బంగ్లాదేశ్‌లో ఆలయాలు, దుకాణాలపై దాడులు | Hindus flee Bangladesh locality after temples attacked | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌లో ఆలయాలు, దుకాణాలపై దాడులు

Published Sat, Nov 30 2024 6:12 AM | Last Updated on Sat, Nov 30 2024 6:12 AM

Hindus flee Bangladesh locality after temples attacked

ఇస్కాన్‌పై నిషేధం విధించాలంటూ ర్యాలీ 

ప్రాణభయంతో పారిపోయిన హిందువులు 

చోద్యం చూస్తున్న పోలీస్‌ యంత్రాంగం 

చిట్టగాంగ్‌లో శుక్రవారం ప్రార్థనల అనంతరం పరిణామాలు

ఢాకా/న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో శుక్రవారం హిందువుల మనుగడను ప్రశ్నార్థకంగా మార్చే పలు ఆందోళనకర పరిణామాలు సంభవించాయి. హిందూ ఆలయాలపై దుండగులు దాడులు చేశారు. హిందువులపై దాడి చేయడంతోపాటు వారి దుకాణాల్లో లూటీకి పాల్పడ్డారు. ఆపైన ఇస్కాన్‌పై నిషేధం విధించాలంటూ ర్యాలీ చేపట్టారు. 

హిందువులు అత్యధికంగా నివసించే కొత్వాలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం ప్రార్థనల అనంతరం చోటుచేసుకున్న ఘటనలివి. జమాతె ఇస్లామీ, బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ(బీఎన్‌పీ)కి చెందినట్లుగా భావిస్తున్న కొందరు చిట్టగాంగ్‌లోని రాధా గోవింద, సంతానేశ్వరి మాత్రి ఆలయాలపై దాడులకు పాల్పడ్డారు. మైనారిటీ వర్గం ప్రజలపై దాడులు చేశారు. హిందువులు నిర్వహించే దుకాణాలను ధ్వసం చేశారు. 

భయాందోళనలకు గురైన బాధితులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తలదాచుకున్నారు. అనంతరం దుండగులు ఇస్కాన్‌ను నిషేధించాలంటూ ర్యాలీ చేపట్టారు. ఇన్ని జరుగుతున్నా స్థానిక పోలీస్, ఆర్మీ అధికారులు వారిని తమను కాపాడేందుకు ఏమాత్రం ప్రయతి్నంచకుండా ప్రేక్షకపాత్ర వహించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. షేక్‌ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్‌ ప్రభుత్వం పడిపోయినప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు పెరిగిపోయాయి. చిన్మయ్‌ దాస్‌ అరెస్ట్‌పై హిందువులు నిరసనలు తెలపడంతో దాడులు మరింతగా పెరిగాయి. 

చిన్మయ్‌ దాస్‌ బ్యాంక్‌ అకౌంట్‌ నిలిపివేత 
హిందూ మత పెద్ద చిన్మయ్‌ దాస్‌కు చెందిన వివిధ బ్యాంకు అకౌంట్లను బంగ్లాదేశ్‌ ఆర్థిక విభాగం స్తంభింపజేసింది. రాజద్రోహం నేరం కింద ఈ నెల 25న పోలీసులు చిన్మయ్‌ దాస్‌ను అరెస్ట్‌ చేయడం తెలిసిందే. దాస్‌తోపాటు ఇస్కాన్‌ సంబంధిత వ్యక్తులకు చెందిన మరో 17 అకౌంట్లను కూడా నెల రోజుల పాటు సీజ్‌ చేస్తున్నట్లు యంత్రాంగం తెలిపింది. ఈ బ్యాంకు అకౌంట్ల లావాదేవీలన్నిటినీ నిలిపివేయాలని, ఇప్పటి వరకు జరిగిన లావాదేవీల వివరాల్ని అందజేయాలని ఆదేశించినట్లు పేర్కొంది.  

హిందువుల రక్షణకు చర్యలు తీసుకోండి:భారత్‌ 
హిందువుల పెరిగిపోయిన దాడులు, బెదిరింపులపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. మైనారిటీలకు భద్రత కల్పించాలన్న బాధ్యతను నెరవేర్చాలని బంగ్లా ప్రభుత్వాన్ని గట్టిగా కోరింది. మైనారిటీలపై దాడులను మీడియా ఎక్కువ చేసి చూపుతోందంటూ కొట్టిపారేయవద్దని విదేశాంగ శాఖ ప్రతినిధి రణదీర్‌ జైశ్వాల్‌ బంగ్లా ప్రభుత్వానికి స్పష్టం చేశారు. హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడులు  ఆందోళనకరమని బంగ్లాదేశ్‌లోని మహ్మద్‌ యూనస్‌ సారథ్యంలోని ఆపద్ధర్మ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నామన్నారు. హిందూ మత పెద్ద చిన్మయ్‌ దాస్‌పై నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందని ఆశిస్తున్నామని తెలిపారు.

మైనారిటీల భద్రత బాధ్యత బంగ్లా ప్రభుత్వానిదే: జై శంకర్‌ 
బంగ్లాదేశ్‌లోని మైనారిటీల రక్షణ కల్పించాల్సిన ప్రాథమిక బాధ్యత అక్కడి ప్రభుత్వానిదేనని విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జై శంకర్‌ శుక్రవారం లోక్‌సభలో అన్నారు. హిందువుల ఆలయాలు, దుకాణాలు, నివాసాలపై పెరిగిపోయిన దాడులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలకు అడ్డుకట్ట వేయాలంటూ అక్కడి ఆపద్ధర్మ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని కూడా చెప్పారు. దుర్గా పూజ సమయంలో మంటపాలపై దాడులు జరుగుతున్న విషయాన్ని అక్కడి ప్రభుత్వానికి తెలపగా రక్షణ కల్పిస్తామని హామీ ఇచి్చందని గుర్తు చేశారు. 

కోల్‌కతాలో ఇస్కాన్‌ ర్యాలీ 
చిన్మయ్‌ కృష్ణ దాస్‌నను బంగ్లాదేశ్‌ అధికారులు అరెస్ట్‌ చేయడాన్ని నిరసిస్తూ కోల్‌కతాలోని అల్బర్ట్‌ రోడ్‌లో వరుసగా రెండో రోజు శుక్రవారం ఇస్కాన్‌కు చెందిన పలువురు ప్లకార్డులు చేబూని ‘కీర్తన్‌’నిర్వహించారు. దాస్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement