తల్లి మరో దేశంలో.. తండ్రి జైలులో...అనాథైన చిన్నారి! | A family torn apart by Trump immigration policy | Sakshi
Sakshi News home page

తల్లి మరో దేశంలో.. తండ్రి జైలులో...అనాథైన చిన్నారి!

May 1 2025 5:23 AM | Updated on May 1 2025 5:23 AM

A family torn apart by Trump immigration policy

ట్రంప్‌ వలస విధానంతో ముక్కలైన కుటుంబం 

అమెరికాలోని వలసదారులపై ట్రంప్‌ ప్రభుత్వ కఠిన వైఖరి ఓ కుటుంబాన్ని ముక్కలు చేసింది. తల్లిని వెనిజులాకు, తండ్రిని సాల్వడార్‌ జైలుకు పంపిన ప్రభుత్వం వారి రెండేళ్ల పసిబిడ్డను అమెరికాలోనే సంరక్షణ పేరిట వారినుంచి దూరం చేసింది. తల్లిదండ్రు లు లేక చిన్నారి, తనకు దూరమై వాళ్లు దుఃఖిస్తున్నారు. రెండేళ్ల చిన్నారిని మానవతా దృక్పథంతో తల్లితో కలపాలని కుటుంబం డిమాండ్‌ చేస్తోంది. వెనిజులాలో ఆర్థిక, రాజకీయ సంక్షోభాల కారణంగా దేశం వీడిన ఎస్పినోజా, బెర్నాల్‌ పెరూలో ఒక్కటయ్యారు.  

బెర్నా ల్‌ ఫాస్ట్‌ఫుడ్‌ స్టాండ్‌లో, ఎస్పినోజా బార్బర్‌ దుకాణంలో పని చేశారు. అక్కడే పెళ్లి చేసుకున్నారు. 2023 ఫిబ్ర వరి 8న లిమాలో వారికి మైకెలిస్‌ ఆంటోనెల్లా ఎస్పినోజా పుట్టింది. పాపకు ఏడాది ఉండగా అమెరికాకు వచ్చారు. బిడ్డతో సహా ఈక్వెడార్, కొలంబియా, దక్షిణ అమెరికాలోని భయంకరమైన డేరియన్‌ అడవి గుండా 2024 మేలో అమెరికా చేరారు. ట్రంప్‌ రెండోసారి అధికారం చేపట్టాక వారికి కష్టకాలం మొదలైంది. 

అనుమానంతోనే..
ఎస్పినోజా దంపతులను అమెరికా అధికారులు నిర్బంధించా రు. అతన్ని మార్చి 30న వెనిజులా సైనికులను తీసుకెళ్తున్న ఐదు విమానాల్లో ఎల్‌ సాల్వడార్‌కు పంపారు. బెర్నాల్‌ను కూతురితో సహా వెనిజులా తిప్పి పంపుతున్నట్టు ఆమె తల్లికి ఫోన్‌ చేసి చెప్పారు. ఇమిగ్రేషన్‌ పత్రాల్లోనూ పాప పేరుంది. తీరా ఏప్రిల్‌ 25న వెనిజులా రాజధాని కారకాస్‌కు వెళ్లే విమానంలో మాత్రం పాపను ఎక్కించలేదు. 

చిన్నారి అమెరికాలోనే సంరక్షణ కేంద్రంలో ఉందని హోమ్‌ల్యాండ్‌ విభాగం తెలిపింది. ‘‘చిన్నారి తల్లిదండ్రులు వెనిజులాలోని ట్రెన్‌ డి అరగువా ముఠా సభ్యులనే అనుమానం మీద వారిని దేశం నుంచి బహిష్కరించాం. చిన్నారి వారి దగ్గరుంటే వేధింపులకు గురయ్యే ప్రమాదముంది. అందుకు అనుమతించబోం’’అని పేర్కొంది. 

కుటుంబం చెంతకు చేర్చాలి 
తన సోదరుడు నేరస్తుడు కాదని, చాలామంది యువకుల్లాగే ఉపాధి కోసం వెనిజులా వీడాడని ఎస్పినోజా సోదరి చెబుతోంది. ‘‘సంరక్షణ పేరిట నా మనవరాలిని అమెరికాలో రోజుకో కుటుంబం వద్ద వదులుతున్నారు. తల్లిదండ్రులు కనబడక చిన్నారి రోదిస్తోంది’’అని బెర్నాల్‌ తల్లి ఆవేదన చెందుతోంది. తనను వెనిజులాలోని తల్లి చెంతకు చేర్చాలని డిమాండ్‌ చేస్తోంది.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌   

Advertisement
 
Advertisement
Advertisement