‘ఎడారి’ బతుకు.. బితుకు! | Gulf crisis puts Indian livelihoods at risk | Sakshi
Sakshi News home page

‘ఎడారి’ బతుకు.. బితుకు!

Jul 21 2026 12:56 AM | Updated on Jul 21 2026 12:56 AM

Gulf crisis puts Indian livelihoods at risk

యుద్ధ ప్రభావంతో కరిగిపోతున్న గల్ఫ్‌ కలలు

కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థలు

కొత్త నియామకాల్లేవ్‌.. ఉద్యోగాల తీసివేత.. వేతనాల్లో కోత 

నిరుద్యోగ నిలయాలుగా ఎడారి నగరాలు 

జీతాలు లేక లేబర్‌ క్యాంపుల్లోనే కార్మికులు 

గల్ఫ్‌ నుంచి 10 లక్షల మంది భారత వలస కార్మికుల ఇంటి బాట 

45 లక్షల మంది కార్మికులకు ఉపాధి ముప్పు 

లూప్‌లైన్‌లోకి వెళ్లిన దుబాయ్‌ 

రూ.5,600 కోట్లకు పైగా అత్యవసర ఆర్థిక ప్యాకేజీ ప్రకటన  

వైమానిక సర్విసులులేక వెలవెలబోతున్న పర్యాటకం

సాక్షి, హైదరాబాద్‌: మధ్యప్రాచ్యంలో ఇరాన్‌ సంక్షోభం తీవ్రం కావడంతో గల్ఫ్‌ దేశాల ఆర్థిక వ్యవస్థలు, ముఖ్యంగా దుబాయ్‌ రంగుల ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలింది. విమానయానం, పర్యాటకం, నిర్మాణ రంగాలపై ఆధారపడిన ఈ ఎడారి నగరాలు ఇప్పుడు నిరుద్యోగ నిలయాలుగా మారాయి. గల్ఫ్‌ రీజియన్‌లో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ప్రైవేటు రంగాలు భారీగా నష్టాల్లో కూరుకుపోయాయి. భార త విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం కేవ లం ఫిబ్రవరి చివరి వారం నుంచి ఏప్రిల్‌ మధ్య కాలం నాటి కే సుమారు 10 లక్షల మంది భారతీయ కార్మికులు గల్ఫ్‌ ప్రాంతంలో ఉద్యోగాలు కోల్పోయి, లేదా రక్షణ లేక స్వదేశానికి తిరిగి వచ్చేశారంటే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

యూఏఈలోని కంపెనీల యజమానులపై ‘మ్యాన్‌పవర్‌ గ్రూప్‌’జరిపిన సర్వే ప్రకారం 25 శాతం కంపెనీలు ప్రస్తుత త్రైమాసికంలో ఉద్యోగులను పూర్తిగా తొలగించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి.33 శాతం కంపెనీలు కొత్తగా ఎలాంటి రిక్రూట్‌మెంట్లు చేయకూడదని నిర్ణయించాయి. 50 శాతం వరకు వేతనాల కోత విధించడంతోపాటు ఉద్యోగాల్లో కొనసాగుతున్న మిగిలిన కార్మికులకు 20–50 శాతం వరకు జీతాలు తగ్గించారు. గల్ఫ్‌ దేశాలలో ఉన్న మొత్తం 90 లక్షల మంది భారతీయ వలస కార్మికులలో దాదాపు సగానికి పైగా జనాభా ఈ ఉద్యోగ ముప్పు పరిధిలో ఉన్నారు. 

తగ్గిన రెమిటెన్స్‌ ఆదాయం.. 
విదేశాల్లోని భారతీయులు స్వదేశానికి పంపే నిధుల (రెమిటెన్స్‌) ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఎత్తున విదేశీ మారకం లభిస్తోంది. అయితే ఈ యుద్ధ వాతావరణం వల్ల భారత ఆదాయానికి గండిపడింది. కేవలం గల్ఫ్‌ దేశాల నుంచి ఏడాదికి వచ్చే సుమారు రూ.4 లక్షల కోట్లకు పైగా రెమిటెన్స్‌ ఆదాయం ఇప్పుడు నిలిచిపోయే ప్రమాదంలో పడింది. భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా వచ్చే మొత్తం రెమిటెన్స్‌లలో గల్ఫ్‌ కోఆపరేషన్‌ కౌన్సిల్‌ (జీసీసీ) దేశాల వాటానే 38 శాతం ఉంటోందని సమాచారం. దుబాయ్‌ నుంచే అత్యధికంగా 19 శాతం నిధులు వస్తాయి. ఈ ఆదాయం ఆగిపోవడంతో భారతీయ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ముఖ్యంగా కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 

ప్యాకేజీ ప్రకటించినా.. 
ఇరాన్‌ క్షిపణులు, డ్రోన్‌ దాడుల నేపథ్యంలో యూఏఈ వైమానిక మార్గాలు మూతపడడం, పర్యాటకం క్షీణించడంతో దుబాయ్‌ లూప్‌లైన్‌లోకి వెళ్లిపోయింది. వరల్డ్‌ బ్యాంక్‌ అంచనాల ప్రకారం గల్ఫ్‌ రీజియన్‌ ఆర్థిక వృద్ధి రేటు గత ఏడాది ఉన్న 4.4 నుంచి ప్రస్తుతానికి 1.3 శాతానికి పడిపోయింది. స్థానిక వ్యాపారాలు దివాళా తీయకుండా కాపాడటానికి దుబాయ్‌ ప్రభుత్వం రూ.5,600 కోట్లకు పైగా అత్యవసర ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. అయినప్పటికీ అంతర్జాతీయ విమాన సర్వీసులు తగ్గడం వల్ల హోటళ్లు, రిటైల్‌ మాల్స్‌ వెలవెలబోతున్నాయి.  

నిర్మాణ రంగం స్తంభన 
దుబాయ్‌ అనగానే గుర్తొచ్చే ఆకాశహార్మ్యాల నిర్మాణం ఇప్పుడు పూర్తిగా మందగించింది. అబుదాబి చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నివేదికల ప్రకారం ప్రైవేట్‌ రంగంలో దాదాపు 45 శాతం నిర్మాణ ప్రాజెక్టులు తాత్కాలికంగా నిలిచిపోయాయి లేదా రద్దయ్యాయి. స్ట్రెయిట్‌ ఆఫ్‌ హార్మూజ్‌ రవాణా మార్గంలో ఉద్రిక్తతల వల్ల ఉక్కు, సిమెంట్, ఇతర బిల్డింగ్‌ మెటీరియల్స్‌ సరఫరా నిలిచిపోయింది. రవాణా ఖర్చులు పెరగడంతో నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగింది. దీనివల్ల నిర్మాణ రంగంలో రోజువారీ కూలీలుగా పనిచేసే లక్షలాది మంది భారతీయులు జీతాలు అందక లేబర్‌ క్యాంపులకే పరిమితమయ్యారు. ఇరాన్‌ యుద్ధం కారణంగా ఏర్పడిన ఈ సునామీ దుబాయ్‌ను నిర్మించిన శ్రామిక శక్తిని రోడ్డున పడేసింది. అటు గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి కోల్పోయి, ఇటు స్వదేశంలో సరైన ఉద్యోగాలు దొరక్క లక్షలాది మంది వలస జీవులు నిరుద్యోగ ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. 

వెసులుబాటు దుర్పినియోగం.. 
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఖతర్‌లోని కొన్ని కంపెనీలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఒక నెల వేతనం చెల్లించకపోతే కంపెనీలను గతంలో బ్లాక్‌ లిస్టులో పెట్టేవారు. ఇప్పుడు మూడు నెలలు వేతనాలు ఇవ్వకపోయినా బ్లాక్‌ లిస్టులో పెట్టకుండా కంపెనీలకు ప్రభుత్వం వెసులుబాటును కల్పించింది. ఈ అవకాశాన్ని కొన్ని కంపెనీలు దుర్పినియోగం చేస్తున్నాయి. కంపెనీలు స్థోమత ఉన్నప్పటికీ వేతనాలు చెల్లించడం లేదు.

బహ్రెయిన్‌ రావొద్దు.. 
యుద్ధ ప్రభావం బహ్రెయిన్‌లో అధికంగా ఉంది. అనేక కంపెనీలు కార్మికులకు తాత్కాలిక సెలవులు ప్రకటించి ఇంటికి పంపిస్తున్నాయి. 3–4 నెలల నుంచి వేతనాలు చెల్లించడం లేదు. కంపెనీలు ఆర్థికంగా నష్టపోవడంతో కార్మికుల ఉపాధిపై దెబ్బ పడింది. ఎవరైనా ఇప్పట్లో బహ్రెయిన్‌ రాకపోవడమే మంచిది. ఇక్కడ ఉన్నవాళ్లే క్రమక్రమంగా ఇంటికి వస్తున్నారు. 
– శ్రీనివాస్‌ గుప్తా, రేకులపల్లి గ్రామం, నిజామాబాద్‌

దారులు మూసుకుపోయాయి 
వ్యక్తిగత కారణాలతో రెండు నెలల క్రితం బహ్రెయిన్‌ నుంచి ఇంటికి వచ్చాను. యుద్ధం తీవ్రం కావడంతో కంపెనీ సెలవులు ఇచ్చింది. సెలవు ముగిసినప్పటికీ అక్కడికి వెళ్లలేకపోతున్నాను. ఖతర్‌ వెళ్తామంటే కొత్త వీసాల జారీపై ఆంక్షలు విధించారు. గల్ఫ్‌ దేశాల్లో ఉపాధికి అడ్డంకులు ఏర్పడ్డాయి. యుద్ధం ఆగితే తప్ప గల్ఫ్‌ ఉపాధిపై ఆశలు చిగురించే అవకాశం లేదు. – కొట్టూరి రాకేష్ , తొర్తి గ్రామం, నిజామాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement