు. అరెస్టు చేసిన అధికారి గుర్తింపుతో సహా కేసులోని కీలక అంశాల గురించి అతని కుటుంబానికి కూడా సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. కానీ, షెడ్యూల్ ప్రకారం అతడికి మరణ శిక్ష అమలు చేస్తామని అధికారులు తమకు తెలియజేశారని సుల్తానీ కుటుంబ సభ్యులు చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు.
అనుకూల ప్రదర్శనలు..
తాజాగా ఇరాన్‌లో దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ప్రభుత్వ అనుకూల ప్రదర్శనలు మొదలయ్యాయి. తమ బలాన్ని ప్రదర్శించేందుకు ఇరాన్ ప్రభుత్వం సోమవారం లక్షల మంది ప్రభుత్వ మద్దతుదారులను వీధుల్లోకి సమీకరించింది. టెహ్రాన్‌లోని ఎంఘెలాబ్ స్క్వేర్ వద్ద వేల మంది ప్రదర్శనకారులు గుమిగూడారు. దేశాధ్యక్షుడు పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి తదితరులూ ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ‘అమెరికన్- ఇజ్రాయెల్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇరాన్ తిరుగుబాటు’గా ఈ ప్రదర్శనలను ఇరాన్ (Iran) అధికారిక మీడియా ప్రసారం చేసింది. కాగా, తమ దేశంలో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాయని అబ్బాస్ అరాఘ్చి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.


