
వాషింగ్టన్ డీసీ: అమెరికాకు చెందిన లైంగిక నేరస్తుడు ఎప్‌స్టీన్ ఫైల్స్‌పై దుమారం చెలరేగుతున్న వేళ అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్‌స్టీన్ ఫైల్స్ పేరుతో తన పరిపాలనా యంత్రాంగంపై దాడి చేయవద్దని హెచ్చరించారు.
అమెరికా న్యాయ శాఖ ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఎప్‌స్టీన్‌కు చెందిన క్లయింట్ జాబితాను దాచినట్లు ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేసిన అనంతరం కూడా ఆ అంశాన్ని పలువురు లేవనెత్తుతుండటంతో ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఎప్‌స్టీన్ జైలులో హత్యకు గురయ్యాడనే వాదనను కూడా అమెరికా న్యాయశాఖ తోసిపుచ్చింది. 2019లో న్యూయార్క్ జైలులో అతను ఆత్మహత్య చేసుకున్నాడని నిర్ధారించింది. ఈ కేసు దర్యాప్తులోని సమాచారాన్ని వెల్లడించబోమని స్పష్టం చేసింది. అయితే ఈ చర్యను ప్రతిపక్ష పార్టీలు తప్పుపడుతున్నాయి.
ముఖ్యంగా వారు అటార్నీ జనరల్ పామ్ బోండి, ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వారు ట్రంప్ వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ తాముంతా ఒక బృందంగా ఉన్నామని, తమ పాలనపై వస్తున్న విమర్శలు అర్థరహితమైనవని, కొందరు స్వార్థపరులు ఇతరులను బాధ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ట్రంప్ తన అటార్నీ జనరల్ తరపున వాదిస్తూ ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’ అనేది డెమొక్రాటిక్ పార్టీ తన రాజకీయ ప్రయోజనం కోసం ఆడుతున్న నాటకమని, వారు దీనితో ప్రయోజనాలను పొందాలని ఆశిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. ఎవరూ పట్టించుకోని ఎప్‌స్టీన్ గురించి సమయాన్ని, శక్తిని వ్యర్థం చేయవద్దని కోరారు. ఎప్‌స్టీన్ ఫైళ్లలో తన పేరు ఉందనే ఆరోపణలకు ఆయన ఖండించారు.