సెప్టెంబరులోగా ఏర్పడే ఛాన్స్ 80 శాతం!
ప్రపంచ వ్యాప్తంగా కరవు కాటకాలు
పెచ్చరిల్లనున్న వడగాడ్పులు, వరదలు
భానుడి భగభగలు మరింత తీవ్రం
ఉత్తర, మధ్య భారతంలో కరవు
దక్షిణాది రాష్ట్రాలకు వరద ముప్పు
హెచ్చరిస్తున్న ప్రపంచ వాతావరణ సంస్థ
ఇక అనుమానాలు అక్కరలేదు. ఈ ఏడాది ప్రపంచదేశాలకు మాత్రమే కాదు.. భారతదేశానికీ గడ్డుకాలమే. చుట్టపుచూపుగా కరవు కాటకాలను పరిచయం చేసి వెళ్లిపోయే ఎల్–నినో ఈ సారి తన విశ్వరూపాన్ని చూపనుంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలు పెచ్చరిల్లుతాయని, సూర్యుడి ప్రతాపం కూడా ఎక్కువ కానుందని తాజాగా ప్రపంచ వాతావరణ సంస్థ సైతం హెచ్చరించింది.
ఎక్కడో దక్షిణ అమెరికా ఖండంలోని పసఫిక్ మహా సముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు కొన్ని డిగ్రీలు పెరిగితే వచ్చే వాతావరణ మార్పులను ఎల్–నినో అని, చల్లబడితే లా–నినా అంటారని మనకు తెలుసు. భారత్ లాంటి దేశాల్లో లా–నినా అధిక వృష్టికి కారణమవుతూంటుంది. ఈ రెండూ సాధారణంగా 3 నుంచి ఏడేళ్లకు ఒకసారి వచ్చి పోతూంటాయి. అయితే గత రెండు దశాబ్దాలుగా ఈ పరిస్థితిలో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. తరచూ రావడం ఒక సమస్య అయితే... ఒక్కోసారి ఒక్కోలా ప్రభావం చూపడం రెండో సమస్య.
భూతాపోన్నతి (గ్లోబల్ వార్మింగ్) కారణంగా ఈ రెండు వాతావరణ అంశాల తీవ్రత పెరిగిపోయింది. వర్షపాతంలో విపరీతమైన తేడాలు నమోదవడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎల్–నినో ఏర్పడినప్పుడు కొన్ని ప్రాంతాల్లో కరవు కాటకాలు.. కొన్ని చోట్ల వరదలు ముంచెత్తుతున్నాయి. లా–నినా సందర్భంలోనూ అధిక వర్షపాతాల స్థానంలో నగరాలను ముంచెత్తే క్లౌడ్‌బరస్ట్‌లు తరచూ నమోదు అవుతూండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది సూపర్ ఎల్–నినో ఏర్పడుతుందన్న ప్రపంచ వాతావరణ సంస్థ అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
సెప్టెంబరు లోగా...
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావం సాధారణ స్థాయిలో ఉంటుందని భారత వాతావరణ సంస్థ ఇప్పటికే తెలిపిన విషయాన్ని ఒక్కసారి ఇక్కడ ప్రస్తావించాలి. ఎందుకంటే ఈ అంచనాల్లో సూపర్ ఎల్–నినో ప్రస్తావన లేదు. జూన్ నెలలో ప్రపంచ వాతావరణ సంస్థ వెలువరించిన అంచనాల ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరు నుంచి నవంబరు వరకూ సూపర్ ఎల్–నినో పరిస్థితులు ఏర్పడేందుకు 80 – 90% అవకాశం ఉంది.
ఇప్పటికే అగ్ని గుండాన్ని తలపిస్తున్న వాతావరణానికి ఈ సూపర్ ఎల్–నినో ఆజ్యం పోయనుందని, దీన్ని అత్యవసర వాతావరణ హెచ్చరికగా పరిగణించాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ స్వయంగా ప్రకటించడం సమస్య తీవ్రతను స్పష్టం చేస్తోంది.
రెండేళ్ల క్రితం 2023–24 లోనూ సూపర్ ఎల్–నినో ఏర్పడినా ఆ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరాల్లో ఐదవదిగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. సెప్టెంబరు – నవంబరుల మధ్య సూపర్ ఎల్–నినో పరిస్థితులు ఏర్పడితే దాని ప్రభావం తొమ్మిది నుంచి పన్నెండు నెలల వరకూ ఉంటుందని అంచనా. అంటే వచ్చే ఏడాది కూడా మాడు పగిలే ఎండలు, వడగాడ్పులు తప్పవన్నమాట. ఎండలు పెరిగితే దాని ప్రభావం పంట దిగుబడులపై కూడా ఉంటుందన్నది నిర్వివాద అంశం.
మనపై ప్రభావం ఇలా...
సూపర్ ఎల్–నినో ప్రభా వం 2026 నైరుతి రుతుపవనాలపై జూలై నెల నుంచి కనిపించడం ప్రారంభమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూన్ ఒకటవ తేదీన కేరళను తాకిన రుతుపవనాలు ముందుకు కదలడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. జూలైలో ఉత్తర, మధ్య, పశ్చిమ భారత దేశ ప్రాంతాల్లో వర్షపాతంలో లోటు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. పంజాబ్, హర్యానా, ఢిల్లీలలో కరవు పరిస్థితులు రావొచ్చు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో వర్షపాతం తక్కువగా ఉంటుంది. ఆసక్తికరంగా జూలై – ఆగస్టు నెలల్లో దక్షిణాది రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన వర్షాలు కురిసి వరదలు రావచ్చునని అంచనాలు చెబుతున్నాయి. సెప్టెంబరులో ముఖ్యంగా చెన్నై, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సముద్ర తీర ప్రాంతాల్లో ఈ సమస్య ఎదురు కావచ్చునని నిపుణులు చెబుతున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే సూపర్ ఎల్–నినో ప్రభావం కారణంగా 2026– 27 రబీ సీజన్ పంటలపై తీవ్రమైన వ్యతిరేక ప్రభావం పడుతుంది.


