శత్రువుకు శత్రువు మిత్రుడనే సామెత ఒకటి ఉంది. భారత్ నిర్ణయాలకు వ్యతిరేకంగా.. అలాంటి శత్రువుతోనే జత కట్టాలని, భుజం తట్టి ప్రొత్సహించాలని అగర్రాజ్యం బలంగా భావిస్తోంది!. ఈ నేపథ్యంలోనే అమెరికా-భారత్ మధ్య స్నేహబంధానికి బీటలు వారే అవకాశం ఉందంటున్నారు..
బంగ్లాదేశ్‌లో ఫిబ్రవరి 12వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితుల్లో శాంతి యుతంగా ఎన్నికల నిర్వహణ అనేది పెద్ద సవాలే. అయితే.. అక్కడి జమాత్-ఎ-ఇస్లామీతో సంబంధాలు పెంచుకునేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీంతో వాషింగ్టన్-ఢిల్లీ మధ్య సంబంధాలపై ప్రభావం పడొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారట్లు.. వాషింగ్టన్ పోస్ట్ ఓ సమగ్ర కథనం ప్రచురించింది. అందులో..
ఇటీవల నిర్వహించిన సర్వేల్లో జమాత్, బీఎన్‌పీలకు ప్రజాదరణ అధికంగా ఉన్నట్లు తేలింది. మరీ ముఖ్యంగా జమాత్ విద్యార్థి విభాగం ‘‘ఇస్లామీ ఛాత్ర శిబిర్’’ ఆమధ్య నిర్వహించిన వర్సిటీ ఎలక్షన్స్‌లో ఆధిపత్యం సాధించింది. దీంతో రాబోయే ఎన్నికలకు జమాత్ బలమైన పునాది వేసుకుందనే విశ్లేషణ నడుస్తోంది. ఈ పరిణామాలపై అమెరికన్ రాయబారి ఒకరు స్పందిస్తూ.. బంగ్లాదేశ్ ఇస్లామిక్ వైపు మళ్లింది అని అన్నారు. ఈ తరుణంలో జమాత్ నాయకులతో అమెరికా స్నేహపూర్వక సంబంధాలు పెంచుకుంటే మంచిదని సూచించారు కూడా.
భారత్ ఆందోళనలు ఏంటంటే..
జమాత్-అమెరికా దోస్తానాపై భారత్ ఆందోళనలో అర్థం ఉంది. ఎందుకంటే.. జమాత్-ఎ-ఇస్లామీని భారత్ ఎప్పటినుంచో శత్రువుగానే చూస్తోంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. 1971 యుద్ధంలో ఈ పార్టీ పాకిస్తాన్ పక్షాన నిలిచిన చరిత్ర ఉంది. అలాగే మతోన్మాదంతో ఆ సమయంలో మైనారిటీలను ఊచకోత కోసిందని అభియోగాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో జమాత్ అధికారంలోకి వస్తే.. హిందువుల సహా ఇతర మైనారిటీలకు భద్రత ఉండబోదని ఢిల్లీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే అమెరికాతో వాణిజ్య వివాదాలు, వ్యూహాత్మక విభేదాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో అమెరికా జమాత్‌కు మద్దతుగా నిలిస్తే.. భారత్-అమెరికా సంబంధాలు తీవ్రంగా దెబ్బ తినే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు.
జమాత్ బ్యాక్‌గ్రౌండ్ ఇది..
1971 విమోచన యుద్ధానికి వ్యతిరేకంగా.. పాక్‌కు మద్దతుగా నిలిచింది జమాత్-ఎ-ఇస్లామీ. పార్టీకి చెందిన అనేక నాయకులు, వార్ క్రైమ్స్ (యుద్ధ నేరాలు)లో పాల్గొన్నారని ఆరోపణలు వచ్చాయి. పైగా హింస, హత్యలతో పాటు మైనారిటీలపై దాడులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఒకప్పుడు ఆ పార్టీపై జనాల్లో వ్యతిరేకత ఉండేది.
ఒకానొక టైంలో దేశద్రోహి పార్టీ అంటూ అనేకసార్లు నిషేధానికి గురైంది. విమోచన యుద్ధానికి వ్యతిరేకంగా నిలిచినందుకు, మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలు, రాజ్యాంగ విరుద్ధ విధానాలు.. ఇలా రకరకాల కారణాలు చూపించారు. మరీ ముఖ్యంగా బంగ్లాదేశ్ రాజ్యాంగం సెక్యులర్ విధానాన్ని అనుసరిస్తుంటే.. జమాత్ మాత్రం షరియా చట్టం అమలు చేయాలని భావిస్తోంది. ఈ విధానం వల్లే.. 2013లో బంగ్లాదేశ్ ఉన్నత న్యాయస్థానం ఆ పార్టీని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. ఆ వెంటనే ఎన్నికల సంఘం ఆ పార్టీ రిజిస్ట్రేషన్‌ను తీసేసింది. దీంతో ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. అయితే ప్రధాని హోదాలో షేక్ హసీనానే ఆనాడు ఈ పని చేయించిందనే ఆరోపణలు ఉన్నాయి.
అయితే మాజీ ప్రధాని షేక్ హసీనా గద్దె దిగిపోయాక.. నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుప్రీం కోర్టు జమాత్‌పై నిషేధం ఎత్తేసింది. దీంతో అవినీతి వ్యతిరేకం.. సంక్షేమం.. అంటూ జమాత్ కొత్త నినాదంతో ప్రజల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే ఆ పార్టీకి ఆదరణ పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.
అమెరికా మరోలా..
ప్రస్తుతానికైతే అమెరికా.. జమాత్‌తో ఫ్రెండ్‌షిఫ్‌ను కోరుకోవడం లేదని సమాచారం. ‘‘బంగ్లాదేశ్‌లో జరగబోయే ఎన్నికల్లో మేం ఎవరికీ మద్దతు ఇవ్వబోం’’ అని ఆ దేశ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. అదే సమయంలో మత ఛాందస పార్టీగా పేరున్న జమాత్ భవిష్యత్తులో ప్రభుత్వం ఏర్పాటు చేసి.. షరియా చట్టాలను అమలు చేస్తే.. బంగ్లాదేశ్ గార్మెంట్ ఎగుమతులపై 100% సుంకాలు విధిస్తామని హెచ్చరించింది కూడా.
రాజకీయ వాతావరణం
హసీనా తొలగింపుతో ఏర్పడిన యూనస్ తాత్కాలిక ప్రభుత్వం.. ప్రజాస్వామ్య మార్పు పేరుతో ఎన్నికలు నిర్వహిస్తోంది. అయితే మాజీ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మొమెన్.. యూనస్ ప్రభుత్వం మత ఛాందస వాదులతో చేతులు కలిపి అవామీలీగ్ కేడర్‌ను, హిందూ మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. హసీనా ప్రస్తుతం భారత్‌లో ప్రవాసంలో ఉండగా.. జమాత్ సహా ఇస్లామిస్టులు ఆమె ప్రభుత్వ పతనంలో కీలక పాత్ర పోషించారు.


