కరువొస్తోంది.. కొత్త సలహాలివ్వండి | Chandrababu government orders to university Vice-Chancellors | Sakshi
Sakshi News home page

కరువొస్తోంది.. కొత్త సలహాలివ్వండి

Jul 21 2026 5:16 AM | Updated on Jul 21 2026 5:16 AM

Chandrababu government orders to university Vice-Chancellors

యూనివర్సిటీ వీసీలకు బాబు ప్రభుత్వ ఆదేశాలు 

పాత సూచనలు, సలహాల స్థానంలో కొత్తవి ఇవ్వాలంటూ జీవో 

కష్టకాలంలో ఆదుకోకుండా సలహాల కోసం జీవోనా? 

మండిపడుతున్న రైతులు, రైతు సంఘాలు 

రెండు దశాబ్దాలలో ఎన్నడూ లేనంత తీవ్ర కరువు రానుంది 

రైతులకు ఉపశమన చర్యలేవి?  

ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహమేది? 

ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఉచిత విత్తనాలెక్కడ? 

బీమా పరిహారం ఊసులేదు.. రుణాల రీషెడ్యూల్‌ లేదు 

సమగ్ర ప్రణాళిక వదిలేసి.. సలహాలతో కాలయాపన చేయడం తగునా? 

చంద్రబాబు ప్రభుత్వ తీరుపై వ్యవసాయ నిపుణుల విస్మయం

సాక్షి, అమరావతి: ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై దాదాపు 50 రోజులు దాటింది. అంటే సీజన్‌లో దాదాపు సగం కాలం గడిచిపోయింది. కానీ చినుకు జాడలేదు. ఓ మోస్తరు వర్షం కూడా పడడం లేదు. రాయలసీమలో పొలాలన్నీ బీటలు వారుతున్నాయి. ఉమ్మడి ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో విత్తనాలు నేలలోనే నిద్రపోతున్నాయి. గోదావరి, కృష్ణా డెల్టాలో నారుమళ్లు సైతం ఎండిపోతున్నాయి. మెట్ట, మాగాణి అని తేడా లేదు. వర్షాధారం..బోర్ల కింద వ్యత్యాసం లేదు. ఎటు చూసినా భీతావాహ వాతావరణమే కన్పిస్తోంది. 

ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో రైతులను కరువు నుంచి ఎలా బయట పడేయాలన్న ఆలోచన చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ఆ విషయాన్ని గాలికొదిలేసింది. రైతులను ఆదుకోవడానికి సమగ్ర ప్రణాళిక రూపొందించడం, కరువు సహాయక చర్యలకు ఉపక్రమించడం వదిలేసింది. ఇలాంటి సమయంలో రైతుకిచ్చే సలహాలు, సూచనలను మార్చి కొత్త సలహాలివ్వాలని యూనివర్సిటీ వీసీలను ఆదేశిస్తూ సోమవారం చంద్రబాబు ప్రభుత్వం ఓ జీవో జారీ చేసింది. దీనిపై రైతులు, రైతు సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇలాంటి కష్ట కాలంలో ప్రభుత్వం స్పందించే విధానం ఇదేనా అని వ్యవసాయ నిపుణులు కూడా విస్తుపోతున్నారు. 

అత్యంత తీవ్రమైన కరువు 
ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో కరువు తాము ఊహించినదానికంటే ఎక్కువగానే ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. జూన్‌లో 25 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, జూలైలో 62 శాతం లోటు ఉంటుందని తొలుత అంచనావేశారు. కానీ 15వ తేదీ నాటికే ఏకంగా 82శాతం లోటు వర్షపాతం నమోదవడం ఆందోళన కల్గిస్తోంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ, ఉభయగోదావరి, అన్నమయ్య జిల్లాల్లో –60 నుంచి –99 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, 24 జిల్లాల్లో –20 నుంచి–50 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ వర్షాభావం కాదు. గత రెండు దశాబ్దాల్లోనే ఎన్నడూ లేనంత అత్యంత తీవ్రమైన కరువు పరిస్థితి రానుందని నిపుణులంటున్నారు.  
కరువు ఉపశమన చర్యలెక్కడ? 
ఇలాంటి విపత్తు వేళ ప్రభుత్వాలు సాధారణంగా కరువు ఉపశమన చర్యలు ప్రారంభిస్తాయి. ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం ఇస్తాయి. కంటిజెన్సీ ప్లాన్‌ కింద ఉచితంగా విత్తనాలు, ఇతర సాగు ఉత్పాదకాలను పంపిణీ చేస్తాయి. ఇన్‌పుట్‌ సబ్సిడీలు ప్రకటిస్తాయి. సాధ్యమైనంత త్వరగా పంటల బీమా పరిహారాన్ని అందించే ఏర్పాటు చేస్తాయి. రుణాలను రీషెడ్యూల్‌ చేస్తాయి. ఉపాధి హామీ పనులను వ్యవసాయానికి అనుసంధానిస్తాయి. పశువులకు మేత కేంద్రాలు ఏర్పాటు చేస్తాయి. తాగునీటి చర్యలు చేపడతాయి. కానీ వీటన్నిటినీ వదిలేసి కరువు ప్రభావిత ప్రాంతాల్లో శాస్త్రవేత్తలు ఇచ్చే సలహాలు సూచనల్లో మార్పు తీసుకు రావాలంటూ చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో జారీ చేయడం విస్మయానికి గురిచేస్తోందని వ్యవసాయ నిపుణులంటున్నారు.  

సాయం వదిలేసి ఉచిత సలహాలెందుకు? 
వ్యవసాయ సీజన్‌ ప్రారంభానికి ముందు వాతావరణ శాఖ ముందస్తు  అంచనాల ప్రకారం కరువు తీవ్రతను అంచనా వేస్తుంది. కరువు ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి ముందస్తు, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలో  సలహాలు సూచనలు ఇవ్వడం పరిపాటి. ఇందుకోసం పంటల వారీగా సీజన్‌కు ముందుగానే ప్రత్యేక బులిటెన్లు జారీ చేస్తారు. అయితే ఇవన్నీ చాలా సాధారణంగా ఉన్నాయని పేర్కొంటూ విధిగా వాటికయ్యే ఖర్చు–లాభాల లెక్కలను జతచేయాలంటూ యూనివర్శిటీ వీసీలను ప్రభుత్వం ఆదేశించింది.  దాదాపు 50 రోజులు గడిచిన తర్వాత ఖరీఫ్‌ 2026 సీజన్‌ కోసం మీరు ఇచ్చిన సలహాలు, సూచనలను పునఃసమీక్షించాలంటూ జీవో ఇచ్చింది.

జోన్‌ల వారీగా, నీటి లభ్యత వారీగా, భూ స్వామ్యత/భూమి పరిమాణం వారీగా కొత్త సలహాలు, సూచనలతో పాటు ఖర్చులు, లాభనష్టాలతో కూడినసమగ్ర నివేదిక పదిరోజుల్లో ప్రభుత్వానికి పంపాలని ఈ జీవోలో ఆదేశించారు. లాభసాటి కాకపోతే ప్రత్యామ్నాయ సాగు పద్దతుల జోలికి పోవద్దంటూ రైతులకు ఉచిత సలహా ఇస్తున్నారు. ఈజీవో చూస్తుంటే కరువు పరిస్థితులను ఎదుర్కొనే సమగ్ర ప్రణాళిక కంటే, కేవలం సలహాలు, సూచనలు ఇస్తూ కాలయాపన చేయాలన్న ఆలోచన కన్పిస్తోందని రైతులు మండిపడుతున్నారు.

ఇలాంటి కరువు వేళ ఒకటి రెండుసార్లు విత్తనాలు వేయాల్సి ఉంటుంది. పంటలను కాపాడుకునేందుకు రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఇదంతా రైతులకు భారమే. ఇలాంటి విపత్తు వేళ ఆ భారాన్ని ప్రభుత్వం భరించాలే తప్ప లాభసాటి కాకపోతే మానేయండంటూ సలహాలివ్వడమేమిటని రైతులు మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement