సాక్షి,హైదరాబాద్: ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని, రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా కలెక్టరేట్ లోని ఉద్యాదిత్య భవన్ లో నల్లగొండ, సూర్యపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల అధికారులతో ఎల్ నినో సంసిద్ధత, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహంపై సోమవారం (జూలై 20) ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది.
ఎల్ నినో ప్రభావం వల్ల రాబోయే రోజుల్లో ప్రజలకు ఎలాంటి తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. నీటి లభ్యతను బట్టి రైతులు కేవలం వరి పంటపైనే ఆధారపడకుండా, లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటలు వేసేలా అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.
జిల్లాకు సాగునీరు అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గం పనులను 2028 ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని మంత్రి ప్రకటించారు. దీని ద్వారా ఉమ్మడి జిల్లాలోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని వెల్లడించారు. ఈ సొరంగం పనులను వేగవంతం చేయడానికి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని ఆయన కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఎలాంటి ప్రకృతి విపత్తులనైనా సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలను ఆదుకుంటామని మంత్రులు ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు రాష్ట్ర ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, నల్లగొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


