ప్రతీకాత్మక చిత్రం
ఒకప్పుడు యెమెన్‌లోని పర్వత ప్రాంతాలకే పరిమితమైన తిరుగుబాటు బృందం.. ఇప్పుడు సౌదీ అరేబియా రాజధాని రియాద్ వరకు క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసే స్థాయికి ఎదిగింది. విమానాశ్రయాలు, చమురు కేంద్రాలే లక్ష్యంగా విరుచుకుపడుతున్న హౌతీలను అడ్డుకోవడం సౌదీ రక్షణ వ్యవస్థకూ సవాలుగా మారింది. అత్యాధునిక ఆయుధాలు ఉన్న దేశాలకే వీరిని నిలువరించడం ఎందుకు కష్టమవుతోంది?. ఇంతకీ హౌతీలకు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది?..
హౌతీ రెబల్స్ తొలుత యెమెన్‌లో పుట్టుకొచ్చిన రాజకీయ, సైనిక, మత ఉద్యమం. వీరు తమను తాము ‘అన్సార్ అల్లా’గా పిలుచుకుంటారు. 1990లలో ఉత్తర యెమెన్‌లో జైదీ షియా మత సంప్రదాయ పునరుజ్జీవన ఉద్యమంగా మొదలైన ఈ సంస్థ.. క్రమంగా సాయుధ శక్తిగా మారింది. 2011లో అరబ్ వసంతం నిరసనలతో యెమెన్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడిన తర్వాత ఉత్తర ప్రాంతాల్లో తమ పట్టును పెంచుకుంది. 2014లో రాజధాని సనాను స్వాధీనం చేసుకుని, అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వాన్ని వెనక్కి నెట్టింది.
2015లో హౌతీలను ఓడించి యెమెన్ ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు యుద్ధంలోకి దిగాయి. అయితే పర్వత ప్రాంతాల భౌగోళిక పరిస్థితులు, సుదీర్ఘ పోరాటం, హౌతీల గెరిల్లా వ్యూహాల కారణంగా ఆ సైనిక చర్య వారికి నిర్ణయాత్మక ఓటమిని తీసుకురాలేకపోయింది. యెమెన్‌లోని వాయవ్య ప్రాంతాలపై హౌతీలు తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు.
ఇరాన్ అండ.. అదే అసలు బలం!
హౌతీల సైనిక శక్తి వెనుక ఇరాన్ మద్దతు కీలకంగా కనిపిస్తోంది. క్షిపణులు, డ్రోన్ల తయారీకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ, ఆయుధాలు, నిఘా సమాచారాన్ని ఇరాన్ అందిస్తోందని అమెరికా సహా పలు దేశాలు ఆరోపిస్తున్నాయి. అయితే హౌతీలు తమను ఇరాన్ చేతిలో కీలుబొమ్మలుగా అభివర్ణించడాన్ని తిరస్కరిస్తున్నారు. తమ ఆయుధాలను తామే అభివృద్ధి చేసుకుంటున్నామని చెబుతున్నారు.
అయితే నిపుణుల అంచనా ప్రకారం.. ఇరాన్ సాయం హౌతీలకు సుదూర లక్ష్యాలను ఛేదించే సామర్థ్యాన్ని పెంచింది. వాళ్ల అమ్ముల పొదిలో బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు, దాడి డ్రోన్లు ఉన్నాయి. వీటితో సౌదీ చమురు కేంద్రాలు, విమానాశ్రయాలే కాకుండా ఇజ్రాయెల్‌ను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. ఒకేసారి వేర్వేరు వేగాలు, మార్గాల్లో క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించడం ద్వారా ప్రత్యర్థి రక్షణ వ్యవస్థలను గందరగోళానికి గురిచేసే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు.
సౌదీకి ఎందుకీ ఇబ్బంది?
