వేడుకల పేరిట వికృతం.. మహిళలే టార్గెట్‌గా మారారా? | France Music Festival Turns Chaotic, 240 Arrested Amid Assault and Violence Reports, Watch Video Inside | Sakshi
Sakshi News home page

వేడుకల పేరిట వికృతం.. మహిళలే టార్గెట్‌గా మారారా?

Jun 24 2026 8:09 AM | Updated on Jun 24 2026 10:23 AM

France annual music night turns deadly Videos Viral

ఫ్రాన్స్‌లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. సంగీతం, సంబరాలు, ఆనందానికి ప్రతీకగా నిలిచే భారీ ప్రజా వేడుకలు ఎంత ప్రమాదకరంగా మారవచ్చో ఫ్రాన్స్‌లో జరిగిన తాజా ఘటన మరోసారి ప్రపంచానికి గుర్తు చేసింది. లక్షలాది మంది పాల్గొన్న వార్షిక సంగీత ఉత్సవంలో మహిళలతో అనుచిత ప్రవర్తన, లైంగిక దాడుల ఆరోపణలు, కత్తిపోట్ల ఘటనలు చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనల నేపథ్యంలో ఫ్రెంచ్ పోలీసులు 240 మందిని అదుపులోకి తీసుకున్నారు.

ఫ్రాన్స్‌లో ప్రతి ఏడాది నిర్వహించే ప్రముఖ సంగీత ఉత్సవం ఫెటే డీలా ముసిక్యూ(Fête de la Musique) వేడుక ఈసారి విషాదకర ఘటనలతో వార్తల్లో నిలిచింది. దేశవ్యాప్తంగా జరిగిన వేడుకల్లో 145 మంది సూదులతో గుచ్చినట్లు ఫిర్యాదులు చేయగా, మహిళలపై లైంగిక దాడులు, హింసాత్మక ఘటనల ఆరోపణలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనల నేపథ్యంలో ఫ్రెంచ్ పోలీసులు 240 మందిని అదుపులోకి తీసుకున్నారు.

జూన్ 21న నిర్వహించిన ఈ ఉత్సవానికి లక్షలాది మంది హాజరయ్యారు. అయితే వేడుకల సమయంలో అనేక మంది మహిళలు, యువతులు తమకు గుర్తుతెలియని వ్యక్తులు సూదులతో గుచ్చారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం 145 కేసులు నమోదవగా, వాటిలో 13 ఘటనలు పారిస్‌లోనే చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. బాధితుల్లో కొందరిని ఆసుపత్రులకు తరలించి టాక్సికాలజీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సూదుల్లో మత్తు పదార్థాలు ఉన్నాయా లేదా అనే విషయంపై దర్యాప్తు కొనసాగుతోంది.

వేడుకలకు ముందు సోషల్ మీడియా వేదికలపై మహిళలను లక్ష్యంగా చేసుకోవాలంటూ కొన్ని పోస్టులు వైరల్ కావడం ఆందోళన కలిగించింది. ఆ హెచ్చరికల తర్వాతే ఈ ఘటనలు చోటుచేసుకోవడంతో పోలీసులు కుట్ర కోణంలోనూ విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా, ఉత్సవాల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో పలువురు గాయపడ్డారు. ఒక 17 ఏళ్ల యువకుడు కత్తిపోట్లతో ఆసుపత్రిలో చేరగా, మొత్తం 14 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. 13 మంది భద్రతా సిబ్బంది కూడా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలు ఫ్రాన్స్‌లో మహిళల భద్రత, భారీ ప్రజా వేడుకల నిర్వహణపై మరోసారి చర్చకు దారితీశాయి. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనలపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఇప్పటివరకు దాడుల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ఏమిటన్నది స్పష్టంగా తెలియరాలేదు.

ప్రతి సంవత్సరం లక్షలాది మంది పాల్గొనే ఈ ఉత్సవం ఫ్రాన్స్ సంస్కృతికి ప్రతీకగా భావిస్తారు. వీధులు, పార్కులు, ప్రజా ప్రదేశాలు సంగీతంతో మార్మోగే ఈ వేడుక ఈసారి మాత్రం భద్రతా లోపాలపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తింది. ఒకప్పుడు సంగీత సంబరాలకు ప్రతీకగా నిలిచిన ఈ ఉత్సవం.. ఈసారి మాత్రం భయం, ఆందోళన, భద్రతా వైఫల్యాల చర్చలకు కేంద్రబిందువుగా మారింది. మహిళల భద్రత, భారీ ప్రజా కార్యక్రమాల్లో భద్రతా ఏర్పాట్లు, సోషల్ మీడియా ద్వారా వ్యాపిస్తున్న హింసాత్మక పిలుపులపై ఫ్రాన్స్ ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement