ఇంటర్ వర్సిటీ కళాశాలల క్రీడా పోటీల సమయంలో ఏయూ వింత ధోరణి
క్రీడా పోటీల వేదికను
బాణసంచా స్టాళ్లకు అప్పగింత
ఏయూ నిర్వాకంపై
విద్యార్థి వర్గాల ఆవేదన
విశాఖ విద్య: విద్యార్థి దశలో చదువుతోపాటు క్రీడలూ ముఖ్యమేనని పదేపదే ప్రభుత్వాలు చెప్తుంటాయి. ఆచరణలో మాత్రం కానరాదు. ఇందుకు ఆంధ్రా యూనివర్సిటీ(ఏయూ) తీరే నిదర్శనం. విద్యార్థుల్ని క్రీడల పట్ల ప్రోత్సహిస్తూ వారి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడాల్సిన ఏయూ ఇప్పుడు వారి ఆశల్ని అడియాసలు చేస్తోంది. ఇంటర్ వర్సిటీ క్రీడా పోటీలున్న సమయంలో ఏయూ మైదానాలను బాణసంచా దుకాణాల కోసం కేటాయించడంపై సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
చదువుకంటే.. వ్యాపారమే మిన్న!
ప్రస్తుతం ఇంటర్ యూనివర్సిటీ కాలేజీల క్రీడాపోటీల షెడ్యూల్ ఖరారైంది. ఈ సమయంలో క్రీడాకారులకు ప్రాక్టీస్ చేయడానికి కాదు కదా, చివరికి పోటీలు నిర్వహించడానికి కూడా ఏ ఒక్క మైదానాన్ని అందుబాటులో ఉంచలేని దుస్థితిలో ఏయూ యంత్రాంగం ఉంది. ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌ను ఎన్నికల నిర్వహణకు అప్పగించేశారు. అది లేకున్నా.. గోల్డెన్ జూబ్లీ గ్రౌండ్ ఉంది కదా.. సరిపెట్టుకుందామనుకుంటే.. దాన్ని కూడా దీపావళి బణసంచా స్టాళ్లకు కేటాయించారు. వాస్తవంగా ఈ నెల 6న ఆర్చరీ పోటీలు ఇక్కడే జరగాలి. రాత్రికి రాత్రే దీన్ని బాణసంచా స్టాళ్లకు కేటాయించడంపై విద్యార్థులు, క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రీడాపోటీల షెడ్యూల్ ముందే ఖరారై ఉన్నా, ఏయూ పెద్దలకు వ్యాపారుల ‘డబ్బుల మోత’వినిపించిందే తప్ప, విద్యార్థుల ‘పతకాల మోత’పట్టింపులేదని విద్యార్థి సంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి.
ఫిజికల్ ఎడ్యుకేషన్ శాఖ పాత్రేంటి?
పోటీల షెడ్యూల్, వేదికలను ముందుగానే సిద్ధం చేసే ఏయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ఇక్కడ ఏం చేస్తోందో.. తెలియని పరిస్థితి. మైదానాలు వేరే వాళ్లకు ధారాదత్తం చేస్తుంటే అడ్డుకోవాల్సిన ఆ విభాగం చేష్టలుడిగి చూస్తోందన్న ఆక్షేపణలున్నాయి. దీనిపై ఏయూ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారా? అయినా ఏయూ యంత్రాంగం పట్టించుకోలేదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘యూనివర్సిటీ ఫస్ట్’అనే నినాదం పోయి, ‘ప్రైవేట్ ప్రయోజనాలే ఫస్ట్’అన్నట్లుగా ఏయూ మైదానాలను ఇలాంటి వ్యవహారాలకు కేటాయించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చివరికి ఇలాంటి వ్యాపార కార్యకలాపాలు ముగిశాక మైదానాల నిర్వహణ కూడా చేయకుండానే చేతులు దులిపేసుకుంటుండటంతో ఏయూ ఖజానాకు చిల్లు పడుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏయూ అవసరాల మాటేంటి?
విశ్వవిద్యాలయాన్ని విద్యార్థుల అవసరాల కోసం కాకుండా, పదేపదే ప్రైవేట్ వ్యాపారాల కోసం కేటాయించడం అత్యంత సబబు కాదు. విద్యార్థుల గేమ్స్ ఉన్న సమయంలో దీపావళి స్టాల్స్‌కు ఎలా కేటాయిస్తారు? యాజమాన్యానికి విద్యార్థులపై ఏమాత్రం బాధ్యత ఉందో.. దీంతో తెలుస్తోంది. సభలు, సమావేశాల పేరుతో ఏయూ గ్రౌండ్స్ నాశనం చేయడం, చివరకు ఏయూ సొమ్ముతోనే వాటిని బాగుచేయడం వల్ల యూనివర్సిటీకి వచ్చే లాభం ఏంటో.. వర్సిటీ యంత్రాంగమే చెప్పాలి.
– డా.మీనన్, కన్వీనర్,
ఏయూ పరిరక్షణ సమితి
ఆదేశాలిచ్చింది ఎవరు?
ఈ బాణసంచా దుకాణాల నిర్వహణకు ఏయూ మైదానం కేటాయింపు వెనుక అసలు సూత్రధారులు ఎవరనే దానిపై ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది. కలెక్టర్ ఆదేశాల మేరకే ఇవ్వాల్సి వచ్చిందనే సాకులు చెబుతున్న అధికారులు... ఒకవేళ నిజంగా కలెక్టరే ఆదేశిస్తే, క్రీడాపోటీలను ఆయన కూడా లైట్ తీసుకున్నట్లేనా? లేక ఏయూ పెద్దల ముందస్తు వంటకమే ఇది కాస్తా కలెక్టర్ భుజాల మీదకు నెడుతున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


