కొన్ని జెట్లను కోల్పోయాం | India lost unspecified number of fighter jets says CDS | Sakshi
Sakshi News home page

కొన్ని జెట్లను కోల్పోయాం

Jun 1 2025 4:54 AM | Updated on Jun 1 2025 12:23 PM

India lost unspecified number of fighter jets says CDS

ఆరు అబద్ధం.. ఎన్నో చెప్పం : సీడీఎస్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌  

ఆపరేషన్‌ సిందూర్‌ తొలి దశ నష్టాలవి 

మే 7 నాటి దాడుల్లో చోటుచేసుకున్నాయి

నష్టం కంటే, అందుకు కారణాలేమిటన్నదే కీలకం 

రెండ్రోజుల్లోపే వాటిని కనిపెట్టి సరిదిద్దుకున్నాం 

తర్వాత భారీ దాడులతో పాక్‌ వెన్ను విరిచామన్న సీడీఎస్‌ 

ఆయన వ్యాఖ్యలపై రాజకీయంగా పెను దుమారం 

మోదీ సర్కార్‌ ఇప్పటికైనా నిజాలు చెప్పాలి: కాంగ్రెస్‌ 

సిందూర్‌పై పార్లమెంటు ప్రత్యేక భేటీలో చర్చకు డిమాండ్‌ 

యుద్ధ సన్నద్ధతపై స్వతంత్ర విచారణ జరిపించాలి: ఖర్గే

సింగపూర్‌/న్యూఢిల్లీ: ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంగా పాక్‌తో జరిగిన ఘర్షణల్లో మనకు వైమానికంగా నష్టం జరిగిందని చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ అంగీకరించారు. మన ఫైటర్‌ జెట్లను దాయాది కూల్చేసినట్టు వెల్లడించారు. షాంగ్రిలా డైలాగ్‌ నిమిత్తం సింగపూర్‌లో పర్యటిస్తున్న ఆయన శనివారం బ్లూంబర్గ్‌ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. పాక్‌తో యుద్ధం భారత్‌ ఫైటర్‌ జెట్లను నష్టపోయిందా అన్న ప్రశ్నకు బదులుగా ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు.

 అవి పెను రాజకీయ దుమారానికి దారితీశాయి. ఆపరేషన్‌ సిందూర్‌కు సంబంధించిన వాస్తవాలను మోదీ సర్కారు తొక్కిపెట్టిందనేందుకు ఇదే నిదర్శనమని కాంగ్రెస్‌ దుయ్యబట్టింది. సీడీఎస్‌ వ్యాఖ్యల నేపథ్యంలో మన యుద్ధ సన్నద్ధతపై స్వతంత్ర విచారణకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్‌ చేశారు. ఈ మొత్తం ఉదంతంపై లోతుగా చర్చించేందుకు తక్షణం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. 

‘అణు’ స్థాయికి పోలేదు 
పాక్‌పై దాడుల సందర్భంగా యుద్ధ విమానాలను నష్టపోయినట్టు వాయుసేన గతంలోనే పరోక్షంగా అంగీకరించింది. పాక్‌ వైమానిక స్థావరాలపై దాడుల వివరాలను ఆర్మీ, నేవీ సైనిక ఆపరేషన్స్‌ డైరెక్టర్స్‌ జనరల్‌తో కలిసి వాయుసేన డీజీ ఎయిర్‌ మార్షల్‌ ఎ.కె.భారతి అప్పట్లో ఎప్పటికప్పుడు మీడియాకు వెల్లడించారు. మన ఫైటర్‌ జెట్లను కూల్చేశామన్న పాక్‌ ప్రకటన ఏ మేరకు వాస్తవమని మే 11 నాటి భేటీలో విలేకరులు ప్రశ్నించగా, ‘‘యుద్ధమన్నాక నష్టాలు సహజం. కాకపోతే మన పైలట్లంతా సురక్షితంగా తిరిగొచ్చారు. 

యుద్దం ఇంకా కొనసాగుతున్నందున మనం ఫైటర్‌ జెట్లను కోల్పోయామా అన్న ప్రశ్నకు ఈ దశలో బదులివ్వలేను’’ అని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో పాక్‌తో సాగిన ఆ నాలుగు రోజుల ఘర్షణల్లో మనకు నష్టం జరిగిందంటూ సైన్యం నుంచి ఇలా తొలిసారి స్పష్టమైన ప్రకటన వెలువడటం, అదీ స్వయానా త్రివిధ దళాలకు అధిపతి అయిన సీడీఎస్‌ నోటినుంచి రావడం విశేషం. అయితే మనం ఎన్ని విమానాలను నష్టపోయిందీ చెప్పేందుకు జనరల్‌ చౌహాన్‌ నిరాకరించారు. 

అంతేగాక ఆరు భారత యుద్ధ విమానాలను కూల్చేశామన్న పాక్‌ వాదన కూడా శుద్ధ అబద్ధమన్నారు. ‘‘తొలి దశలో, అంటే మే 7న ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టిన రోజు నష్టాలు జరిగాయి. అయితే అసలు సమస్య యుద్ధ విమానాలను కోల్పోవడం కాదు. అలా జరగడం వెనక కారణాలను వీలైనంత త్వరగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. జరిగిన వ్యూహాత్మక తప్పిదాలను రెండు రోజుల్లోపే కనిపెట్టగలిగాం. కాబట్టే పొరపాట్లను వెంటనే సరిదిద్దుకుని యుద్ధ విమానాలన్నింటినీ తిరిగి రంగంలోకి దించాం. మే 8, 10 తేదీల్లో శత్రువును చావుదెబ్బ తీయగలిగాం. 

పాక్‌ లోలోపలికి చొచ్చుకుపోయి మరీ అత్యంత కచ్చితత్వంతో దాడులు చేశాం’’ అని ఆయన వివరించారు. ‘‘చైనా అందజేసిన భారీ ఆయుధాలు, ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు పాక్‌ను ఏ మాత్రమూ ఆదుకోలేకపోయాయి. వాటి గురించి పాక్‌ చెప్పుకున్న గొప్పలన్నీ వట్టివేనని మన దాడులు రుజువు చేశాయి. ఎందుకంటే పాక్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను తుత్తునియలు చేస్తూ దాని భూభాగంలో 300 కి.మీ. లోపలి దాకా అత్యంత కచ్చితత్వంతో కూడిన దాడులు చే శాం’’ అన్నారు. పాక్‌తో ఘర్షణ ఏ దశలోనూ అణుయుద్ధానికి దగ్గరగా రాలేదని స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా మే 7న భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టడం తెలిసిందే.

 పాక్, పీఓకేల్లోని 9 ఉగ్ర శిబిరాలు, శిక్షణ కేంద్రాలను బ్రహ్మో స్‌ తదితర అత్యాధునిక క్షిపణులతో నామరూపాల్లేకుండా చేసింది. మర్నాడు పాక్‌ డ్రోన్లు తదితరాలతో సరిహద్దు గ్రామాలు, పట్టణాలపై ప్రతీకార దాడులకు దిగింది. బదులుగా మన సైన్యం పాక్‌లో కి 11 కీలక వైమానిక స్థావరాలను నేలమట్టం చేసింది. నాలుగు రోజుల ఘర్షణల అనంతరం ఇరుదేశా లు కాల్పుల విరమణకు అంగీకరించాయి. పాక్‌ సై న్యం విజ్ఞప్తి మేరకే అందుకు ఒప్పుకున్నట్టు భారత్‌ పేర్కొనగా తానే ఒప్పందం కుదిర్చానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించుకున్నారు.

స్వదేశీ శక్తికి తార్కాణం 
రక్షణ రంగంలో భారత్‌ సాధించిన స్వావలంబనకు ఆపరేషన్‌ సిందూర్‌ అద్దం పట్టిందని సీడీఎస్‌ జనరల్‌ చౌహాన్‌ అభిప్రాయపడ్డారు. సింగపూర్‌లో జరిగిన ఆసియా స్థాయి రక్షణ శిఖరాగ్ర సదస్సు షాంగ్రిలా డైలాగ్‌ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆకాశ్‌ వంటి పూర్తి దేశీయ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు పాక్‌ దాడులను అత్యంత సమర్థంగా అడ్డుకుని తిప్పికొట్టాయని గుర్తు చేశారు. గగనతల రక్షణకు విదేశాల సాయంపై ఆధారపడకుండా సొంతంగా అభివృద్ధి చేసుకున్న దేశవ్యాప్త సమీకృత రాడార్‌ వ్యవస్థ అద్భుతంగా రాణించి సత్తా చాటిందన్నారు.  

దాయాది విద్వేష మంత్రం 
శాంతి కోసం భారత్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా బదులుగా పాక్‌ విద్వేషమే వెల్లగక్కిందని సీడీఎస్‌ జనరల్‌ చౌహాన్‌ దుయ్యబట్టారు. ‘‘2014లో ప్రధాని నరేంద్ర మోదీ పాక్‌కు స్నేహ హస్తం సాచారు. రెండు చేతులు కలవనిదే చప్పట్లు అసాధ్యం. ఇలాంటి పరిస్థితుల్లో పాక్‌ను దూరం పెట్టడమే సరైన వ్యూహం. ఇప్పుడు భారత్‌ చేస్తున్నది అదే’’ అని వివరించారు. ‘‘స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో సామాజికంగా, ఆర్థికంగా, తలసరి ఆదాయంలోనూ పాక్‌ మనకంటే చాలా ముందంజలో ఉంది. కానీ ఇప్పుడు ప్రతి రంగంలోనూ మనం పాక్‌ అందుకోలేనంతగా ప్రగతి సాధించాం’’ అని గుర్తు చేశారు.

దేశాన్ని తప్పుదోవ పట్టించిన కేంద్రం: కాంగ్రెస్‌ 
పాక్‌తో జరిగిన సాయుధ ఘర్షణ విషయంలో మోదీ సర్కారు దేశాన్ని తప్పుదోవ పట్టించిందంటూ కాంగ్రెస్‌ మండిపడింది. అది దాచేసిన నిజాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయని ఫైటర్‌ జెట్లను కోల్పోయామన్న సీడీఎస్‌ ప్రకటనను ఉద్దేశించి అభిప్రాయపడింది. పాక్‌తో నాలుగు రోజుల ఘర్షణలో ఎంత నష్టం జరిగిందో వాస్తవాలు వెల్లడించాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్‌ చేశారు.

 ‘‘సీడీఎస్‌ ప్రకటన నేపథ్యంలో సిందూర్‌కు సంబంధించి ఎన్నో కీలక సందేహాలు తలెత్తుతున్నాయి. వాటన్నింటికీ సమాధానాలు లభించాలంటే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలే ఏకైక మార్గం. కాబట్టి తక్షణం వాటిని ఏర్పాటు చేయాలి. అంతేకాదు, మన యుద్ధ సన్నద్ధతపై స్వతంత్ర కమిటీతో దర్యాప్తు జరిపించాలి’’ అంటూ ఎక్స్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. కార్గిల్‌ యుద్ధంపై కూడా వాజ్‌పేయి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం కమిటీ వేసి సమీక్ష జరిపిందని గుర్తు చేశారు. ‘‘మన వీర పైలట్లు ప్రాణాలకు తెగించి దేశ గౌరవాన్ని కాపాడారు. వారికి వందనం’’ అంటూ ఖర్గే కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement