విశాఖ స్పోర్ట్స్: ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్ రెండో రౌండ్‌లోనూ గగన్‌జీత్ బుల్లార్ ఆధిక్యాన్ని కొనసాగించారు. తొలి రోజు ముందంజలో ఉన్న దీపక్, రవికుమార్ వెనుకబడగా.. సచిన్ బైసోయా, తుషార్ పన్ను మెరుగైన ప్రదర్శనతో దూసుకొచ్చారు. విశాఖ ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ కోర్స్ (ఈపీజీసీ)లో జరుగుతున్న గ్రీన్ ఫ్యూయల్స్ మారిటైమ్ ఇన్విటేషన్–2026 టోర్నీలో బుధవారం రెండో రోజు పోటీలు జరిగాయి. ఐదుసార్లు విజేతగా నిలిచిన గగన్‌జీత్ బోగీలు చేయకుండా ఆరు బర్డీలు సాధించి ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నారు. సచిన్ బైసోయా నాలుగు బర్డీలతో రెండో స్థానానికి చేరుకోగా, తుషార్ పన్ను నాలుగు బర్డీలతో మూడో స్థానంలో నిలిచారు. దీపక్ ఒక డబుల్ బోగీతో నాలుగో స్థానానికి, రవికుమార్ ఒక డబుల్ బోగీ, ఒక బోగీతో ఐదో స్థానానికి పడిపోయారు.
వైజాగ్ డాల్ఫిన్స్ జట్టుతో బరిలోకి.. : టోర్నీ నిర్వాహక కమిటీ ప్రతినిధి శ్రీ సుధాకర్ మాట్లాడుతూ ఏపీలో ఫ్రాంచైజీ జట్టును తీసుకోవాలనే ఆసక్తితో వైజాగ్ డాల్ఫిన్స్ జీసీ పేరుతో జట్టును ఎంపిక చేసుకుని టోర్నీలో పాల్గొంటున్నామని తెలిపారు. క్లబ్‌లో క్లినిక్‌లు, జూనియర్ కార్యక్రమాలతో గోల్ఫ్‌పై అవగాహన పెంచుతామన్నారు. కార్యక్రమంలో సీఈవో ఉత్తమ్‌సింగ్, ఈపీజీసీ కార్యదర్శి ఎస్‌వీఆర్ రాజు, ఉపాధ్యక్షుడు వర్మ పాల్గొన్నారు.


