
రష్యా, భారత్‌లపై నోరు పారేసుకున్న ట్రంప్
జట్టుకట్టి మరింత దిగజారుతున్నాయని విమర్శ
ఆ రెండు దేశాల వాణిజ్య బంధాన్ని పట్టించుకోనని వ్యాఖ్య
వాషింగ్టన్/న్యూఢిల్లీ/మాస్కో: ఆంక్షలు విధిస్తామ ని భయపెట్టినా గత కొంతకాలంగా రష్యా నుంచి భారీ ఎత్తున చమురు కొనుగోళ్లను తగ్గించుకోని భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోమారు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. భారత్‌కు చమురును సరఫరాచేస్తున్న శత్రు దేశం రష్యాను సైతం ట్రంప్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. భారత్, రష్యా రెండూ కలిసి సాధించేది ఏమీ ఉండదని ఎద్దేవాచేశారు.
జట్టుకట్టి అనవసరంగా రెండు దేశాల ఆర్థికవ్యవస్థలను మరింత నిర్వీర్యంచేస్తున్నా యని ఇరు దేశాల ప్రభుత్వాలపై విమర్శల బురద చల్లారు. భారత్‌పై పాతికశాతం టారిఫ్ ఆర్థిక భారం మోపిన ట్రంప్ గురువారం భారత్, రష్యాల వాణిజ్యబంధంపై తన అక్కసును వెళ్లగక్కుతూ సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో పలు పోస్ట్‌లు పెట్టారు.
ఐ డోంట్ కేర్..
‘‘ రష్యాతో భారత్ ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటోందీ, రష్యాతో భారత్‌కు ఉన్న సత్సంబంధాలు ఏంటి అనేవి నాకు అస్సలు అవసరం లేదు. అత్యంత కీలకమైన అమెరికాతో వాణిజ్యం అత్యల్ప స్థాయిలో చేసుకుంటూ భారత్ సొంత ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యంచేసుకుంటోంది. ఇక రష్యా సంగతి చెప్పనక్కర్లేదు. రష్యాతో అమెరికాకు ఎలాంటి వాణిజ్య సంబంధాలు లేవు.
ఇలాంటి రష్యా, భారత్‌లో కూడబలుక్కుని సాధించింది ఏమీ లేదు. అవి రెండూ డెడ్ ఎకానమీలు (నిర్వీర్యమైన ఆర్థిక వ్యవస్థలు). ఉమ్మడిగా పతనమవుతున్నాయి. ఈ దేశాలను నేనసలు పట్టించుకోను. భారత్‌తో మేం చాలా తక్కువ స్థాయిలో వాణిజ్యం చేస్తున్నాం. భారత్ మాపై విధించే అధిక టారిఫ్‌లే ఇందుకు ప్రధాన కారణం. భారత్ విధించే దిగుమతి సుంకాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
ప్రపంచంలో అత్యధిక దిగుమతి సుంకాలు వసూలుచేస్తున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. భారత్‌తో వ్యవహారాలు ఒక్కోసారి సవ్యంగా ఉండవు. దాని పర్యవసానమే ఈ 25 శాతం దిగుమతి సుంకాలు. వీటికి పెనాల్టీ(జరిమానా) అదనం. ఇవన్నీ ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి అమలుచేసి వసూలు మొదలెడతా’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘‘భారత వాణిజ్య విధానాలు అసంపూర్ణంగా, అస్పష్టంగా ఉంటాయి.
దానికితోడు భారత్‌తో పరస్పర సరుకుల విలువను మాత్రమే జమకట్టే నగదుయేతర వాణిజ్య అవరోధాలు చాలా ఉన్నాయి. మేం వద్దు అని వారిస్తున్నా, హెచ్చరిస్తున్నాసరే రష్యా నుంచి ఆయుధ, ఇంధన ఉత్పత్తులను భారీ ఎత్తున భారత్ కొనుగోలుచేస్తోంది. ఇలా వచ్చిన ఆదాయాన్ని పరోక్షంగా ఉక్రెయిన్ యుద్ధం కోసం రష్యా వినియోగిస్తోంది’’ అని ట్రంప్ ఆరోపించారు.
మెద్వెదేవ్, ట్రంప్ మాటల యుద్ధం
భారత్‌ను విమర్శించిన ట్రంప్ పనిలోపనిగా రష్యాపైనా, రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వదేవ్‌పైనా విమర్శలు గుప్పించారు. దీంతో మెద్వదేవ్ సైతం ప్రతివిమర్శలు చేశారు. తొలు త మెద్వదేవ్‌నుద్దేశిస్తూ ట్రంప్ వ్యంగ్య పోస్ట్ చేశారు. ‘‘రష్యా అధ్యక్షుడిగా పేలవంగా పాలించిన మాజీ అధ్యక్షుడు మెద్వదేవ్ ఇంకా రష్యాకు అధ్యక్షుడినే అని అనుకుంటున్నారేమో. ఏదైనా మాట్లాడేముందు చూసి మాట్లాడండి. అమె రికాపై మాట్లాడే దుస్సాహసం చేయొద్దు’’ అని హెచ్చరించారు. దీనిపై రష్యా భద్రతా మండలి ఉపాధ్యక్షుడి హోదాలో మెద్వదేవ్ ఘాటుగా జవాబిచ్చారు.
‘‘ట్రంప్ ఎలా స్పందించినాసరే రష్యా తన పంథాను వీడబోదు. డెడ్ ఎకానమీ అని నోటికొచ్చినట్లు మాట్లాడటంకాదు. సోవి యట్ కాలంలోనే రష్యా అణుబాంబును తయా రుచేసిందన్న విషయం మర్చి పోవద్దు. అయినా ‘డెడ్’ అనే పదానికి ‘ది వాకింగ్ డెడ్’ అనే సినిమాకు, ‘డెడ్ హ్యాండ్ అనే ‘వ్యవ స్థ’కు ఉన్న శక్తి ట్రంప్‌కు తెలీదనుకుంటా’’ అని మెద్వదేవ్ వ్యాఖ్యానించారు. శత్రుదేశం దాడిచేసి రష్యా నా యక త్వాన్ని అంతమొందించినాసరే తిరిగి అణు బాంబులు ప్రయోగించేలా రష్యా రూపొందించిన ఆటో మేటిక్ దాడి వ్యవస్థ పేరే డెడ్ హ్యాండ్.