
అమెరికాలో రాజకీయంగా మరో సంచలనం రేగింది. ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ రాజకీయ పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా పార్టీ ఏర్పాటుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. మస్క్ పార్టీని అసంబద్ధమైనదిగా ఆయన అభివర్ణిస్తూ.. తీవ్ర ఆరోపణలే చేశారాయన.
అమెరికాలో రిపబ్లికన్ పార్టీ ఘన విజయం సాధించింది. పరిపాలన సజావుగా సాగిపోతోంది. మరోవైపు డెమొక్రట్లు తమ ప్రాబల్యం కోల్పోతున్నారు. అయినప్పటికీ అమెరికా రాజకీయ వ్యవస్థ ఈ రెండు పార్టీలకు అనుకూలంగా ఉంది. ఈ తరుణంలో మూడో పార్టీ ఏర్పాటు అనేది అసంబద్దమైన చర్య. మూడో పార్టీ అమెరికా చరిత్రలో ఎప్పుడూ విజయవంతం కాలేదు అని ట్రంప్ అన్నారు.
మూడో పార్టీని ఎవరు ఏర్పాటు చేసుకున్నా(మస్క్‌ను ఉద్దేశిస్తూ..) తమకేం ఫరక్ పడదని, అయితే ఆ పార్టీ వల్ల అమెరికా రాజకీయాల్లో గందరగోళం నెలకొంటుంది. దేశంలో అస్తవ్యస్తత నెలకొని కలహాలు చెలరేగే అవకాశమూ ఉంది అని ట్రంప్ హెచ్చరించారు.
మస్క్ గతంలో తనకు మద్దతు ఇచ్చినా.. ఇప్పుడు పూర్తిగా మారిపోయారని ట్రంప్ అంటున్నారు. ‘‘మస్క్‌ను చూస్తే జాలేస్తోంది. గత ఐదువారాలుగా ఆయన అదుపు లేకుండా వ్యవహరిస్తున్నారు అని ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఓ పోస్ట్ చేశారు. నేను ప్రవేశపెట్టిన బిల్లులో Electric Vehicle (EV) Mandate రద్దు చేయడం ముఖ్యాంశంగా ఉంది. దీని వల్ల ప్రజలు ఇకపై గ్యాస్, హైబ్రిడ్ లేదా కొత్త టెక్నాలజీ వాహనాలను స్వేచ్ఛగా కొనుగోలు చేయవచ్చు. అయితే మస్క్ గతంలో ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చి.. ఇప్పుడు వ్యతిరేకంగా వ్యవహరించడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. అంతేకాదు.. మస్క్ తన సన్నిహితులను NASA చీఫ్‌గా నియమించాలనుకున్నారు. కానీ ఆ వ్యక్తి రిపబ్లికన్ పార్టీకి మద్దతు లేని డెమొక్రాట్ కావడం వల్లే అలా నియమించడం అనుచితమని భావించా. అమెరికా ప్రజలను రక్షించడమే నా ముందుకు ప్రధాన కర్తవ్యం’’ అంటూ ట్రంప్ పోస్టులో ప్రస్తావించారు.
ఇదిలా ఉంటే.. బిగ్ బ్యూటీఫుల్ బిల్లును వ్యతిరేకిస్తూ ట్రంప్ పాలనా విభాగం డోజ్ నుంచి బయటకు వచ్చేసిన ఎలాన్ మస్క్ విమర్శలను తీవ్రతరం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో బిల్లు ఆమోదం గనుక పొందితే మూడో పార్టీ పెడతానంటూ చెబుతూ వచ్చారు. తాజాగా అదీ జరగడంతో శనివారం రాత్రి తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్(పూర్వపు ట్విటర్)లో ‘అమెరికా పార్టీ’ని ప్రకటించారు. అమెరికాలో రెండు ప్రధాన పార్టీలు.. ఒకే పార్టీ వ్యవస్థగా మారిందని, ప్రజలకు తిరిగి స్వేచ్ఛ ఇవ్వడమే తన లక్ష్యమని చెబుతూ అమెరికా పార్టీ పేరును ప్రకటించారు. అలాగే.. ప్రజలలో 65% మంది మూడవ పార్టీకి మద్దతు ఇస్తున్నారని ఓ పోల్‌ను చూపించారు. ఈ క్రమంలో ట్రంప్ ప్రవేశపెట్టిన భారీ ఖర్చుల బిల్లును(బిగ్ బ్యూటీఫుల్ బిల్)ను మరోసారి తీవ్రంగా విమర్శించారు.
