బుధవారం నుంచే అమల్లోకి
డొనాల్డ్ ట్రంప్ ప్రకటన
పెన్సిల్వేనియా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. తమ దేశంలో ఉక్కు పరిశ్రమను కాపాడుకుంటామని, ఇందుకోసం విదేశీ ఉక్కుపై సుంకాన్ని రెండు రెట్లు చేస్తామని అన్నారు. ఆయన శుక్రవారం పిట్స్‌బర్గ్‌లో ఇర్వీన్ స్టీల్ ప్లాంట్ కార్మికులతో మాట్లాడారు. విదేశాల నుంచి దిగుమతి అయ్యే ఉక్కుపై 50% టారిఫ్ విధించనున్నట్లు చెప్పారు.
జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్ సంస్థ అమెరికా స్టీల్ కంపెనీలో పెట్టుబడులు పెట్టబోతోందని, దీనిపై ఒప్పందం కుదిరిందని చెప్పారు. విదేశీ అల్యూమినియంపైనా టారిఫ్‌ను 50 శాతానికి పెంచనున్నట్లు ట్రంప్ తేల్చిచెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. స్టీల్‌తోపాటు అల్యూమినియంపై పెరిగిన టారిఫ్‌లు బుధవారం నుంచే అమల్లోకి వస్తాయని వెల్లడించారు. ఇదిలా ఉండగా, టారిఫ్‌ల పెంపుల వల్ల అమెరికాలో స్టీల్, అల్యూమినియం ధరలు విపరీతంగా పెరిగిపోతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
గృహ నిర్మాణం మరింత భారం కానుంది. ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఉక్కు ధరలు ఇప్పటికే 16%పెరిగిపోయాయి. అమెరికా తనకు అవసరమైన స్టీల్, అల్యూమినియంను ఎక్కువగా విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. మరోవైపు భారత్–పాకిస్తాన్ ఘర్షణలపై ట్రంప్ తన నోటి దురుసు ఆపడం లేదు. రెండు దేశాల అణుయుద్ధం జరిగే పరిస్థితిని నివారించినందుకు గర్వపడుతున్నానని మరోసారి చెప్పారు. కాల్పుల విరమణ వెనుక ట్రంప్ ప్రమేయం లేదని భారత్ పదేపదే చెబుతున్నా ఆయన పట్టించుకోవడం లేదు.