వృద్ధుడిపై ఎస్సై దాష్టీకం | Elderly man attempts suicide | Sakshi
Sakshi News home page

వృద్ధుడిపై ఎస్సై దాష్టీకం

Jul 21 2026 5:02 AM | Updated on Jul 21 2026 5:02 AM

Elderly man attempts suicide

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భూషయ్య

పక్కింట్లో జరిగిన స్వల్ప వివాదంపై తననే తిట్టారంటూ టీడీపీ వర్గీయుడి ఫిర్యాదు 

వృద్ధుడిని స్టేషన్‌కు పిలిచి కొట్టిన ఎస్సై 

మనస్తాపంతో భార్య సమాధి వద్ద పురుగుల మందు తాగిన వైనం.. పరిస్థితి విషమం   

త్రిపురాంతకం (యర్రగొండపాలెం): టీడీపీ సానుభూతిపరుడు ఫిర్యాదు చేయడమే తడవుగా ఎస్సై ఓ వృద్ధుడిని బెల్టుతో కొట్టడంతో ఆయన ఆత్మహత్యాయత్నం చేసిన ఉదంతమిది. మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలోని బ్రహ్మంగారి కాలనీలో జరిగిన ఈ ఘటన వివరాలివీ.. బ్రహ్మంగారి కాలనీలో ఇంట్లో సమస్యపై మాట చిన్న భూషయ్య (60) తన చిన్న కుమారుడు పవన్‌తో సోమవారం గొడవ పడుతుండగా పక్కింట్లో ఉన్న టీడీపీ సానుభూతిపరుడైన మాట నాగభూషణం తన సెల్‌లో వీడియో తీశాడు. తండ్రీ, కొడుకు తననే తిడుతున్నారంటూ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.

వెంటనే ఎస్సై శివరామకృష్ణ.. చిన్న భూషయ్యను పిలిపించి నాగభూషణంను ఎందుకు తిడుతున్నావని ప్రశ్నించాడు. తాను ఎవరినీ తిట్టలేదని, తన కుమారుడు పవన్‌ ఇంట్లో గొడవ పడుతుండగా వారిని వారిస్తున్నానని తెలిపాడు. ఎస్సై ఆయన మాటలు పట్టించుకోకుండా, ఎటువంటి విచారణ జరపకుండా, కనీసం వయసును కూడా చూడకుండా భూషయ్యను రూంలోకి లాక్కొని వెళ్లి బెల్ట్‌తో చితకబాది పంపించాడు.

తీవ్ర మనస్తాపానికి గురైన భూషయ్య ఇటీవల మృతి చెందిన తన భార్య సమాధి వద్దకు వెళ్లి పురుగు మందు తాగాడు. ఈ విషయాన్ని తన కుమారుడికి ఫోన్‌ చేసి చెప్పాడు. వెంటనే అక్కడికి వచ్చిన కుటుంబ సభ్యులు.. సమాధిపై పడి ఉన్న భూషయ్యను యర్రగొండపాలెంలోని ప్రభుత్వ వైద్యశాలలో చేరి్పంచారు. భూషయ్య పరిస్థితి విషమంగా ఉంది. మాట నాగభూషణం టీడీపీ నేత కావడం వలన వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులమైన తమపై రాజకీయ కక్షతోనే పోలీసులకు ఫిర్యాదు చేశాడని, తన తండ్రిని ఎటువంటి విచారణ జరపకుండా ఎస్సై బెల్ట్‌తో కొట్టాడని, కేసులు పెడతామని బెదిరించాడని పవన్‌ ఆరోపించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement