ఎర్రబుక్కు దారిలో... దిగజారిన ఖాకీ | Redbook effect: Central govt Comments on performance of AP Police | Sakshi
Sakshi News home page

ఎర్రబుక్కు దారిలో... దిగజారిన ఖాకీ

Jul 21 2026 5:10 AM | Updated on Jul 21 2026 5:10 AM

Redbook effect: Central govt Comments on performance of AP Police

కుండబద్దలు కొట్టిన కేంద్ర హోంశాఖ నివేదిక

26వ స్థానానికి పడిపోయిన  ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ పనితీరు

చిన్న రాష్ట్రాలకు కూడా మెరుగైన ర్యాంకులు 

రెడ్‌బుక్‌ ఎఫెక్ట్‌తో కుప్పకూలిన ఏపీ పోలీసు వ్యవస్థ 

పనితీరు అత్యంత నాసిరకంగా ఉందని తేల్చిన కేంద్ర హోంశాఖ 

పోలీసు సంస్కరణల్లో పూర్తి వైఫల్యం

దర్యాప్తు ప్రమాణాల విషయంలో వెనుకబాటు

సాంకేతిక పరిజ్ఞానం వాడుకోవడం రాదు.. ఇతర శాఖలతో సమన్వయం చేతకాదు

ఇదీ ఏపీ పోలీసు వ్యవస్థ పనితీరు

సాక్షి, అమరావతి: పనితీరు నాసిరకం... పరిపాలనా సంస్కరణలు చేతకాదు.. దర్యాప్తు ప్రమాణాలు దారుణం.. సాంకేతిక పరిజ్ఞానం సగమే తెలుసు.. ఇతర శాఖలతో సమన్వయం సున్నా.. ఇవన్నీ ఏమనుకుంటున్నారు.. ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల కీర్తి కిరీటంలోని మణులు, మాణిక్యాలు... తాజాగా కేంద్ర ప్రభుత్వం ఏపీ పోలీసుల పనితీరును స్పష్టంగా నిర్ధారించింది. అన్ని విషయాల్లోనూ తీసికట్టు అని తేల్చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పోలిస్తే ఏపీ పోలీసు వ్యవస్థ పనితీరు.. 26వ స్థానానికి దిగజారినట్లు కేంద్ర హోం శాఖ నివేదిక వెల్లడించింది. కానీ రెడ్‌బుక్‌ అమలులో ఏపీ పోలీసులు అద్భుతమైన నైపుణ్యం సంపాదించారు. అక్రమ కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, అమాయకులపైనా, సోషల్‌ మీడియా కార్యకర్తలపైనా నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్లు పెట్టడం.. కోర్టులు మొట్టికాయలు వేసినా పట్టించుకోకపోవడం.. ఇలాంటి వాటిలో ఆరితేరిపోయారు.. ఈ విషయాల్లో పాయింట్లు ఇస్తే.. దేశంలో నెంబర్‌ ఒన్‌గా నిలిచేవారేమో..! 

దిగజారిన ఏపీ పోలీసు శాఖ ర్యాంకు 
ప్రజలకు భద్రత, సత్వర న్యాయం అందించడంలో ఏపీ పోలీసు శాఖ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. పోలీసు సంస్కరణలు, నేర న్యాయ చట్టాల అమలులో దేశంలో అట్టడుగు స్థాయికి దిగజారిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్‌ కక్ష సాధింపు కుట్రలకు వత్తాసు పలకడమే ఏకైక కర్తవ్యంగా భావిస్తున్న పోలీసు శాఖ సామాన్యులకు న్యాయం అందించాలన్న తన విద్యుక్త ధర్మాన్ని పూర్తిగా విస్మరించింది. దేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి 36 పోలీసు శాఖల పనితీరుపై కేంద్ర హోమ్‌ శాఖ ఇచ్చిన నివేదికలో ఆంధ్ర ప్రదేశ్‌ 26వ స్థానంలో నిలవడమే అందుకు నిదర్శనం. 

ఏపీ కంటే చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా మెరుగైన పనితీరుతో అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. పోలీసు సంస్కరణలలో భాగంగా ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భారతీయ నాగరిక సురక్షా సంహిత (బీఎన్‌ఎన్‌ఎస్‌), భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) చట్టాల అమలుపై కేంద్ర హోమ్‌ శాఖ తాజా నివేదిక విడుదల చేసింది. నాలుగు విభాగాలుగా దేశంలో పోలీసుల పనితీరును మదించింది. పరిపాలన సంస్కరణలకు 20 శాతం, నిర్వహణపరమైన సమర్థతకు 45 శాతం, సమాచార – సాంకేతికత అమలు (ఐసీటీ అప్లికేషన్స్‌)కు 25 శాతం,  పోలీసు – వైద్య – ఆరోగ్య – న్యాయ శాఖల మధ్య సమన్వయానికి 10 శాతం చొప్పున పాయింట్లు కేటాయించింది. మొత్తం 100 పాయింట్లకు పోలీసు శాఖల పనితీరును మదించింది.

   
అన్ని విభాగాల్లోనూ దారుణమే 
ఏపీ పోలీసు శాఖ పనితీరు అత్యంత నాసిరకంగా ఉందని కేంద్ర హోమ్‌ శాఖ నివేదిక గణాంకాలు వెల్లడించాయి. టాప్‌ 10లో ఉన్న రాష్ట్రాల్లో పోలీసు శాఖ పనితీరు బాగున్నట్టుగా పరిగణిస్తారు. ఏపీ పోలీసు టాప్‌ 25లో కూడా స్థానం సాధించలేకపోయింది. దేశంలో 26వ స్థానానికే పరిమితమైంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నాలుగు విభాగాల్లోనూ ఏపీ పోలీసుల పనితీరు దారుణంగా ఉంది. 

సంస్కరణల అమలు సక్రమంగా లేదు 
పరిపాలన సంస్కరణల విభాగంలో 20 పాయింట్లకు ఏపీ పోలీసు శాఖకు 14.84 పాయింట్లు వచ్చాయి. కేసుల దర్యాప్తులో దర్యాప్తు అధికారులు సక్రమంగా వ్యవహరించేందుకు తీసుకువచ్చిన సంస్కరణలను ఇందులో నిర్దేశించారు. ఉదాహరణకు గతంలో ఏదైనా నేరం సంభవిస్తే... అక్కడికి చేరుకున్న దర్యాప్తు అధికారి ఘటనా స్థలంలో  స్కెచ్‌ వేస్తున్నప్పుడు వీడియో తీయాలని.. ఆ వెంటనే నేరుగా సీడీ ఫైల్‌లో అప్‌లోడ్‌ చేయాలని స్పష్టం చేసింది. స్కెచ్‌ వేస్తున్న సమయం, సీడీ ఫైల్‌లో అప్‌లోడ్‌ చేసిన సమయం కూడా రికార్డు అవుతాయి. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు  పోలీస్‌ స్టేషన్‌ ఆఫీసర్లు, దర్యాప్తు అధికారులు, ఇతరులకు ట్యాబ్‌లు ఇవ్వడంతోపాటు ఇతర మౌలిక సదుపాయాలు సమకూర్చాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయాన్నే పట్టించుకోలేదు. పోలీస్‌ స్టేషన్‌కు కేవలం ఒక ట్యాబ్‌ను మాత్రమే అందించింది. అర్బన్‌ ప్రాంతాల్లో పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రోజుకు సగటున నాలుగు కేసులు నమోదు అవుతున్నాయి. కానీ ఒక్క ట్యాబ్‌ మాత్రమే ఉంది. అధికార పార్టీ నేతలు రాజకీయ కక్ష సాధింపుతో పాల్పడిన నేరాలు, అత్యాచారాల దర్యాప్తునకు ట్యాబ్‌లు తీసుకువెళ్లడం లేదు.  

సమగ్ర దర్యాప్తు ప్రమాణాల్లో వీక్‌ 
కీలకమైన శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల కట్టడి, సమగ్ర దర్యాప్తు విషయంలో ఏపీ పనితీరు తీసికట్టుగా ఉంది. ఈ విభాగంలో మొత్తం 45 పాయింట్లకు ఏపీకి 29.88 పాయింట్లు మాత్రమే వచ్చాయి. కేంద్రం నిర్దేశించిన మేరకు ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ నేరాల దర్యాప్తు విధానంపై పోలీసులకు శిక్షణ ఇవ్వాలి. ఫోరెన్సిక్‌ పరిజ్ఞానం, సైబర్‌ పరిజ్ఞానంపై అవగాహన కల్పించాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం పోలీసుల దర్యాప్తు ప్రమాణాలు పెంపొందించే అంశాన్ని పూర్తిగా విస్మరించింది.  

సాంకేతిక పరిజ్ఞానం వినియోగం రాదు 
సమాచార – సాంకేతికత పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకునే అం­శాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. అందుకే ఐటీసీ విభాగంలో మొత్తం 25 మార్కులకు ఏపీ పోలీసు శాఖ సగం మార్కు కూడా దాటలేకపోయింది. 12.75 మార్కులకే పరి­మితమైంది. ఈ విభాగంలో పోలీసు స్టేషన్లలో సీసీ కెమెరాల ఏర్పాటు, ఇతర కీలక అంశాల పనితీరును కేంద్ర హోమ్‌ శాఖ మదించింది. నిందితులను పోలీస్‌ స్టేషన్‌కు ఎప్పుడు తీసుకువచ్చారు?.. లాకప్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయి...? నిందితుడిని న్యాయస్థానానికి ఎప్పుడు తీసుకువెళ్లారు.. మొదలైనవి సీసీ కెమెరాల్లో రికార్డు కావాలి. కానీ రాష్ట్ర రాజధాని విజయవాడలోని కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లోనే లాకప్‌ హత్య చేసి...సీసీ కెమెరాల వీడి­యో ఫుటేజీని మాయం చేసిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కుతుంది. అంత దారుణంగా ఉంది ఏపీ పోలీసు శాఖ పనితీరు.   

ఇతర శాఖలతో సమన్వయం లేదు 
నేరాలను సమగ్రంగా దర్యాప్తు చేసి దోషులకు శిక్షలు పడేలా చేయడం కోసం పోలీసు, ఫోరెన్సిక్, వైద్య – ఆరోగ్య, జైళ్ల శాఖల మధ్య సమన్వయం అవసరం. అత్యంత కీలకమైన ఈ విభాగంలో ఏపీ పోలీసు శాఖ 7.06 పాయింట్లకే పరిమితమైంది.  

ఏపీ కన్నా చిన్న రాష్ట్రాలే భేష్‌
పోలీసు సంస్కరణల అమలులో ఏపీ కంటే చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మెరుగైన పనితీరు కనబరిచాయి. మొత్తం 100 పాయింట్లకు ఏకంగా 95.58 పాయింట్లతో హర్యానా దేశంలో మొదటి స్థానం సాధించగా... 92.86 పాయింట్లతో గోవా రెండో స్థానంలో, 88.37 పాయింట్లతో అస్సాం మూడో స్థానంలో నిలిచాయి. నాలుగో స్థానంలో అండమాన్‌ నికోబార్‌ దీవులు, అయిదో స్థానంలో దాద్రానగర్‌ హవేలీ, ఆరో స్థానంలో చండీగఢ్‌ ఏడో స్థానంలో రాజస్థాన్, ఎనిమిదో స్థానంలో మహారాష్ట్ర, తొమ్మిదో స్థానంలో పంజాబ్, పదో స్థానంలో త్రిపుర ఉన్నాయి. ఏపీ మాత్రం ఎక్కడో అట్టడుగున 26వ స్థానానికే పరిమితమైంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement