సాక్షి,హైదరాబాద్: ట్రైనీ ఐపీఎస్ అధికారి ఎం.ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే, ఆత్మహత్యాయత్నానికి ముందు ట్రైనీ ఐపీఎస్ రాసిన సూసైడ్ లేఖ తాజాగా వెలుగులోకి వచ్చింది. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి తనపై చేసిన లైంగిక వేధింపులు పూర్తిగా అవాస్తవమని ఉదయ్ కృష్ణారెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు.
తాను సదరు బ్యాచ్‌మేట్ (కర్ణాటకకు చెందిన మహిళా ట్రైనీ ఐపీఎస్)తో గత ఏడాది కాలంగా రిలేషన్‌లో ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ఆమెకు వివాహమైన తర్వాత కూడా తమ ఇద్దరి మధ్య ఈ బంధం కొనసాగిందని వెల్లడించారు. ఈ క్రమంలో ట్రైనీ ఐపీఎస్ అధికారిణే స్వయంగా తన గది వద్దకు వచ్చి తలుపు తీయమని గొడవ చేసిందని, దీనికి సంబంధించిన పూర్తి వీడియో ఆధారాలు తన మొబైల్ ఫోన్‌లో ఉన్నాయని వివరించారు.
వారి మధ్య ఉన్న రిలేషన్, వివాదానికి సంబంధించిన అన్ని విషయాలను మహిళా ట్రైనీ ఐపీఎస్ భర్తకు కూడా వివరించినట్లు పేర్కొన్నారు. ఈ సంభాషణలు, చాటింగ్‌లు, వీడియోల తాలూకు అన్ని రకాల నిరూపణలు తన ఫోన్‌లోనే భద్రంగా ఉన్నాయని, వాటిని పరిశీలిస్తే నిజానిజాలు తెలుస్తాయని లేఖలో వెల్లడించారు. ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. ఈ సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు కేసును సరికొత్త కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.


