అమెరికా అతలాకుతలం.. వాతావరణ మార్పుతో వరద బీభత్సం | Flash floods in America; Climate change is the main cause | Sakshi
Sakshi News home page

అమెరికా అతలాకుతలం.. వాతావరణ మార్పుతో వరద బీభత్సం

Jun 16 2025 11:37 AM | Updated on Jun 16 2025 11:41 AM

Flash floods in America; Climate change is the main cause

వాషింగ్టన్‌ డీసీ: అమెరికాలోని పలు ప్రాంతాలలో ఆకస్మిక వరదలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. వరద బీభత్సానికి పశ్చిమ వర్జీనియా, టెక్సాస్‌లు ఘోరంగా దెబ్బతిన్నాయి. వర్జీనియాలో కురిసిన కుండపోత వర్షాలు, వరదలకు ఐదుగురు మృతిచెందారు. ఫెయిర్‌మాంట్‌లో ఒక భవనం పాక్షికంగా కూలిపోయింది. అమెరికాలో ఆకస్మిక వరదలకు వాతావరణ మార్పే ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

భారీ వరదల కారణంగా పశ్చిమ వర్జీనియాలోని వీలింగ్ క్రీక్ నదిలో 90 నిముషాల వ్యవధిలో ఏడు అడుగుల మేరకు నీటిమట్టం పెరిగి, మౌలిక సదుపాయాలను దెబ్బతీసింది. ఒహియో కౌంటీలో భారీ వర్షాల కారణంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఆస్టిన్, వాకోతో సహా సెంట్రల్ టెక్సాస్‌లు ఆకస్మిక వరద ప్రమాదంలో చిక్కుకున్నాయి. ఈ ప్రాంతాల్లో నాలుగు అంగుళాల మేరకు వర్షపాతం నమోదయ్యింది. కాన్సాస్‌లో, ఆకస్మిక వరదల కారణంగా ప్రభుత్వం అత్యవసర సహాయ చర్యలు చేపట్టింది.

ఎల్ డొరాడోలో వాల్‌నట్ నది  ఉప్పొంగి సమీపంలోని ఇళ్లను ముంచెత్తింది. టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలో జూన్ 11 రాత్రి నుండి జూన్ 12 ఉదయం వరకు 10 అంగుళాల వర్షపాతం కురిసింది. ఇది ఇక్కడి సాధారణ నెలవారీ సగటు కంటే చాలా ఎక్కువ.  అలబామా, లూసియానా, న్యూయార్క్‌లను కూడా  తుఫాను ముప్పు వెంటాడుతోంది. అమెరికాలో వాతావరణ మార్పు కారణంగా తీవ్రమైన ఉష్ణోగ్రతలతో పాటు ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. శాన్ ఆంటోనియోలో 12 గంటల వ్యవధిలో 10 అంగుళాల వర్షం కురిసింది. ఇది జూన్ నెల మొత్తం సగటు వర్షపాతం కంటే  రెండింతలు అధికం.

అమెరికాలో ఆకస్మిక వరదలకు గల ప్రధాన కారణాలలో వాతావరణ మార్పు ఒకటి. పసిఫిక్ ఇన్‌స్టిట్యూట్ తెలిపిన వివరాల ప్రకారం వాతావరణ మార్పు వల్ల అధిక వర్షపాతం నమోదు కావడం, సముద్ర మట్టాల పెరుగుదల,  వరద ముప్పు లాంటివి చోటుచేసుకుంటున్నాయి.  సముద్ర మట్టం పెరగడం కారణంగా తీరప్రాంతాల్లో వరద ముప్పు అంతకంతకూ పెరుగుతోంది. అధిక ఆటుపోట్లు, తుఫానులు ఏర్పడే పరిస్థితుల్లో ఈ ముప్పు మరింత పెరుగుతోంది. వాతావరణ మార్పుల కారణంగా తుఫానులు మరింత విధ్వంసకరంగా మారి, భారీ వర్షపాతం కురవడంతో పాటు వరదలు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో వాతావరణ మార్పు కారణంగా నేలలోని తేమ తగ్గుతుంది, దీంతో వర్షపు నీరు భూమిలోకి చొచ్చుకుపోయే బదులు ఉపరితలంపైకి వెళ్లిపోతుంది. ఇది ఆకస్మిక వరదలకు దారితీస్తోంది.

అటవీ నిర్మూలన, పట్టణీకరణ వరదల ప్రమాదాన్ని మరింత పెంచుతోంది.  పట్టణ ప్రాంతాలలోని కాంక్రీటు నిర్మాణాలు వర్షపు నీటిని భూమిలోనికి వెళ్లకుండా నిరోధిస్తాయి. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం, అటవీ నిర్మూలనను నిరోధించడం,  పట్టణ ప్రాంతాలలో డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరచడం లాంటివి తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: పాక్‌ ముస్లిం లీగ్‌.. జైరామ్‌ రమేష్‌ ఒక్కటే: బీజేపీ ఘాటు విమర్శ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement