breaking news
Mayoral elections
-
న్యూయార్క్ మేయర్ రేసులో మీరా నాయర్ కుమారుడు
ప్రఖ్యాత సినీ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడు, ఇండియన్–అమెరికన్ రాజకీయ నాయకుడు జోహ్రాన్ క్వామి మమ్దానీ అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ మేయర్ పదవికి పోటీ పడుతున్నాడు. ఒడిశాలో జన్మించిన మీరా నాయర్ ‘మీరాబాయి ఫిలిమ్స్’బ్యానర్ కింద పలు చిత్రాలు నిర్మిండడంతోపాట దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. కామసూత్ర, మాన్సూన్ వెడ్డింగ్, సలామ్ బాంబే వంటి చిత్రాలతో ఆమె సంచలనం సృష్టించారు. డెమొక్రటిక్ పార్టీ సభ్యుడైనా ఆమె కుమారుడు మమ్దానీ ప్రస్తుతం న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికలు త్వరలో జరుగబోతున్నాయి. ఈ పదవికి మాజీ గవర్నర్ ఆండ్రూ కౌమో పేరు ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తోంది. మరోవైపు ఆయనకు మమ్దానీ గట్టి పోటీనిస్తున్నాడు. నిధుల సేకరణ, నూతన ఆలోచనలు, ఆశయాలతోపాటు టెక్నాలజీని విస్తృతంగా వాడుకుంటూ జనాదరణ పొందే ప్రయత్నం చేస్తున్నాడు. ఆండ్రూ కౌమోను ఓడించడం ఖాయమని ధీమాగా చెబుతున్నాడు. ఒకవేళ మమ్దానీ అనుకున్న లక్ష్యం సాధిస్తే.. న్యూయార్క్ సిటీకి మొట్టమొదటి ముస్లిం మేయర్‌గా, తొలి ఇండియన్–అమెరికన్ మేయర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఎవరీ మమ్దానీ? జోహ్రాన్ మమ్దానీ 1991 అక్టోబర్ 18న ఉగాండాలోని కంపాలాలో జన్మించాడు. ఆయన తండ్రి మహమూద్ మమ్దానీ, తల్లి మీరా నాయర్. మహమూద్ మమ్దానీ ఉగాండాతో ప్రముఖ మార్క్సిస్ట్ పండితుడు. జోహ్రాన్‌కు ఐదేళ్ల వయసున్నప్పుడు ఆ కుటుంబం దక్షిణాఫ్రియాలోని కేప్‌టౌన్‌కు చేరుకుంది. రెండేళ్ల తర్వాత అమెరికాలోని న్యూయార్క్‌లో స్థిరపడింది. జోహ్రాన్ మమ్దానీకి 2018లో అమెరికా పౌరసత్వం లభించింది. బ్రాంక్స్ హైసూ్కల్ ఆఫ్ సైన్స్‌తోపాటు బౌడిన్ కాలేజీలో విద్యాభ్యాసం చేశాడు. కాలేజీలో ఉన్నప్పుడు రాజకీయాలపై ఆసక్తి చూపించేవాడు. స్థానికంగా రాజకీయ, సేవ కార్యక్రమాల్లో వాలంటరీగా సేవలందించేవాడు. 2017లో డెమొక్రటిక్ సోషలిస్టు ఆఫ్ అమెరికా అనే సంస్థలో చేరాడు. తర్వాత డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా 2020, 2021, 2022, 2024లో న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. క్వీన్స్ 36వ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. చట్టసభల్లో చురుగ్గా పని చేస్తున్నాడు. 20 బిల్లును ప్రతిపాదించగా, అందులో మూడు బిల్లులు చట్టాలుగా మారాయి. న్యూయార్క్ మేయర్ రేసులో 2024 అక్టోబర్ 23న అడుగుపెట్టాడు. జోహ్రాన్ మమ్దానీలో మంచి కళాకారుడు కూడా ఉన్నాడు. 2019లో ‘నానీ’పేరిట ఒక మ్యూజిక్ వీడియో విడుదల చేశాడు. షియా ముస్లిం మతస్థుడైన మమ్దానీ ఇటీవలే రమా దువాజీని వివాహం చేసుకున్నాడు. ఆమె సిరియాలో జన్మించారు. పలు పత్రికల్లో చిత్రకారిణిగా పనిచేశారు. మమ్దానీ దంపతులు క్వీన్స్‌లోని అస్టోరియాలో నివాసం ఉంటున్నారు. పాలస్తీనాకు మద్దతు మమ్దానీ ఎన్నికల అజెండా ప్రజలను ఆకట్టుకుంటోంది. నగరంలో అద్దెలపై ఫ్రీజింగ్ విధిస్తానని, రవాణా, శిశు సంరక్షణ సేవలు ఉచితంగా అందిస్తానని, కనీస వేతనాన్ని 30 డాలర్లకు పెంచుతానని మమ్దామీ హామీ ఇస్తున్నారు. ఇక ఇజ్రాయెల్–పాలస్తీనా వివాదంలో మమ్దానీ పాలస్తీనాకు బహిరంగంగా మద్దతు పలుకుతున్నాడు. గాజాలో వెంటనే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్‌ను డిమాండ్ చేస్తున్నారు. అన్ని రకాల వివక్షకు ఆయన బద్ధవ్యతిరేకి. అలాగే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను మమ్దానీ నిశితంగా విమర్శిస్తున్నాడు. ఎన్నికల ప్రచారంలో తన దక్షిణాసియా మూలాలను పదేపదే గుర్తుచేస్తున్నాడు. హిందీ భాషలో ఒక వీడియో విడుదల చేశాడు. ఇందులో బాలీవుడ్ సినిమాలు, డైలాగ్‌ల ప్రస్తావన ఉంది. బిలియనీర్స్ కే పాస్ ఆల్రెడీ సబ్ కుచ్ హై, అబ్ ఆప్కా టైమ్ ఆయేగా(ధనవంతులకు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీ వంతు వస్తుంది) అని ఓటర్లకు చెబుతున్నాడు. ఈ నెల 24న మేయర్ ఎన్నిక జరుగనుంది. ర్యాంక్డ్–చాయిస్ వోటింగ్ సిస్టమ్ ద్వారా మేయర్‌ను ఎన్నుకుంటున్నారు. అంటే ఓటర్లు తమ ప్రాధాన్యత ప్రకారం ఐదుగురు అభ్యర్థులకు ర్యాంకులు ఇస్తారు. ఈ ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిచిన అభ్యర్థికి మేయర్ పదవి లభిస్తుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మున్సిపల్ సమరం
న్యూఢిల్లీ:ఎంసీడీ పరిధిలోని తూర్పు, దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ ఎన్నికలకు బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు సోమవారం నామినేషన్లు సమర్పించారు. ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎమ్సీ) మేయర్‌గా బీజేపీ నాయకుడు యోగేంద్ర చందోలియా, రవీంద్రగుప్తా డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఈ నెలాఖరున మూడు కార్పొరేషన్లకూ ఎన్నికలు నిర్వహిస్తారు. తూర్పు మున్సిపల్ కార్పొరేషన్ (ఈడీఎమ్సీ) మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు బీజేపీ మీనాక్షి, జైగోపాల్ను రగంలోకి దింపింది. కాంగ్రెస్ నుంచి తులసి, ఆస్ మహ్మద్ నామినేషన్లు సమర్పించారని కార్పొరేషన్ ృధికారులు ప్రకటించారు. దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎమ్సీ) మేయర్ పదవికి అత్యధికంగా నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ నుంచి ధర్మవీర్ సింగ్, బీజేపీ నుంచి ఖుషీరామ్, ఎన్సీపీ నుంచి జీవన్‌లాల్ నామినేషన్లు వేశారు. అయితే ఎన్డీఎమ్సీ నుంచి ఇతరులెవరూ నామినేషన్లు వేయకపోవడంతో చందోలియా ఏకగ్రీవంగా మేయర్ పదవికి ఎంపిక కానున్నారు. ఎన్డీఎమ్సీలో ఈ నెల 28న, ఈడీఎమ్సీలో 29న, ఎస్డీఎమ్సీలో 29న మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఎస్డీఎమ్సీలోడిప్యూటీ మేయర్ కోసం కాంగ్రెస్ నుంచి ప్రవీణ్ రాణా, బీఎస్పీ నుంచి బీర్సింగ్, ఎన్సీపీ నుంచి ఫూల్కాళీ పోటీలో ఉన్నారు. నిబంధనల ప్రకారం మేయర్ పదవీ కాలం ఐదేళ్లు. అయితే ఏటా ఒక్కొక్కరు (రొటేషన్ విధానం) వైదొలగుతుంటారు. తొలి ఏడాది మహిళకు, మలి ఏడాది సాధారణ విభాగానికి (ఓపెన్ కేటగిరి), మూడో ఏడాది రిజర్వుడు కేటగిరికి, నాలుగు, ఐదు సంవత్సరాల్లో మళ్లీ సాధారణ విభాగానికి మేయర్ పదవిని కేటాయిస్తామని ఉత్తరఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ) ప్రజాసంబంధాల అధికారి యోగేంద్ర సింగ్ మాన్ అన్నారు. ఇది మూడో ఏడాది కాబట్టి ఎస్సీలకు మేయర్ పదవిని కేటాయించాల్సి ఉంటుంది. ఓటింగ్ ఇలా.. సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, ఢిల్లీ ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలకు మేయర్ల ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం పని చేయడం లేదు కాబట్టి ఎంపీలకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. కొందరు ఎంపీలు రెండు కార్పొరేషన్లలోనూ ఓటు వేయవచ్చు. ఉదాహరణకు ఒక ఎంపీ నియోజకవర్గ ప్రాంతం ఎన్డీఎమ్సీ, ఎస్‌డీఎమ్సీలోనూ ఉంటే రెండు కార్పొరేషన్లలోనూ ఆయన ఓటు వేయవచ్చు. ఎన్డీఎమ్సీలో మొత్తం 104 మంది సభ్యులు ఉండగా, ఇద్దరు కార్పొరేటర్లు రాజీనామా చేసి ఎమ్మెల్యేలుగా పోటీకి దిగారు. ఈడీఎమ్సీలో 64 మంది సభ్యులు ఉండగా, ఇద్దరు రాజీనామా చేశారు. ఎస్‌డీఎమ్సీలోనూ 104 మంది సభ్యులు ఉండగా ముగ్గురు వైదొలిగారు. మేయర్లతోపాటే డిప్యూటీ మేయర్లు, స్థాయీసంఘం సభ్యుల పదవులకూ ఎన్నికలు నిర్వహిస్తారు. అయితే స్థాయీసంఘం సభ్యులను మాత్రం మేలో ఎన్నుకుంటారు. ప్రస్తుతం ఈడీఎమ్సీ మేయర్‌గా వ్యవహరిస్తున్న రామ్‌నారాయణ్ దూబే, కాంగ్రెస్ నాయకులు సవితా శర్మ స్థాయీసంఘం సభ్యుల పదవుల కోసం సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్డీఎమ్సీలో ఇవే పదవుల కోసం బీజేపీ నుంచి రేఖాగుప్తా, సంజీవ్ నయ్యర్, కాంగ్రెస్ నుంచి పృథ్వీ సింగ్ రాథోడ్ నామినేషన్లు సమర్పించారు. ఎస్డీఎమ్సీలో స్టాండింగ్ కమిటీ సభ్యుల పదవుల కోసం కుల్దీప్ సోలంకీ, రాధేశ్యాం బీజేపీ నుంచి, విపక్ష నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు ఫర్హాద్ సూరి, ఇదే పార్టీ నాయకుడు అభిషేక్ దత్ కూడా బరిలో నిలిచారు. ఏడాది సరిపోదు.. మేయర్లు, డిప్యూటీ మేయర్ల పదవీకాలాన్ని ఏడాది కాకుండా కనీసం 25 నెలల వరకైనా పొడిగించాలని అన్ని పార్టీల నాయకులు కోరారు. భారీ మున్సిపల్ ప్రాంతంలోని పాలనను అర్థం చేసుకొని, అభివృద్ధికి చర్యలు తీసుకోవడం ఏడాదిలో సాధ్యపడబోదని అంటున్నారు. ‘ఉత్తరఢిల్లీలో నీరు, డ్రైనేజీలు, డెంగీ వంటి సమస్యలు ఎక్కువ. సంవత్సరానికి ఒక మేయర్ మారుతూ ఉంటే పాలనావ్యవస్థ మారుతూ ఉంటుంది. కొత్త మేయర్ ప్రక్రియను మళ్లీ ప్రారంభించాలి. దీనివల్ల పనులన్నీ ఆలస్యమవుతాయి’ అని తాజా మాజీ మేయర్ అజాద్ సింగ్ అభిప్రాయపడ్డారు. పదవీకాలం వివాదంపై ఎస్డీఎమ్సీ విపక్ష నాయకుడు ఫర్హాద్ సూరి మాట్లాడుతూ ‘రొటేషన్ పద్ధతిలో ఏడాదికి ఒకరిని మేయర్ పదవికి ఎన్నుకునే పద్ధతిని రద్దు చేయాలి. ఐదేళ్లకోసారి రిజర్వేషన్లు అమలు చేయాలి. ఒకసారి మహిళలకు, రెండోసారి (ఐదేళ్లపాటు) ఎస్సీ, మూడోసారి సాధారణ విభాగం.. ఇలా ఎన్నికలు నిర్వహించాలి. దీనివల్ల అన్ని కార్పొరేషన్లలోనూ సమర్థ పాలన సాధ్యపడుతుంది’ అని ఆయన సూచించారు.