వెనెజువెలాను వణికించిన జంట భూకంపాల విషాదంలో.. ఆశాకిరణంలా ఓ అద్భుతం చోటుచేసుకుంది. దాదాపు ఎనిమిది రోజుల తర్వాత అంతర్జాతీయ రెస్క్యూ బృందాలు సజీవంగా బయటకు తీశాయి. అంతే.. ప్రపంచ మీడియా వరుస కథనాలతో ఊదరగొడుతోంది. అయితే ఇక్కడే మరో ప్రశ్న కూడా బలంగా వినిపిస్తోంది. అతన్ని బయటకు తీయడానికి ఇన్నిరోజులు ఎందుకు పట్టింది? అని..
జూన్ 24న సంభవించిన 7.2, 7.5 తీవ్రతతో సంభవించిన వరుస భూకంపాలతో.. లా గ్వైరా స్టేట్‌లోని గ్యాలేరియాస్ ప్లాయా గ్రాండే షాపింగ్ మాల్ కుప్పకూలింది. ఆ శిథిలాల కింద చిక్కుకున్న 43 ఏళ్ల భద్రతా సిబ్బంది హెర్నాన్ అల్బెర్టో గిల్ ఫ్లోరెస్‌ను దాదాపు ఎనిమిది రోజుల తర్వాత అంతర్జాతీయ రెస్క్యూ బృందాలు సజీవంగా బయటకు తీశాయి. ఈ ఆలస్యంపై రెస్క్యూ బృందాలు వివరణ ఇచ్చుకున్నాయి.
హెర్నాన్ గిల్ చిక్కుకున్న భద్రతా గది పూర్తిగా కూలిపోకపోవడంతో చిన్న గాలి ఖాళీ (ఎయిర్ పాకెట్) ఏర్పడింది. మూడు రోజుల ముందే అతడి ఆచూకీ గుర్తించిన సిబ్బంది చిన్న గొట్టాల ద్వారా నీరు, ఆహారం, ఆక్సిజన్ అందించారు. ఏడు దేశాలకు చెందిన నిపుణులు మూడు మీటర్లకు పైగా సొరంగం తవ్వి అత్యంత జాగ్రత్తగా అతడిని బయటకు తీశారు. మొత్తం ఆపరేషన్‌కు వంద గంటలకు పైగా సమయం పట్టింది.
Hernán Gil, a 43-year-old security guard, survived eight days beneath a collapsed seven-story building in Catia La Mar, Venezuela. Rescuers from seven countries reached him after a three-day operation. The building came down in the country's twin earthquakes. pic.twitter.com/AMYODt8ia2
— Open Source Intel (@Osint613) July 2, 2026
అయితే ఈ రెస్క్యూ ఆలస్యానికి పలు కారణాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. భూకంపాల తర్వాత వెనెజువెలాను వందల సంఖ్యలో ఆఫ్టర్‌షాక్స్ వణికిస్తూనే ఉన్నాయి. ఆ ధాటికి కుప్పకూలిన భవనాల శిథిలాలు నిరంతరం కదులుతూనే ఉన్నాయి. దీంతో భారీ యంత్రాలను వినియోగిస్తే శిథిలాలు మరింత కూలిపోయి లోపల చిక్కుకున్న వారి ప్రాణాలకు, రక్షక సిబ్బందికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉండేది.
అధికారిక లెక్కల ప్రకారం వెనెజువెలా భూకంపాల్లో.. 2,295 మంది మరణించగా, 11,267 మంది గాయపడ్డారు. ఇంకో 45 వేల మంది జాడ తెలియాల్సి ఉంది. సుమారు 58 వేల భవనాలు కుప్పకూలిపోయాయి. వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వాళ్లను రక్షించే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి.
👉భూకంపం తర్వాత తొలి 72 గంటలను ‘‘గోల్డెన్ పీరియడ్’’గా పరిగణిస్తారు. ఈ సమయంలో శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షిస్తే ప్రాణాలతో బయటపడే అవకాశాలు అత్యధికంగా ఉంటాయి. ఆ తర్వాత ఆహారం, నీరు, ఆక్సిజన్ కొరత, తీవ్ర గాయాల కారణంగా బతికే అవకాశాలు వేగంగా తగ్గిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో ఎనిమిది రోజుల తర్వాత హెర్నాన్ గిల్ సజీవంగా బయటపడటం నిజంగా అద్భుతమే. అయితే అదే సమయంలో గోల్డెన్ పీరియడ్‌లోనే సహాయక చర్యలు మరింత వేగంగా జరిగి ఉంటే ఇంకా ఎంతమంది ప్రాణాలు దక్కేవో? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
మరోవైపు ధ్వంసమైన రహదారులు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, భారీ యంత్రాల కొరత, ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న వెనెజువెలా మౌలిక వసతుల బలహీనత కూడా సహాయక చర్యలను నెమ్మదింపజేశాయి. పైగా 1,600 మందికిపైగా విదేశీ రెస్క్యూ సిబ్బంది కాస్త ఆలస్యంగా వచ్చి చేరడంతో అప్పటి నుంచి సహాయక చర్యలు వేగం పుంజుకున్నాయి.
సహాయక చర్యల్లో.. ప్రభుత్వ స్పందనపై అసంతృప్తి కూడా పెరుగుతోంది. తొలి రోజుల్లో భారీ యంత్రాలు, సహాయక బృందాలు తగినంతగా అందుబాటులో లేవని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సహాయక సామగ్రి పంపిణీలో అవ్యవస్థలు చోటుచేసుకున్నాయని, భద్రతా సిబ్బంది దోపిడీలకు పాల్పడ్డారనే ఆరోపణలు రావడంతో ప్రజలు నిరసనలకు దిగారు. ఈ ఘటనలపై ఆగ్రహం వ్యక్తమవడంతో నలుగురు అధికారులను విధుల నుంచి తొలగించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంతర్జాతీయ సాయం ఆలస్యంగా చేరడం, ప్రభుత్వ సమన్వయం బలహీనంగా ఉండటం వల్ల రెస్క్యూ వేగం తగ్గిందని విమర్శలు కొనసాగుతున్నాయి.


