ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో వేలాది మంది హిందువులు, విద్యార్థులు, సామాజిక సంస్థల ప్రతినిధులు భారీ నిరసనకు దిగారు. ఉత్తర బంగ్లాదేశ్‌లోని గైబాంధా జిల్లాలో శ్రీరాముడి చిత్రాన్ని అవమానించారన్న ఆరోపణలు, అలాగే నిర్మాణంలో ఉన్న భారీ శ్రీరామ విగ్రహ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ఆందోళనలు చేపట్టారు. నిరసనల సందర్భంగా ఢాకా వీధులు "జై శ్రీరామ్" నినాదాలతో మార్మోగాయి.
అసలు వివాదం ఏమిటి?
గైబాంధా జిల్లాలోని పలాష్‌బారి ప్రాంతంలో సుమారు 81 అడుగుల ఎత్తుతో శ్రీరాముడి విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. దీనిని బంగ్లాదేశ్‌లోనే అతిపెద్ద శ్రీరామ విగ్రహంగా చెబుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టును కొందరు ఇస్లామిక్ సంస్థలు వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో జరిగిన ఒక ప్రదర్శనలో శ్రీరాముడి చిత్రాన్ని చెప్పులతో కొట్టినట్లు, అవమానించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హిందూ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
Massive protests in Dhaka yesterday saw Bangladeshi Hindus call for justice over the desecration of Bhagwan Shri Ram's image by Islamists and seek the continuation of the halted 81-foot Ram murti project in Gaibandha. pic.twitter.com/za4vFu6c2y
— Megh Updates 🚨™ (@MeghUpdates) June 20, 2026
వీధుల్లోకి వేలాది మంది
ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు తొలుత టార్చ్‌లైట్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం హిందూ విద్యార్థి సంఘాలు, మైనారిటీ హక్కుల సంస్థలు, సామాజిక సంఘాల పిలుపుతో షాహ్‌బాగ్ ప్రాంతంలో భారీ నిరసన జరిగింది. నిరసనకారులు దోషులను వెంటనే అరెస్టు చేయాలని, మత విద్వేషాన్ని రెచ్చగొట్టే వర్గాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
72 గంటల అల్టిమేటం
నిరసనలకు నాయకత్వం వహించిన హిందూ విద్యార్థి సంఘాలు ప్రభుత్వానికి 72 గంటల గడువు విధించాయి. శ్రీరాముడి చిత్రాన్ని అవమానించిన వారిపై చర్యలు తీసుకోకపోతే దేశవ్యాప్తంగా మరింత పెద్ద ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గైబాంధాలో నిర్మాణంలో ఉన్న శ్రీరామ విగ్రహ పనులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. తీవ్రవాద సంస్థల నుంచి బెదిరింపులు వస్తున్నాయని, భద్రతా కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ ఘటనతో బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీల భద్రత, మత స్వేచ్ఛ, మత సామరస్యంపై మరోసారి చర్చ మొదలైంది. హిందూ, బౌద్ధ, క్రైస్తవ ఐక్య పరిషత్ సహా పలు సంస్థలు ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని మత విద్వేష ఘటనలను అరికట్టాలని కోరాయి.


