
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. పార్టీని ప్రకటించిన ఎలాన్ మస్క్ తాజాగా మరోమారు ట్రంప్‌పై విరుచుకుపడ్డారు. లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన కీలక ఫైల్స్‌ను ప్రభుత్వం ఎందుకు దాస్తున్నదంటూ ఎలాన్ మస్క్ అధ్యక్షుడు ట్రంప్‌ను నిలదీశారు.
How can people be expected to have faith in Trump if he won’t release the Epstein files?
— Elon Musk (@elonmusk) July 8, 2025
దీంతో జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్ వ్యవహారం తాజాగా అమెరికా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. “జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్‌ను ట్రంప్ బయటపెట్టకపోతే ప్రజలు ఆయనను ఎలా నమ్ముతారు?” అంటూ మస్క్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. తాను కొత్తగా స్థాపించిన అమెరికా పార్టీ అధికారంలోకి వస్తే ఈ కుంభకోణాన్ని బయటపెట్టడానికే తొలి ప్రాధాన్యత ఇస్తానని మస్క్ పేర్కొన్నారు.
ఇటీవల అమెరికా న్యాయశాఖ (డీఓజే) జెఫ్రీ ఎప్‌స్టీన్ సంబంధించిన కేసుపై కీలక ప్రకటన చేసింది. ఎప్స్టీన్ నివాసాలలో సోదాలు చేసినా ఎటువంటి క్లయింట్ లిస్ట్ దొరకలేదని, ఇకపై ఈ కేసులో ఎలాంటి సమాచారం వెల్లడించబోమని స్పష్టం చేసింది. దీనిపై మస్క్ తీవ్రంగా స్పందించారు. మీడియా సమావేశంలో ఒక విలేకరి ఇదే అంశంపై ట్రంప్‌ను ప్రశ్నించగా, ఆయన సమాధానాన్ని దాటవేశారు. మీరు ఇంకా ఎప్‌స్టీన్ గురించే మాట్లాడుతున్నారా? అని తిరుగు ప్రశ్నవేశారు.
Will exposing the Epstein files rank high on the America Party’s list?
— Community Notes & Violations (@CNviolations) July 8, 2025
న్యూయార్క్‌కు చెందిన ప్రముఖ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్ సాగించిన దుర్మర్గాల జాబితాను గత ఏడాది న్యూయార్క్ న్యాయస్థానం బట్టబయలు చేసింది. ఈ కేసుకు సంబంధించిన రహస్య పత్రాలను విడుదల చేసే ప్రక్రియలో భాగంగా తొలి విడతగా 40 పత్రాలను విడుదల చేశారు. ఈ కుంభకోణంలో అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్‌ల పేర్లతో పాటు మైకెల్ జాక్సన్ తదితరుల పేర్లు బయటికొచ్చాయి.