న్యూయార్క్‌ మేయర్‌ రేసులో మీరా నాయర్‌ కుమారుడు | Indian-Origin Zohran Mamdani Runs For New York City Mayor | Sakshi
Sakshi News home page

న్యూయార్క్‌ మేయర్‌ రేసులో మీరా నాయర్‌ కుమారుడు

Jun 12 2025 5:51 AM | Updated on Jun 12 2025 5:51 AM

Indian-Origin Zohran Mamdani Runs For New York City Mayor

పోటీలో ముందంజలో ఉన్న జోహ్రాన్‌ క్వామి మమ్‌దానీ  

ఆకట్టుకుంటున్న ఎన్నికల అజెండా  

దక్షిణాసియా మూలాలను గుర్తుచేస్తూ ప్రచారం

ప్రఖ్యాత సినీ దర్శకురాలు మీరా నాయర్‌ కుమారుడు, ఇండియన్‌–అమెరికన్‌ రాజకీయ నాయకుడు జోహ్రాన్‌ క్వామి మమ్‌దానీ అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్‌ మేయర్‌ పదవికి పోటీ పడుతున్నాడు. ఒడిశాలో జన్మించిన మీరా నాయర్‌ ‘మీరాబాయి ఫిలిమ్స్‌’బ్యానర్‌ కింద పలు చిత్రాలు నిర్మిండడంతోపాట దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. కామసూత్ర, మాన్‌సూన్‌ వెడ్డింగ్, సలామ్‌ బాంబే వంటి చిత్రాలతో ఆమె సంచలనం సృష్టించారు. డెమొక్రటిక్‌ పార్టీ సభ్యుడైనా ఆమె కుమారుడు మమ్‌దానీ ప్రస్తుతం న్యూయార్క్‌ స్టేట్‌ అసెంబ్లీ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. 

న్యూయార్క్‌ సిటీ మేయర్‌ ఎన్నికలు త్వరలో జరుగబోతున్నాయి. ఈ పదవికి మాజీ గవర్నర్‌ ఆండ్రూ కౌమో పేరు ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తోంది. మరోవైపు ఆయనకు మమ్‌దానీ గట్టి పోటీనిస్తున్నాడు. నిధుల సేకరణ, నూతన ఆలోచనలు, ఆశయాలతోపాటు టెక్నాలజీని విస్తృతంగా వాడుకుంటూ జనాదరణ పొందే ప్రయత్నం చేస్తున్నాడు. ఆండ్రూ కౌమోను ఓడించడం ఖాయమని ధీమాగా చెబుతున్నాడు. ఒకవేళ మమ్‌దానీ అనుకున్న లక్ష్యం సాధిస్తే.. న్యూయార్క్‌ సిటీకి మొట్టమొదటి ముస్లిం మేయర్‌గా, తొలి ఇండియన్‌–అమెరికన్‌ మేయర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.  

ఎవరీ మమ్‌దానీ?  
జోహ్రాన్‌ మమ్‌దానీ 1991 అక్టోబర్‌ 18న ఉగాండాలోని కంపాలాలో జన్మించాడు. ఆయన తండ్రి మహమూద్‌ మమ్‌దానీ, తల్లి మీరా నాయర్‌. మహమూద్‌ మమ్‌దానీ ఉగాండాతో ప్రముఖ మార్క్సిస్ట్‌ పండితుడు. జోహ్రాన్‌కు ఐదేళ్ల వయసున్నప్పుడు ఆ కుటుంబం దక్షిణాఫ్రియాలోని కేప్‌టౌన్‌కు చేరుకుంది. రెండేళ్ల తర్వాత అమెరికాలోని న్యూయార్క్‌లో స్థిరపడింది. జోహ్రాన్‌ మమ్‌దానీకి 2018లో అమెరికా పౌరసత్వం లభించింది. బ్రాంక్స్‌ హైసూ్కల్‌ ఆఫ్‌ సైన్స్‌తోపాటు బౌడిన్‌ కాలేజీలో విద్యాభ్యాసం చేశాడు. 

కాలేజీలో ఉన్నప్పుడు రాజకీయాలపై ఆసక్తి చూపించేవాడు. స్థానికంగా రాజకీయ, సేవ కార్యక్రమాల్లో వాలంటరీగా సేవలందించేవాడు. 2017లో డెమొక్రటిక్‌ సోషలిస్టు ఆఫ్‌ అమెరికా అనే సంస్థలో చేరాడు. తర్వాత డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా 2020, 2021, 2022, 2024లో న్యూయార్క్‌ స్టేట్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. క్వీన్స్‌ 36వ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. చట్టసభల్లో చురుగ్గా పని చేస్తున్నాడు. 

20 బిల్లును ప్రతిపాదించగా, అందులో మూడు బిల్లులు చట్టాలుగా మారాయి. న్యూయార్క్‌ మేయర్‌ రేసులో 2024 అక్టోబర్‌ 23న అడుగుపెట్టాడు. జోహ్రాన్‌ మమ్‌దానీలో మంచి కళాకారుడు కూడా ఉన్నాడు. 2019లో ‘నానీ’పేరిట ఒక మ్యూజిక్‌ వీడియో విడుదల చేశాడు. షియా ముస్లిం మతస్థుడైన మమ్‌దానీ ఇటీవలే రమా దువాజీని వివాహం చేసుకున్నాడు. ఆమె సిరియాలో జన్మించారు. పలు పత్రికల్లో చిత్రకారిణిగా పనిచేశారు. మమ్‌దానీ దంపతులు క్వీన్స్‌లోని అస్టోరియాలో నివాసం ఉంటున్నారు.  

పాలస్తీనాకు మద్దతు  
మమ్‌దానీ ఎన్నికల అజెండా ప్రజలను ఆకట్టుకుంటోంది. నగరంలో అద్దెలపై ఫ్రీజింగ్‌ విధిస్తానని, రవాణా, శిశు సంరక్షణ సేవలు ఉచితంగా అందిస్తానని, కనీస వేతనాన్ని 30 డాలర్లకు పెంచుతానని మమ్‌దామీ హామీ ఇస్తున్నారు. ఇక ఇజ్రాయెల్‌–పాలస్తీనా వివాదంలో మమ్‌దానీ పాలస్తీనాకు బహిరంగంగా మద్దతు పలుకుతున్నాడు. గాజాలో వెంటనే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్‌ను డిమాండ్‌ చేస్తున్నారు. అన్ని రకాల వివక్షకు ఆయన బద్ధవ్యతిరేకి. అలాగే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధానాలను మమ్‌దానీ నిశితంగా విమర్శిస్తున్నాడు. 

ఎన్నికల ప్రచారంలో తన దక్షిణాసియా మూలాలను పదేపదే గుర్తుచేస్తున్నాడు. హిందీ భాషలో ఒక వీడియో విడుదల చేశాడు. ఇందులో బాలీవుడ్‌ సినిమాలు, డైలాగ్‌ల ప్రస్తావన ఉంది. బిలియనీర్స్‌ కే పాస్‌ ఆల్రెడీ సబ్‌ కుచ్‌ హై, అబ్‌ ఆప్‌కా టైమ్‌ ఆయేగా(ధనవంతులకు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీ వంతు వస్తుంది) అని ఓటర్లకు చెబుతున్నాడు. ఈ నెల 24న మేయర్‌ ఎన్నిక జరుగనుంది. ర్యాంక్డ్‌–చాయిస్‌ వోటింగ్‌ సిస్టమ్‌ ద్వారా మేయర్‌ను ఎన్నుకుంటున్నారు. అంటే ఓటర్లు తమ ప్రాధాన్యత ప్రకారం ఐదుగురు అభ్యర్థులకు ర్యాంకులు ఇస్తారు. ఈ ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిచిన అభ్యర్థికి మేయర్‌ పదవి లభిస్తుంది.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement
 
Advertisement
Advertisement