సౌదీ అరేబియా ప్రపంచంలో అత్యధికంగా రక్షణ రంగంపై ఖర్చు చేసే దేశాల్లో ఒకటి. అయినప్పటికీ హౌతీల దాడులను పూర్తిగా అడ్డుకోలేకపోతోంది. దీనికి పలు కారణాలున్నాయి. హౌతీలు పర్వత ప్రాంతాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం, ఆయుధాలను రహస్య ప్రదేశాల్లో దాచడం, చిన్న డ్రోన్ల నుంచి సుదూర క్షిపణుల వరకు వివిధ రకాల ఆయుధాలను ఉపయోగించడం సౌదీకి సవాలుగా మారాయి.
అత్యాధునిక రక్షణ వ్యవస్థలు ఉన్నా ప్రతి దాడిని అడ్డుకోవడం సులభం కాదు. దాడులు ఎక్కడి నుంచి వస్తాయో ముందుగా గుర్తించడం, ఏ లక్ష్యాన్ని ముందుగా కాపాడాలో నిర్ణయించడం, అందుబాటులో ఉన్న క్షిపణి నిరోధక ఆయుధాలను సమర్థంగా వినియోగించడం కీలకం. రియాద్ విమానాశ్రయంపై దాడుల నేపథ్యంలో తమ రక్షణ వ్యవస్థలు ఎందుకు ముందస్తు హెచ్చరిక ఇవ్వలేకపోయాయన్న అంశంపై సౌదీ ఇప్పటికీ వివరణ ఇవ్వలేకపోయింది!.
ప్రపంచ చమురు రవాణాపైనా పట్టు!
హౌతీలకు మరో ప్రధాన బలం యెమెన్ భౌగోళిక స్థానం. ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌తో కలిపే బాబ్ అల్ మండేబ్ జలసంధికి యెమెన్ సమీపంలో ఉంటుంది. ప్రపంచ వాణిజ్యానికి, చమురు రవాణాకు ఇది కీలకమైన మార్గం. ఈ ప్రాంతంలో నౌకలపై దాడులు లేదా రవాణాకు ఆటంకాలు సృష్టిస్తే అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం పడుతుంది. నౌకలు ఆఫ్రికా చుట్టూ ఎక్కువ దూరం ప్రయాణించాల్సి రావడంతో రవాణా ఖర్చులు, సమయం పెరుగుతాయి.
2023 నవంబర్ నుంచి గాజా యుద్ధానికి ప్రతిస్పందనగా ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు, ఇజ్రాయెల్‌పై క్షిపణి, డ్రోన్ ప్రయోగాలు చేపట్టిన హౌతీలు.. ప్రాంతీయ ఘర్షణల్లో మరింత కీలక శక్తిగా మారారు. తాజా పరిణామాలతో సౌదీ చమురు ఎగుమతులు, విమాన ప్రయాణాలు, అంతర్జాతీయ సరఫరా మార్గాల భద్రతపై ఆందోళనలు పెరిగాయి.
అసలు బలం ఏంటి?
హౌతీల శక్తి కేవలం ఇరాన్ ఇచ్చే ఆయుధాల్లోనే లేదు. యెమెన్‌లోని విస్తారమైన ప్రాంతాలపై నియంత్రణ, దీర్ఘకాలిక యుద్ధ అనుభవం, పర్వత ప్రాంతాలను అనుకూలంగా మలుచుకునే సామర్థ్యం, క్షిపణులు–డ్రోన్ల సమన్వయ వినియోగం, కీలక సముద్ర మార్గాలపై ఒత్తిడి తీసుకురాగలగడం.. ఇవన్నీ వారికి బలాన్నిస్తున్నాయి.
అందుకే భారీ సైన్యం, ఆధునిక యుద్ధ విమానాలు, క్షిపణి రక్షణ వ్యవస్థలు ఉన్న సౌదీకి కూడా హౌతీలను పూర్తిగా అణచివేయడం కష్టమవుతోంది. ఇరాన్ మద్దతు వారికి ఆయుధ బలాన్నిస్తే.. యెమెన్ భౌగోళిక పరిస్థితులు, సముద్ర మార్గాలపై వ్యూహాత్మక పట్టు వారిని మరింత ప్రమాదకర శక్తిగా మారుస్తున్నాయి.
ఇదీ చదవండి: భారత్‌తో పెట్టుకున్నాడు.. మస్క్ పరువు పోయిందిగా!


