సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ మేయర్ ఎన్నికల్లో తన గెలుపు కోసం, వైఎస్సార్‌సీపీ విజయానికి శ్రమించిన ప్రతి ఒక్కరికీ పార్టీ మేయర్ అభ్యరి్థ, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. అధికార, డబ్బు, మూడు పార్టీల కూటమి బలాన్ని తట్టుకొని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు వీరోచితంగా పోరాడారని, వారి త్యాగాలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. తనను మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి కౌంటింగ్ వరకు పార్టీ పెద్దలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, కార్యకర్తలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి అహర్నిశలు శ్రమించారని కొనియాడారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, మద్దతుదారులు చూపిన ఆదరణ, ప్రేమ తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయన్నారు. ఎన్నికల్లో విజయం సాధించలేకపోయినా, విశాఖ ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నామని గర్వంగా చెబుతున్నానన్నారు. తమపై నమ్మకంతో ఓటేసిన సుమారు 3.40 లక్షల మంది ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
2029లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరేయడమే లక్ష్యం
ఎమ్మెల్సీగా, మహిళా విభాగం అధ్యక్షురాలిగా నిరంతరం ప్రజాక్షేత్రంలోనే ఉంటానని, గెలుపోటములతో సంబంధం లేకుండా ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడతానని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీగా, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ప్రజల హక్కుల కోసం, ముఖ్యంగా మహిళలపై జరిగే అఘాయిత్యాలు, అరాచకాలపై ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీస్తానని వెల్లడించారు. 2029 ఎన్నికల్లో విశాఖపట్నంలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా ఈ క్షణం నుంచే అందరం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
నూతన మేయర్‌కు అభినందనలు
మేయర్‌గా విజయం సాధించిన కూటమి అభ్యర్థి ముక్కా శ్రావణికి అభినందనలు తెలిపారు. ప్రజలు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలన్నారు. ముఖ్యంగా విశాఖ ప్రజల కష్టార్జితమైన రూ.1,700 కోట్ల జీవీఎంసీ నిధులను డైవర్ట్ చేశారని, నూతన పాలకవర్గం తమ అధికారాన్ని ఉపయోగించి ఆ నిధులను తిరిగి జీవీఎంసీకి రప్పించి నగరంలో మౌలిక వసతులు కలి్పంచాలని సూచించారు.


