ఓట్ల గారడీ! | - | Sakshi
Sakshi News home page

ఓట్ల గారడీ!

Nov 5 2026 12:28 AM | Updated on Nov 5 2026 12:28 AM

గ్రేటర్‌ ఎన్నికల్లో దాదాపు 13 వేల ఓట్లు మాయం పోలింగ్‌ లెక్కలకు.. కౌంటింగ్‌ గణాంకాలకు పొంతనేదీ? పోలైన ఓట్లు 10,35,154 మేయర్‌ ఎన్నికల కౌంటింగ్‌ ఓట్లు 10,22,227 వీధినపడ్డ పింక్‌ బ్యాలెట్లు.. సీల్‌ లేని బాక్సులు.. స్ట్రాంగ్‌ రూమ్‌లో విద్యుత్‌ కోత! ఓటమి భయంతో.. కుట్రలకు పాల్పడి గెలిచిన కూటమి

బ్యాలెట్‌ బాక్సుల్లో

సాక్షి, విశాఖపట్నం: పారదర్శకతకు పాతరేస్తూ, ప్రజల తీర్పును బ్యాలెట్‌ బాక్సుల్లోనే మాయం చేసిన వ్యవహారం.. మహా విశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ) ఎన్నికల చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోతోంది. జీవీఎంసీ ఎన్నికల్లో పోలింగ్‌ ముగిశాక మొత్తం 10,35,154 ఓట్లు పోలైనట్లు అధికారికంగా ప్రకటించారు. మేయర్‌ ఎన్నికల కౌంటింగ్‌ పూర్తయ్యే సరికి ఆ సంఖ్య 10,22,227కి పడిపోయింది. అంటే ఏకంగా 12,927 ఓట్లు గల్లంతయ్యాయి. ఇవన్నీ ఎటుపోయాయన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ లెక్కల గారడీ వెనుక ఏదో అదృశ్య శక్తి హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

స్ట్రాంగ్‌ రూమ్‌లలో ‘చీకటి’ వ్యవహారం.!

బ్యాలెట్‌ బాక్సుల తరలింపులో కనీస నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పోలింగ్‌ కేంద్రాల వద్ద సీల్‌ వేయాల్సిన బాక్సులను, ఎలాంటి భద్రతా చర్యలు లేకుండానే స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. దీనికి తోడు, సీల్‌ వేయని బాక్సులను స్ట్రాంగ్‌ రూమ్‌లలో పెట్టిన కాసేపటికే దాదాపు గంట పాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఈ వ్యవహారం మరో చీకటి కోణాన్ని ఆవిష్కరిస్తోంది.

అధికారుల మౌనంలో ఆంతర్యమేంటో?

కరెంట్‌ పోయిన ఆ గంట వ్యవధిలోనే అసలు కుట్ర జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సీల్‌ వేయని బాక్సులను మాయం చేసి, వాటి స్థానంలో ముందుగానే రిగ్గింగ్‌ చేసి సిద్ధంగా ఉంచిన వేరే బాక్సులను పెట్టారనేది ప్రధాన ఆరోపణ. సరిగ్గా ఇదే విషయంపై పోలింగ్‌ రోజు అర్ధరాత్రి వైఎస్సార్‌సీపీ శ్రేణులు, వామపక్ష నాయకులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ, సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం ఎన్నికల పారదర్శకతనే ప్రశ్నార్థకంగా మార్చాయి.

ఓటమి భయంతో కూటమి మాయాజాలం

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజకీయ వాతావరణం, ఎన్నికల సరళిని గమనిస్తే.. జీవీఎంసీ మేయర్‌ పీఠాన్ని దక్కించుకోలేమేమో? అన్న భయంతోనే కూటమి నేతలు ఈ అక్రమాలకు పాల్పడి ఉంటారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజా తీర్పు తమకు వ్యతిరేకంగా ఉందనే ముందస్తు అంచనాతోనే, అధికారుల సమక్షంలో ఈ తరహా బ్యాలెట్‌ మాయాజాలానికి తెరతీశారన్నది విపక్షాల ప్రధాన వాదన. అందుకే.. మేయర్‌ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం రాత్రి 9.30 గంటలకు ముగిసిపోయినా.. అర్ధరాత్రి 2 గంటల వరకూ తుదిఫలితాలు వెల్లడించలేదు. పది వార్డుల ఓట్లకు మేయర్‌ ఓట్లకు పొంతన కుదరకపోవడంతో.. అధికారులు, కూటమి నేతలు కంగారు పడ్డారు. 2024 సార్వత్రిక ఎన్నికల మాదిరిగా.. ఇది కూడా వివాదాస్పదమవుతుందన్న భయంతో.. తర్జనభర్జన పడ్డారు. చిక్కుముడి ఎప్పటికీ వీడకపోవడంతో.. మొత్తం 10,22,227 ఓట్లు మాత్రమే పోలయ్యాయంటూ డిక్లేర్‌ చేసేశారు. మిగిలిన 12,927 ఏమయ్యాయనే దానిపై ఎన్నికల అధికారుల నుంచి ఎలాంటి స్పష్టతా లేకపోవడం గమనార్హం.

వీధినపడ్డ ‘పింక్‌’ బ్యాలెట్లు

ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత వివాదాస్పదమైన అంశం మేయర్‌ ఎన్నికకు సంబంధించిన పింక్‌ కలర్‌ బ్యాలెట్‌ పేపర్లు పోలింగ్‌ కేంద్రాల బయట దర్శనమివ్వడం. పోలింగ్‌ జరుగుతున్న సమయంలోనే ఆ బ్యాలెట్లు బయటకు రావడం, వాటిని టీడీపీ నేతలు చేత్తో పట్టుకుని హల్‌చల్‌ చేస్తున్న వీడియోలు వెలుగులోకి రావడం వెనుక భారీ కుట్రే జరిగిందన్నది స్పష్టమవుతోంది. రిగ్గింగ్‌ చేసిన తర్వాత మిగిలిన బ్యాలెట్‌ పేపర్లను ఇలా వీధిలోకి తీసుకొచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పారదర్శకంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియలో ఇన్ని లొసుగులు బయటపడటం, వీడియో ఆధారాలు చక్కర్లు కొడుతున్నా అధికారులు స్పందించకపోవడం వ్యవస్థల వైఫల్యాన్ని సూచిస్తోంది. ఈ ఆరోపణలపై సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరిపితే తప్ప, ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు నమ్మకం కలిగే పరిస్థితి నెలకొనదని రాజకీయ నిపుణులు, ప్రజాస్వామ్యవాదులు పేర్కొంటున్నారు.

మేయర్‌ గెలుపు డిక్లరేషన్‌లో తగ్గిన మొత్తం ఓట్లు

సాగర నగరంలో ప్రజాస్వామ్యం నిలువునా దగా పడింది! పదీ.. వంద కాదు.. ఏకంగా సుమారు 13 వేల ఓట్లు కనుమరుగైపోయాయి. వీధిన పడ్డ పింక్‌ బ్యాలెట్లు.. సీలు పడని బ్యాలెట్‌ బాక్సులు.. స్ట్రాంగ్‌ రూమ్‌లో కరెంట్‌ కోతలు.. ప్రజా తీర్పును తుంగలో తొక్కి, ఓటమి భయంతో కూటమి నేతలు ఆడిన బ్యాలెట్‌ అంకెల గారడీ.. జీవీఎంసీ ఎన్నికల ఫలితాల్ని అపహాస్యం చేశాయి. పోలింగ్‌ రోజున ప్రకటించిన ఓటింగ్‌ శాతానికి.. కౌంటింగ్‌ తర్వాత తేలిన ఓట్లకు మధ్య భారీ వ్యత్యాసం పలు అనుమానాలకు తావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement