Marriage Fraud: అమెరికాలో సెటిలయ్యేందుకు ‘దొంగపెళ్లి’..

Indian Pleads Guilty to Marriage Fraud to Obtain Green Card - Sakshi

అమెరికాలోని ఇల్లినాయిస్‌లో ఉంటున్న 35 ఏళ్ల భారతీయుడు యూఎస్‌లో స్థిరపడేందుకు, గ్రీన్ కార్డ్ సంపాదించే ఉద్దేశంతో అక్కడి మహిళను వివాహం చేసుకున్నట్టు దొంగ రుజువులు చూపి, మోసానికి పాల్పడ్డాడు.

ఈ నేరానికి పాల్పడిన వివేక్ చౌహాన్‌కు ఈ కేసులో నేరం రుజువైతే గరిష్టంగా ఐదేళ్ల జైలుశిక్ష, 250,000 అమెరికన్‌ డాలర్ల జరిమానా విధిస్తామని యుఎస్ అటార్నీ ట్రిని ఇ రాస్ ప్రకటించారు. 2018, ఏప్రిల్‌ 2న చౌహాన్ మసాచుసెట్స్‌లోని వోర్సెస్టర్‌కు చెందిన అమెరికా పౌరురాలిని వివాహం చేసుకున్నాడు. అయితే వారి వివాహం నిజం కాదని పోలీసుల దర్యాప్తులో తేలింది. వివేక్ చౌహాన్‌ దంపతులు ఎప్పుడూ కలిసి నివసించలేదని, గ్రీన్ కార్డ్  పొందేందుకు వివేక్ చౌహాన్‌  ఆమెను ‘కాంట్రాక్ట్ మ్యారేజ్‌’ చేసుకున్నాడని కేసును విచారిస్తున్న అసిస్టెంట్ యూఎస్‌ అటార్నీ జాన్ డీ ఫాబియన్ పేర్కొన్నారు.

2018, జూన్ 1న వివేక్ చౌహాన్‌ తన భారతీయ పాస్‌పోర్ట్‌ను చూపించి, మారిన తన వైవాహిక స్థితిని పేర్కొంటూ, అమెరికాలో శాశ్వత నివాసాన్ని పొందేందుకు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి  దరఖాస్తును సమర్పించాడు. ఈ నేపధ్యంలో 2019 మే నెలలో యూఎస్‌ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్‌) అతనిని ఇంటర్వ్యూ చేసింది. ఆ సమయంలో వివేక్ చౌహాన్‌ ‘కాంట్రక్ట్‌ భార్య’ తాను చౌహాన్‌తో కలిసి ఉంటున్నట్లు అధికారులకు తెలియజేసింది.

కాగా వివేక్ చౌహాన్‌ను 2021, నవంబర్‌లో యూఎస్‌సీఐఎస్ రెండవసారి ఇంటర్వ్యూ చేసింది. ఆ సమయంలో వివేక్ చౌహాన్‌ తాను తన భార్యతో కలిసి ఉంటున్నట్లు చెప్పాడు. పైగా తన భార్య గర్భవతి అని కూడా వారిని నమ్మబలికాడు. కాగా చౌహాన్‌ను వివాహం చేసుకున్న యూఎస్‌ మహిళ ఇటువంటి పలు మోసపూరిత వివాహాలకు పాల్పడిందని, యూఎస్‌సీఐఎస్‌ ఇంటర్వ్యూలలో అబద్దాలు చెప్పి, అధికారులను తప్పుదారి పట్టించిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. కాగా ఈ ఉదంతంలో చౌహాన్‌కు 2024 జనవరి 26న శిక్ష ఖరారు కానున్నదని సమాచారం.
ఇది కూడా చదవండి: ఊహించని పరిస్థితుల్లో నాగసాకిపై అణుబాంబు?

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top